ajit dhoval
-
అదే జరిగితే ఎక్కువ సంతోషించేది మేమే.. అజిత్ దోవల్
జెదాహ్: ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సౌదీ అరేబియాలో జరుగుతున్న రెండ్రోజుల సమావేశాల్లో పాల్గొన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ యుద్ధ సమసిపోతే అంతకంటే సంతోషం మరొకటి ఉండదని అన్నారు. సౌదీ అరేబియా వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించగా మొత్తం 40 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించేందుకే వీరంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రష్యాను ఆహ్వానించకపోవడం విశేషం. భారత దేశం తరఫున అధికార ప్రతినిధిగా హాజరైన అజిత్ దోవల్ రెండు దేశాల మధ్య సంధిని కుదిర్చే విషయంలో తామెల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని తెలిపారు. అజిత్ దోవల్ మాట్లాడుతూ.. భారతదేశం తరపున మేము తరచుగా రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తూ.. దౌత్యాన్ని కుదర్చడానికి తమవంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నామన్నారు. ఇప్పటికే యుద్ధాన్ని ఆపడానికి అనేక దేశాలు తమకు తోచిన ప్రతిపాదనలు తెరపైకి తీసుకు రాగా వాటిలో కొన్ని మాత్రమే రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైనవి ఉన్నాయని అన్నారు. అలా కాకుండా రెండు దేశాలకూ సమ్మతమైన, శాశ్వతమైన, సమగ్ర పరిష్కారం కోసం భారతదేశం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన అంతర్జాతీయ చట్టాల్లోని నియమ నిబంధనలను భారత్ గౌరవిస్తుందని దాని ప్రకారమే రెండు దేశాల మధ్య సంధి కుదిర్చే ప్రయాత్నం చేస్తామని.. అదే జరిగితే తమకంటే ఎక్కువగా సంతోషించేవారు ఎవ్వరూ ఉండరని అన్నారు. అంతకుముందు జపాన్‌లో జరిగిన జీ7 సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జిలెన్‌స్కీని కలిసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని ఆయనకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: చికాగోలో రోడ్లపై తిరుగుతున్న హైదరాబాదీ మహిళకు ఉపశమనం -
చైనాపై నమ్మకం సన్నగిల్లింది.. అజిత్ ధోవల్
జోహన్నెస్‌బర్గ్ : వచ్చే నెలలో దక్షిణాఫ్రికా వేదికగా బ్రిక్స్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సన్నాహాల్లో భాగంగా మొదట జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)ల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న భారత జాతీయ భద్రతాధికారి అజిత్ దోవల్ చైనా తన నమ్మకాన్ని పోగొట్టుకుందని వ్యాఖ్యానించారు. ఈ సారి జరగబోయే బ్రిక్స్ సమావేశాల్లోనైనా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చైనా తరపున ఆ దేశ విదేశీ వ్యవహారాల కమిషన్ డైరెక్టర్ వాంగ్ యీ, భారత్ తరపున జాతీయ భద్రతాధికారి అజిత్ ధోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి, సరిహద్దు వివాదం తోపాటు మరికొన్ని కీలక అంశాల గురించి చర్చించారు. ఈ సందర్బంగా నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వద్ద పరిస్థితిని పరిష్కరించడానికి చైనాతో కలిసి పని చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ధోవల్ వాంగ్‌కు స్పష్టం చేశారు. ఢిల్లీ బీజింగ్ ల మధ్య సంబంధాలు మరింత మెరుగుపర్చాల్సిన ఆవశ్యకత ఉందని, రెండు దేశాల మధ్య సామరస్యత ప్రపంచ శాంతికి కూడా దోహదపడుతుందని అన్నారు. దీనికోసం బీజింగ్ మాతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సరిహద్దులో పరిస్థితి యథాస్థితికి రావాలంటే చైనా ముందు దూకుడు తగ్గించాలని, ఇప్పటికే వారు నమ్మకాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. అప్పుడే భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తాయని మరోసారి గుర్తు చేశారు. దీనికి స్పందిస్తూ వాంగ్ యీ ఏమన్నారంటే.. చైనా కూడా ధోవల్ ప్రస్తావించిన అంశాలపై సానుకూల దృక్పథంతోనే ఉందని రెండు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరమైతే శాంతిని స్థాపించవచ్చని అన్నారు. ఇది కూడా చదవండి: మంత్రి ఇంట్లో చోరీ.. కంప్లైంట్ ఇస్తే తిరిగి తన మెడకే చుట్టుకుని.. -
బోస్ ఉంటే దేశ విభజన జరిగేది కాదు
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే మనదేశం విడిపోయి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్జీ) అజిత్ ధోవల్ చెప్పారు. అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(అసోచామ్) శనివారం ఢిల్లీలో నిర్వహించిన మొదటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక ఉపన్యాసంలో ఆయన ప్రసంగించారు. ‘బోస్ నాయకత్వ సామర్థ్యాలు అసాధారణమైనవి. ఆయన దేశాన్ని కుల, మత, జాతి విభజనలకు అతీతమైన ఒక వాస్తవంగా గుర్తించారు. ఐక్య భారతం కోసం ఆయన కలలుగన్నారు. ఆయన ప్రసిద్ధ నినాదం కదమ్ కదమ్ బధాయే జా’అన్ని వర్గాల ప్రజలను కదిలించింది. ద్విజాతి సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చిన మహ్మద్ అలీ జిన్నా సైతం చంద్రబోస్ ఒక్కరినే నాయకుడిగా గుర్తిస్తానని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి బోస్ జీవించి ఉంటే భారతదేశ విభజన జరిగి ఉండేది కాదు’అని దోవల్ పేర్కొన్నారు. నేతాజీ తన జీవితంలోని వివిధ క్లిష్టమైన దశల్లో సాహసోపేతంగా వ్యవహరించారు. అప్పట్లో తిరుగులేని నేతగా ఉన్న గాంధీని సైతం నమ్మిన సిద్ధాంతం కోసం ఎదిరించిన ధైర్యం ఆయన సొంతం. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి మళ్లీ స్వాతంత్య్ర పోరాటం సాగించారు’అని ఎన్ఎస్జీ అప్పటి పరిణామాలను గుర్తు చేశారు. ప్రజల సామర్థ్యాలపై నేతాజీకి అపారమైన నమ్మకం ఉండేదన్నారు. దేశాభివృద్ధిపై ధోవల్ మాట్లాడుతూ.. ‘మన దేశానికున్న అతిపెద్ద బలం మానవ వనరులు...చురుకైన నిబద్ధత కలిగిన శ్రామికశక్తి. క్లిష్టమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంతోపాటు, మన శ్రామిక శక్తిని అంతర్జాతీయంగా పోటీ పడేలా నైపుణ్యాలను పెంపొందించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి’అని అన్నారు. -
భారీ ఉగ్ర ముప్పు తప్పింది!
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో గురువారం జరిగిన ఎన్కౌంటర్ దేశంలో తలపెట్టిన భారీ ఉగ్రవాద విధ్వంసాన్ని అడ్డుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భద్రతా బలగాల అప్రమత్తత వల్ల పెద్ద ఉపద్రవం తప్పిందన్నారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ఉన్నతాధికారులతో కీలక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి, సీనియర్ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను హతమార్చడంలో భద్రతా బలగాలు గొప్ప శౌర్యసాహసాలను ప్రదర్శించాయి. వారి వద్ద భారీ ఎత్తున లభించిన ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాలు వారు భారీ ఉగ్రదాడికి పన్నాగం పన్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భద్రతా బలగాల అప్రమత్తతతో పెద్ద విధ్వంసం తప్పింది’ అని ఆ సమావేశం తరువాత ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘భద్రతా బలగాల అప్రమత్తతకు అభినందనలు. వారు జమ్మూకశ్మీర్‌లో క్షేత్రస్థాయిలో జరగనున్న ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునే క్రూరమైన కుట్రను విజయవంతంగా అడ్డుకున్నారు’ అని మరో ట్వీట్లో ప్రశంసించారు. ముంబై దాడులు జరిగిన నవంబర్ 26న, అదే తరహాలో భారీ ఉగ్ర దాడి చేయాలని టెర్రరిస్టులు కుట్రపన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్ హైవేపై నగ్రోటా వద్ద గురువారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. వారు ప్రయాణిస్తున్న ట్రక్‌లో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించాయి. భారత్‌లో భారీ ఉగ్రదాడి లక్ష్యంతో వారు ఈ మధ్యనే పాక్ సరిహద్దులు దాటి భారత్‌లోకి వచ్చినట్లు భద్రతావర్గాలు భావిస్తున్నాయి. -
ముప్పు ఉంటే భారత్ యుద్ధం చేస్తుంది!
న్యూఢిల్లీ: జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ అక్టోబర్ 24న రిషికేష్‌లో చేసిన వ్యాఖ్యలు ఏ దేశాన్నో లేక ఏ పరిస్థితినో ఉద్దేశించిన చేసినవి కావని అధికారులు సోమవారం వివరణ ఇచ్చారు. అవి రిషికేష్‌లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారతదేశ నాగరికత గురించి ఆధ్యాత్మిక ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు అని వివరించారు. రిషికేష్‌లోని పారమార్ధ నికేతన్ ఆశ్రమంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ధోవల్ పాల్గొన్నారు. అక్కడ భక్తులను ఉద్దేశించి భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని గురించి ప్రసంగించారు. స్వామి వివేకానంద బోధనలను ప్రస్తావించారు. ‘భారతదేశం ఇప్పటివరకు ఎవరిపైనా దాడి చేయలేదు. దీని గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే, దేశానికి ముప్పు ఉందని భావిస్తే.. కచ్చితంగా భారత్ దాడి చేస్తుంది. ఎందుకంటే దేశాన్ని రక్షించడం చాలా ముఖ్యమైన విషయం. ప్రమాదం ఉందని భావిస్తే పోరాటం చేస్తుంది. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా, విస్తృత ప్రయోజనాలు లక్ష్యంగా ఆ పోరాటం ఉంటుంది. మన భూభాగంపై కానీ, ఇతరుల భూభాగంపై కానీ భారత్ పోరాడుతుంది. కానీ, అది స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రం కాదు.. విస్తృత ప్రయోజనాలు కేంద్రంగానే యుద్ధం చేస్తుంది’ అని ధోవల్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. తూర్పు లద్ధాఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాను ఉద్దేశించే ధోవల్ ఆ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నాయి. దాంతో, అధికారులు ధోవల్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. -
వెనుదిరిగేందుకు ఇంకొంతకాలం
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలోని భారత్, చైనా సైన్యాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాల ఉపసంహరణ ముగిసేందుకు మరికొన్ని రోజులు పడుతుందని ఆర్మీ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. పెట్రోలింగ్ పాయింట్ 15 హాట్‌స్ప్రింగ్స్ వద్ద ఉపసంహరణ ప్రక్రియ మంగళవారమే పూర్తి కావచ్చని, గొగ్రా ప్రాంతంలో మాత్రం మరి కొన్ని రోజులు పట్టవచ్చని తెలిపాయి. ఇరుదేశాల ఆర్మీ కమాండర్ స్థాయి అధికారుల మధ్య మూడు విడతలుగా జరిగిన చర్చలు, ఆ తరువాత భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిల మధ్య ఆదివారం జరిగిన చర్చల నేపథ్యంలో.. ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాలను సాధ్యమైనంత త్వరగా ఉపసంహరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా, బలగాలు, వాహనాలు, ఇతర సామగ్రి ఉపసంహరణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. పలు ప్రదేశాల్లో నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలను సోమవారం నుంచి చైనా తొలగించడం ప్రారంభించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ‘ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. రెండు దేశాల సైన్యాలు ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి 1 నుంచి 1.5 కిలోమీటర్ల వరకు వెనక్కు వెళ్లాలి. అలాగే, భవిష్యత్ కార్యాచరణ కోసం చర్చలు కొనసాగించాలి’ అని వెల్లడించాయి. చైనా ఉపసంహరణ ప్రక్రియను భారత సైన్యం నిశితంగా పరిశీలిస్తోందన్నాయి. బలగాలు వెనక్కు వెళ్తున్నప్పటికీ.. భారత సైన్యం అప్రమత్తంగానే ఉందని, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉందని తెలిపాయి. గల్వాన్ లోయలోని పీపీ 14 నుంచి చైనా బలగాలు వెనక్కు వెళ్లాయని, టెంట్స్‌ను తొలగించాయని తెలిపాయి. పాంగాంగ్ సొ ప్రాంతంలో మాత్రం చైనా బలగాల సంఖ్య స్వల్పంగా తగ్గడాన్ని గమనించామని పేర్కొన్నాయి. ఘర్షణ జరిగిన, జరిగే అవకాశమున్న ప్రాంతాల వద్ద మూడు కిలోమీటర్ల వరకు ‘బఫర్‌జోన్’ను ఏర్పాటు చేయాలని జూన్ 30న ఇరుదేశాల కమాండర్ స్థాయి చర్చల్లో నిర్ణయించారు. ఈ చర్చల సందర్భంగా.. క్షేత్రస్థాయి సైనికుల సంఖ్యలో తగ్గింపు విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు, మొత్తంగా ఉద్రిక్తతల సడలింపులో గణనీయ పురోగతి సాధించినట్లు చైనా తెలిపింది. లద్దాఖ్‌లో వాయుసేన రాత్రి గస్తీ తూర్పు లద్దాఖ్ పర్వతాలపై సోమవారం రాత్రి భారత వైమానిక దళ విమానాలు గస్తీ నిర్వహించాయి. ఒప్పందం ప్రకారం.. ఇరుదేశాల మధ్య ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైనప్పటికీ.. వైమానిక దళ సన్నద్ధతను, అప్రమత్తతను కొనసాగించాలని అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ పెట్రోలింగ్ జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాంగాంగ్ సొ, గొగ్రా, హాట్ స్ప్రింగ్స్ సహా అన్ని వివాదాస్పద ప్రదేశాల్లో య«థాతథ స్థితి నెలకొనే వరకు చైనాపై ఒత్తిడి తెవాలన్న వ్యూహంలో భాగంగా, రాత్రి, పగలు యుద్ధ విమానాల గస్తీ కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి. ‘ఈ పరిస్థితుల్లో మన సన్నద్ధతపై రాజీ ఉండకూడదు’ అని వ్యాఖ్యానించాయి. కొన్ని రోజులుగా భారత్ ఫైటర్ జెట్స్‌ను, ఎటాక్ చాపర్లను, రవాణా విమానాలను లద్దాఖ్‌లో మోహరిస్తోన్న విషయం తెలిసిందే. -
ఢిల్లీ ప్రశాంతం..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వణికించిన అల్లర్లు గురువారానికి కొంతవరకు సద్దుమణిగాయి. మౌజ్‌పూర్, భజన్‌పురల్లో చోటు చేసుకున్న చెదురు మదురు ఘటనలు మినహా అల్లర్లకు కేంద్ర స్థానమైన ఈశాన్య ఢిల్లీ ప్రశాంతంగానే ఉంది. అల్లర్లను కట్టడి చేసే ప్రత్యేక బాధ్యతల్లో ఉన్న జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ గురువారం కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి, వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కాగా, అల్లర్ల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో మరణించిన వారి సంఖ్య గురువారానికి 38కి చేరింది. బయట ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో అత్తగారింట్లోనే పెళ్లితంతు పూర్తిచేస్తున్న పెళ్లికొడుకు జోహ్రి ఎన్క్లేవ్ ప్రాంతంలోని ఓ మురుగు కాలువలో గురువారం ఉదయం ఒక మృతదేహాన్ని గుర్తించారు. మౌజ్‌పుర్, భజన్‌పురల్లో పలు చోట్ల వాహనాలను, దుకాణాలను తగలబెట్టిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ అల్లర్ల కేసును ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. అల్లర్ల కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేకంగా రెండు బృందాలను(సిట్) ఏర్పాటు చేశారు. డీసీపీలు జోయ్ టిర్కే, రాజేశ్ డియోల నేతృత్వంలో ఆ ప్రత్యేక దర్యాప్తు బృందాలు పని చేయనున్నాయి. ఆప్ నుంచి అల్లర్ల నిందితుడి సస్పెన్షన్ అల్లర్లకు సంబంధించి 48 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామని ఢిల్లీ హైకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అయితే, ఎంతమందిని అరెస్ట్ చేశారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. కాగా, ఇంటలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ హత్యలో పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సెలర్ తాహిర్ హుస్సేన్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు, తాహిర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆప్ నిర్ణయం తీసుకుంది. ప్రశాంతమే కానీ.. ఉద్రిక్త వాతావరణం ఈశాన్య ఢిల్లీలో గురువారం సైతం చాలా ప్రాంతాల్లో దుకాణాలు మూతబడి ఉన్నాయి. పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న చోట్ల ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కొన్ని కుటుంబాలు ఈ ప్రాంతం విడిచి వెళ్లిపోవడం కనిపించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ గురువారం ముజఫరాబాద్, మౌజ్‌పూర్, చాంద్‌బాగ్, గోకుల్‌పురి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించారు. భద్రతాబలగాలు అండగా ఉంటాయని వారికి అజిత్ ధోవల్ భరోసా ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు కవాతు చేపట్టారు. భద్రతాబలగాలను భారీ స్థాయిలో మోహరించారు. మృతదేహాలను తీసుకువచ్చేందుకు వచ్చిన కుటుంబీకులతో, క్షతగాత్రుల బంధువులతో జీటీబీ ఆసుపత్రి వద్ద గురువారం విషాద వాతావరణం నెలకొంది. 10 రోజుల కిత్రమే పెళ్లి జరిగిన అష్ఫాక్ హుస్సేన్ మృతదేహం వద్ద కుటుంబీకుల రోదనలు అక్కడున్నవారికి కన్నీళ్లు తెప్పించాయి. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే అష్ఫాక్ ఇంటికి తిరిగివస్తుండగా మంగళవారం గోకుల్‌పురి వద్ద దుండగుల కాల్పులకు గురయ్యారు. ఐరాస ఆందోళన భారత ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఢిల్లీలో మత ఘర్షణల్లో పోలీసుల ప్రేక్షకపాత్రపై ఐరాస మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. హింసను నివారించేందుకు కృషి చేయాలని రాజకీయ పార్టీల నేతలను కోరింది. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులనూ ప్రస్తావించింది. జెనీవాలో జరుగుతున్న మానవ హక్కుల కౌన్సిల్ సమావేశంలో ఐరాస మానవ హక్కుల కమిషనర్ మిచెల్ బాచ్లెట్ ఈ అంశాలను లేవనెత్తారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఈశాన్య ఢిల్లీలో కొనసాగుతున్న ఘర్షణల్లో్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున సాయం అందజేస్తామని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయ్యే వైద్య చికిత్స ఖర్చులను కూడా తమ ప్రభుత్వం భరిస్తుందన్నారు. గృహ దహనాల్లో కీలక పత్రాలను కోల్పోయిన ప్రజలకు తిరిగి వాటిని అందజేసేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గురువారం నిర్మానుష్యంగా మారిన ఈశాన్య ఢిల్లీలోని ఓ ప్రధాన రహదారి రాష్ట్రపతిని కలసిన కాంగ్రెస్ ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమేనని నిందిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం గురువారం రాష్ట్రపతి కోవింద్‌ను కలిశారు. ఢిల్లీ హింసకి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆదేశించాలని రాష్ట్రపతిని కోరారు. ఘర్షణల సమయంలో ఆయన తన విధి నిర్వహణలో పూర్తిగా విఫలం చెందారని , కేంద్రం తన రాజధర్మాన్ని పాటిస్తూ అమిత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ ప్రతినిధి బృందంలో మన్మోహన్, ఆజాద్, అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, ఖర్గే తదితరులు ఉన్నారు. కేసులో కేంద్రం ఇంప్లీడ్ స్పందనకు కేంద్రానికి 4 వారాల గడువు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి కేసులు నమోదు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో గురువారం కేంద్రప్రభుత్వమూ ఇంప్లీడ్ అయింది. ఢిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణ కేంద్రం పరిధిలోని అంశం కనుక, కేంద్ర హోం శాఖ కక్షిదారుగా చేరేందుకు అనుమతించాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ విజ్ఞప్తిని ఢిల్లీహైకోర్టు సీజే డీఎన్ పటేల్, జస్టిస్ హరిశంకర్ల బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. ఈ పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి 4 వారాల గడువిచ్చింది. అవి నెల క్రితం ప్రసంగాలు బీజేపీ నేతలు చేసినట్లుగా చెపుతున్న విద్వేష ప్రసంగాలు దాదాపు నెల రోజుల కిత్రం నాటివని సొలిసిటర్ జనరల్ తుషార్ కోర్టుకు తెలిపారు. అయినా, ఇది అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొంటూ పిటిషన్‌దారులు బుధవారం జస్టిస్ మురళీధర్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్‌ను తీసుకువచ్చారన్నారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ముందు ఈ పిటిషన్ గురువారం విచారణకు రానున్నప్పటికీ.. వారు అత్యవసరంగా జస్టిస్ మురళీధర్ ధర్మాసనాన్ని ఆశ్రయించారన్నారు. ఢిల్లీలో ప్రశాంత పరిస్థితిని నెలకొల్పేందుకు అంతా కృషి చేస్తున్నారని, ఈ సమయంలో కోర్టు జోక్యం చేసుకుంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని ఆయన ధర్మాసనానికి విన్నవించారు. విద్వేష ప్రసంగాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఢిల్లీ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది రాహుల్ మెహ్రా.. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సరైన ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. జస్టిస్ మురళీధర్ బదిలీ బుధవారం బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించిన జస్టిస్ మురళీధర్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని బుధవారం విచారణ సందర్భంగా జస్టిస్ మురళీధర్ ఆదేశించడం తెల్సిందే. జస్టిస్ మురళీధర్‌తో పాటు బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి రంజిత్ వసంత్‌రావు మోరె, కర్నాటక హైకోర్టు జడ్జి జస్టిస్ రావి విజయ్‌కుమార్ మాలిమత్‌లను బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించాక రాష్ట్రపతి ఈ బదిలీలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. జస్టిస్ మురళీధర్ ఢిల్లీ హైకోర్టులో మూడో సీనియర్ జడ్జి. సీఏఏ నిరసనకారులపై విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మలపై కేసులను నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసుల వైఫల్యాన్ని జస్టిస్ మురళీధర్ తీవ్రంగా తప్పుబట్టారు. కొందరిని రక్షించేందుకే.. ఢిల్లీ అల్లర్ల కేసు నుంచి కొందరు బీజేపీ నేతలను రక్షించేందుకే జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. న్యాయవ్యవస్థపై కేంద్రం బెదిరింపు ధోరణికి పాల్పడుతోందని స్పష్టమైందని విమర్శించింది. ఈ బదిలీ న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య అని, న్యాయాన్ని అణచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. గతంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన జస్టిస్ లోయాను ఒక ట్వీట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తావించారు. సుప్రీంకోర్టు సిఫారసుల మేరకే.. జస్టిస్ మురళీధర్ బదిలీ సుప్రీంకోర్టు కొలీజియం ఫిబ్రవరి 12న చేసిన సిఫారసుల మేరకే జరిగిందని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ పేర్కొన్నారు. సాధారణ పరిపాలనాపరమైన బదిలీని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సాధారణంగా, సంబంధిత న్యాయమూర్తి నుంచి అనుమతి తీసుకున్న తరువాతే బదిలీ చేస్తామన్నారు. ‘కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు. అందుకే దేశ అత్యున్నత వ్యవస్థలను నాశనం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’ అన్నారు. జస్టిస్ లోయాను రాహుల్ గాంధీ ప్రస్తావించడంపై స్పందిస్తూ.. ‘రాహుల్ సుప్రీంకోర్టు కన్నా తానే ఎక్కువ అనుకుంటాడు’ అని ఎద్దేవాచేశారు. జడ్జి బదిలీకి సంబంధించి ఫిబ్రవరి 12న సుప్రీం కొలీజియం సిఫారసులు చేసిందని, ఈ నిర్ణయం ఇప్పుడు ఆకస్మికంగా తీసుకున్నది కాదని కేంద్రమంత్రి జవదేకర్ వివరించారు. -
అయోధ్య ప్రశాంతం
లక్నో/అయోధ్య/న్యూఢిల్లీ: శతాబ్దాల నాటి మందిరం–మసీదు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు అనంతరం దేశవ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ హిందూ ముస్లిం నేతలతో సమావేశమై తీర్పు అనంతర పరిస్థితులపై చర్చించారు. కీలక తీర్పు వెలువరించిన ధర్మాసనంలోని జడ్జీల భద్రత కోసం అధికారులు ముందుజాగ్రత్తగా మరిన్ని చర్యలు తీసుకున్నారు. కాగా, కోర్టు తీర్పు ప్రకారం మసీదు కోసం ఐదెకరాల భూమిపై చర్చించేందుకు ఈ నెల 26న సున్నీ వక్ఫ్‌బోర్డు సమావేశం కానుంది. ఆలయ పట్టణం అయోధ్యలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీసు బలగాల గస్తీ, తనిఖీలు కొనసాగుతున్నా పట్టణంలోని ప్రధాన ఆలయాల్లో ఆదివారం భక్తుల సందడి తిరిగి మొదలయింది. తీర్పు సందర్భంగా శనివారం నాటి ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితులకు బదులుగా ఉత్సాహ పూరిత వాతావరణం కనిపించింది. హనుమాన్ గర్హి, నయాఘాట్ల వద్ద జరిగే శ్రీరామ, హనుమాన్ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సుప్రీం తీర్పు, తదనంతర పరిణామాలు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు రికాబ్‌గంజ్ తదితర ప్రాంతాల ప్రజలు వార్తా పత్రికలు చదివేందుకు ఆసక్తి చూపారు. ‘మాకిది చాలా అరుదైన, కొత్త శుభోదయం, ప్రత్యేకమైన ఆదివారం. అయోధ్య వివాదం శాశ్వతంగా పరిష్కారం కావడం ఎంతో ఊరట కలిగించింది’ అని అయోధ్యలోని ఓ హోటల్ మేనేజర్ సందీప్ సింగ్ అన్నారు. ‘రామ్‌లల్లాకు అనుకూలంగా తీర్పు రావడంతో పూలు, పూలదండలకు బాగా డిమాండ్ పెరుగుతుందని వారణాసి తదితర నగరాల నుంచి అదనంగా తెప్పిస్తున్నాం’ అని పూల దుకాణం యజమాని అనూప్ తెలిపారు. శనివారం హోం మంత్రి బిజీబిజీ తీర్పు వెలువడిన శనివారం హోం మంత్రి అమిత్ షా మిగతా కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకున్నారు. తీర్పు అనంతర పరిస్థితులపై వివిధ రాష్ట్రాల సీఎంలు, సీనియర్ పోలీసులు, నిఘా విభాగాల అధికారులతో ఆయన రోజంతా మాట్లాడారని అధికార వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితులపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ ప్రముఖ హిందు, ముస్లిం నేతలతో సమావేశమయ్యారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మత పెద్దలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యూపీలో 77 మంది అరెస్ట్ ఉత్తరప్రదేశ్‌లో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన 77 మందిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 34 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా సామాజిక మాధ్యమాల్లోని 8,275 పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోగా, అందులో 4,563 పోస్టులు ఆదివారం పోస్టు చేసినవిగా తెలిపారు. మధ్యప్రదేశ్‌లోనూ అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టిన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 26న సున్నీ వక్ఫ్ బోర్డు భేటీ మసీదు నిర్మాణానికి ఐదెకరాల భూమిని కేటాయించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించేందుకు సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు ఈనెల 26వ తేదీన సమావేశం కానుంది. ఆ ఐదెకరాల భూమిని తీసుకోవాలా వద్దా అనే విషయమై ఆ సమావేశంలో నిర్ణయిస్తామని యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జఫర్ ఫరూఖీ తెలిపారు. ‘కోర్టు తీర్పును సవాల్ చేసే ఉద్దేశం మాకు లేదు. అయితే, మసీదు కోసం ఆ స్థలాన్ని తీసుకోరాదని కొందరు.. ఆ స్థలంలో విద్యా సంస్థను ఏర్పాటు చేసి, పక్కనే మసీదు నిర్మిస్తే బాగుంటుందని మరికొందరు అంటున్నారు. దీనిపై వివరంగా చర్చిస్తాం’అని ఫరూఖీ వెల్లడించారు. జడ్జీలకు భద్రత పెంపు అయోధ్య కేసు తీర్పును ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో ఐదుగురు జడ్జీలకు భద్రతను ప్రభుత్వం మరింత పెంచింది. ‘ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, కాబోయే సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల నివాసాల వద్ద అదనపు బలగాలను మోహరించాం. వీరి నివాసాలకు దారితీసే రోడ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశాం. ఈ జడ్జీల వాహనాల వెంట సాయుధ బలగాలతో ఎస్కార్ట్ వాహనం ఉంటుంది’అని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. 7 భాషలు, 533 డాక్యుమెంట్లు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య భూవివాదానికి సంబంధించిన తీర్పు కోసం సుప్రీంకోర్టు భారీ కసరత్తే చేసింది. సంస్కృతం, హిందీ, ఉర్దూ, పర్షియన్, టర్కిష్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్లోని చరిత్ర, సంస్కృతి, పురావస్తు, మత పుస్తకాలను తిరగేసింది. ఇవేకాక మత సంబంధిత కావ్యాలు, యాత్రా వర్ణనలు, పురావస్తు నివేదికలు, బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందరి చిత్రాలు, గెజిటీర్లు, స్థూపాలపై గల శాసనాల అనువాదాలు, ఇలా 533 డాక్యుమెంట్లను పరిశీలించింది. -
భారత్‌లో పాంపియో.. మోదీ, ధోవల్‌తో భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో.. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఇరుదేశాల సంబంధాల బలోపేతంపై చర్చించారు. హెచ్ 1బీ వీసాలు, అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య యుద్ధ మేఘాలు, రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయాలుకుంటున్న ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థకు ఆటంకాలు తదితర అంశాలపై మోదీ, పాంపియో చర్చించినట్టు తెలుస్తోంది. జూన్ 28, 29 తేదీల్లో జపాన్‌లోని ఒసాకాలో జీ 20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ భేటీకానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అజిత్ దోవల్, జైశంకర్‌తోనూ భేటీ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తర్వాత.. అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యారు. సౌత్‌బ్లాక్‌లో జరిగిన ఈ భేటీలో ఉగ్రవాదంపై పోరాటం గురించి ఇద్దరు నేతలు చర్చించారు. తర్వాత విదేశాంగమంత్రి జయ్‌శంకర్‌తో పాంపియో చర్చలు జరిపారు. రష్యా నుంచి ఎస్ 400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు విషయంలో ఆంక్షలు గురించి ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రూ. 40వేల కోట్ల విలువైన ఎస్ 400 శ్రేణి క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్ గత అక్టోబరులో రష్యాతో ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందానికి అమెరికా అభ్యంతరం చెబుతూ వస్తోంది. రష్యాతో సుదీర్ఘ రక్షణ సంబంధాల దృష్ట్యా.. ఆంక్షల తొలగించేలా అమెరికాను ఒప్పించేందుకు జయ్శంకర్ సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. -
మోదీకి అత్యంత సన్నిహితులెవరు?
-
మోదీకి అత్యంత సన్నిహితులెవరు?
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితులైన మంత్రులెవరూ? మోదీకి కళ్లు-చెవులుగా వ్యవహారించే జూనియర్ మంత్రులెవరూ? మోదీ తరచూ మాట్లాడే ప్రతిపక్ష నాయకులెవరు? ప్రధాని మోదీ రోజు ఎంత మందిని కలుస్తారు?అసలు మోదీ డైలీ రొటిన్ ఎలా ఉంటుంది?... అయితే చదవండి... విదేశీ ప్రయాణాలు ఓ వైపు, బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించడం ఓ వైపు - క్షణం తీరికుండదు ప్రధాని నరేంద్ర మోదీకి. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో నిద్రలేచే మోదీ దినచర్య యోగాసనాలు, ప్రాణాయమంతో మొదలవుతుంది. ఆరున్నరకంతా ఆయన సిద్ధమవుతారు. దాదాపు గంట, గంటన్నర పాటు న్యూస్ పేపర్లు పరిశీలిస్తారు. ఎనిమిది గంటల ప్రాంతంలో రేస్ కోర్సు రోడ్డులోని ఆఫీసు గదికి వస్తారు. ముఖ్యమైన ఫోన్ కాల్స్ అన్నీ ఇక్కడి నుంచే చేస్తారట. తొమ్మిది గంటల నుంచి ఆయన అపాయింట్మెంట్స్ మొదలవుతాయి. సగటున మోదీ ప్రతీ రోజూ మూడు సమావేశాల్లో పాల్గొంటారు, కనీసం 50 నుంచి 65 మంది వ్యక్తుల్ని కలుస్తారు. ఉదయం పదిన్నర గంటలకల్లా సౌత్ బ్లాక్‌లోని తన ఆఫీసుకు చేరుకుంటారు మోదీ. అదే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉదయం 10 గంటల 45 నిమిషాల ప్రాంతంలోనే పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు. రాత్రి తొమ్మిదిన్నర నుంచి 11 గంటల మధ్య వివిధ రాష్ట్రాల్లో ఉన్న తన స్నేహితులకు, విదేశాల్లో ఉన్న సన్నిహితులకు ఫోన్ చేస్తారు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తెలుసుకునేందుకు మోదీ ప్రతీ రోజు అరగంట సమయం ప్రత్యేకంగా కేటాయిస్తారట. మోదీ దినచర్య ఇది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి, ఆహార శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లతో ప్రధాని మోదీ ప్రతీ రోజూ మాట్లాడుతారు. వీళ్ల అభిప్రాయాలకు చాలా విలువిస్తారని సమాచారం. ఇక జూనియర్ మంత్రులు నిర్మలా సీతారామన్, వి.కె.సింగ్, జితేంద్ర సింగ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, శర్వానంద్ సొనోవాల్‌ను ప్రధాని కళ్లు, చెవులుగా చెప్పుకోవచ్చు. అన్ని విషయాలపై ప్రధానికి సమగ్ర సమాచారమందించే బాధ్యత ఈ మంత్రులదని ప్రచారం. తన పార్టీకి చెందిన వారే కాదు ప్రతిపక్ష నేతలకూ ప్రధాని నరేంద్ర మోదీ తరచూ ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. ఈ జాబితాలో బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్సీపీ నేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కూడా నరేంద్ర మోదీ తరచూ మాట్లాడతారని సమాచారం. ఇక మోదీని అత్యధిక సార్లు కలిసేది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్. ఆయన కనీసం రోజు రెండుసార్లు ప్రధానితో భేటీ అవుతారు. కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా , ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాతో ప్రధాని మోదీ తరచూ మాట్లాడుతారు. ఇక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో ప్రధాని రోజుకూ కనీసం నాలుగు నుంచి ఐదుసార్లు మాట్లాడుతారట. రాజకీయంగా చోటుచేసుకునే ప్రతీ పరిణామాన్ని అప్ టూ డేట్‌గా తెలుసుకునేందుకు ప్రధాని ఆసక్తి చూపుతారు. - R. పరమేశ్వర్, సాక్షి టీవీ