ఢిల్లీ ప్రశాంతం..! | 38 dead in Delhi violence on Citizenship Amendment Act | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ప్రశాంతం..!

Published Fri, Feb 28 2020 3:39 AM | Last Updated on Fri, Feb 28 2020 9:48 AM

38 dead in Delhi violence on Citizenship Amendment Act - Sakshi

కోవింద్‌కు వినతిపత్రమిస్తున్న సోనియా, మన్మోహన్‌

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వణికించిన అల్లర్లు గురువారానికి కొంతవరకు సద్దుమణిగాయి. మౌజ్‌పూర్, భజన్‌పురల్లో చోటు చేసుకున్న చెదురు మదురు ఘటనలు మినహా అల్లర్లకు కేంద్ర స్థానమైన ఈశాన్య ఢిల్లీ ప్రశాంతంగానే ఉంది. అల్లర్లను కట్టడి చేసే ప్రత్యేక బాధ్యతల్లో ఉన్న జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్‌ గురువారం కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి, వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కాగా, అల్లర్ల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో మరణించిన వారి సంఖ్య గురువారానికి 38కి చేరింది.

బయట ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో అత్తగారింట్లోనే పెళ్లితంతు పూర్తిచేస్తున్న పెళ్లికొడుకు

జోహ్రి ఎన్‌క్లేవ్‌ ప్రాంతంలోని ఓ మురుగు కాలువలో గురువారం ఉదయం ఒక మృతదేహాన్ని గుర్తించారు. మౌజ్‌పుర్, భజన్‌పురల్లో పలు చోట్ల వాహనాలను, దుకాణాలను తగలబెట్టిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ అల్లర్ల కేసును ఢిల్లీ పోలీసులు క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. అల్లర్ల కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేకంగా రెండు బృందాలను(సిట్‌) ఏర్పాటు చేశారు. డీసీపీలు జోయ్‌ టిర్కే, రాజేశ్‌ డియోల నేతృత్వంలో ఆ ప్రత్యేక దర్యాప్తు బృందాలు పని చేయనున్నాయి.

ఆప్‌ నుంచి అల్లర్ల నిందితుడి సస్పెన్షన్‌
అల్లర్లకు సంబంధించి 48 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశామని ఢిల్లీ హైకోర్టుకు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. అయితే, ఎంతమందిని అరెస్ట్‌ చేశారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. కాగా, ఇంటలిజెన్స్‌ బ్యూరో ఉద్యోగి అంకిత్‌ శర్మ హత్యలో పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కౌన్సెలర్‌ తాహిర్‌ హుస్సేన్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మరోవైపు, తాహిర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆప్‌ నిర్ణయం తీసుకుంది.   

ప్రశాంతమే కానీ.. ఉద్రిక్త వాతావరణం
ఈశాన్య ఢిల్లీలో గురువారం సైతం చాలా ప్రాంతాల్లో దుకాణాలు మూతబడి ఉన్నాయి. పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న చోట్ల ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కొన్ని కుటుంబాలు ఈ ప్రాంతం విడిచి వెళ్లిపోవడం కనిపించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ గురువారం ముజఫరాబాద్, మౌజ్‌పూర్, చాంద్‌బాగ్, గోకుల్‌పురి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించారు. భద్రతాబలగాలు అండగా ఉంటాయని వారికి అజిత్‌ ధోవల్‌ భరోసా ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు కవాతు చేపట్టారు. భద్రతాబలగాలను భారీ స్థాయిలో మోహరించారు. మృతదేహాలను తీసుకువచ్చేందుకు వచ్చిన కుటుంబీకులతో, క్షతగాత్రుల బంధువులతో జీటీబీ ఆసుపత్రి వద్ద గురువారం విషాద వాతావరణం నెలకొంది. 10 రోజుల కిత్రమే పెళ్లి జరిగిన అష్ఫాక్‌ హుస్సేన్‌ మృతదేహం వద్ద కుటుంబీకుల రోదనలు అక్కడున్నవారికి కన్నీళ్లు తెప్పించాయి. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే అష్ఫాక్‌ ఇంటికి తిరిగివస్తుండగా మంగళవారం గోకుల్‌పురి వద్ద దుండగుల కాల్పులకు గురయ్యారు.   

ఐరాస ఆందోళన
భారత ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఢిల్లీలో మత ఘర్షణల్లో పోలీసుల ప్రేక్షకపాత్రపై ఐరాస మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. హింసను నివారించేందుకు కృషి చేయాలని రాజకీయ పార్టీల నేతలను కోరింది. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులనూ ప్రస్తావించింది. జెనీవాలో జరుగుతున్న మానవ హక్కుల కౌన్సిల్‌ సమావేశంలో ఐరాస మానవ హక్కుల కమిషనర్‌ మిచెల్‌ బాచ్‌లెట్‌ ఈ అంశాలను లేవనెత్తారు. 

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు
ఈశాన్య ఢిల్లీలో కొనసాగుతున్న ఘర్షణల్లో్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున సాయం అందజేస్తామని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అయ్యే వైద్య చికిత్స ఖర్చులను కూడా తమ ప్రభుత్వం భరిస్తుందన్నారు. గృహ దహనాల్లో కీలక పత్రాలను కోల్పోయిన ప్రజలకు తిరిగి వాటిని అందజేసేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

గురువారం నిర్మానుష్యంగా మారిన ఈశాన్య ఢిల్లీలోని ఓ ప్రధాన రహదారి

రాష్ట్రపతిని కలసిన కాంగ్రెస్‌
ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమేనని నిందిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం గురువారం రాష్ట్రపతి కోవింద్‌ను కలిశారు. ఢిల్లీ హింసకి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని ఆదేశించాలని రాష్ట్రపతిని కోరారు. ఘర్షణల సమయంలో ఆయన తన విధి నిర్వహణలో పూర్తిగా విఫలం చెందారని , కేంద్రం తన రాజధర్మాన్ని పాటిస్తూ అమిత్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ ప్రతినిధి బృందంలో మన్మోహన్, ఆజాద్, అహ్మద్‌ పటేల్, ఆనంద్‌ శర్మ, ఖర్గే తదితరులు ఉన్నారు.

కేసులో కేంద్రం ఇంప్లీడ్‌ స్పందనకు కేంద్రానికి 4 వారాల గడువు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి కేసులు నమోదు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో గురువారం కేంద్రప్రభుత్వమూ ఇంప్లీడ్‌ అయింది. ఢిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణ కేంద్రం పరిధిలోని అంశం కనుక, కేంద్ర హోం శాఖ  కక్షిదారుగా చేరేందుకు అనుమతించాలన్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ విజ్ఞప్తిని ఢిల్లీహైకోర్టు సీజే డీఎన్‌ పటేల్, జస్టిస్‌ హరిశంకర్‌ల బెంచ్‌ పరిగణనలోకి తీసుకుంది. ఈ పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి 4 వారాల గడువిచ్చింది.

అవి నెల క్రితం ప్రసంగాలు
బీజేపీ నేతలు చేసినట్లుగా చెపుతున్న విద్వేష ప్రసంగాలు దాదాపు నెల రోజుల కిత్రం నాటివని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ కోర్టుకు తెలిపారు. అయినా, ఇది అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొంటూ పిటిషన్‌దారులు బుధవారం జస్టిస్‌ మురళీధర్‌ బెంచ్‌ ముందుకు ఈ పిటిషన్‌ను తీసుకువచ్చారన్నారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ ముందు ఈ పిటిషన్‌ గురువారం విచారణకు రానున్నప్పటికీ.. వారు అత్యవసరంగా జస్టిస్‌ మురళీధర్‌ ధర్మాసనాన్ని ఆశ్రయించారన్నారు. ఢిల్లీలో ప్రశాంత పరిస్థితిని నెలకొల్పేందుకు అంతా కృషి చేస్తున్నారని, ఈ సమయంలో కోర్టు జోక్యం చేసుకుంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని ఆయన ధర్మాసనానికి విన్నవించారు. విద్వేష ప్రసంగాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే విషయంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఢిల్లీ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది రాహుల్‌ మెహ్రా.. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సరైన ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.

జస్టిస్‌ మురళీధర్‌ బదిలీ
బుధవారం బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశించిన జస్టిస్‌ మురళీధర్‌
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ మురళీధర్‌ బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్‌ అండ్‌ హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చెయ్యాలని బుధవారం విచారణ సందర్భంగా జస్టిస్‌ మురళీధర్‌ ఆదేశించడం తెల్సిందే.

జస్టిస్‌ మురళీధర్‌తో పాటు బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి రంజిత్‌ వసంత్‌రావు మోరె, కర్నాటక హైకోర్టు జడ్జి జస్టిస్‌ రావి విజయ్‌కుమార్‌ మాలిమత్‌లను బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించాక రాష్ట్రపతి ఈ బదిలీలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. జస్టిస్‌ మురళీధర్‌ ఢిల్లీ హైకోర్టులో మూడో సీనియర్‌ జడ్జి. సీఏఏ నిరసనకారులపై విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలు కపిల్‌ మిశ్రా, అనురాగ్‌ ఠాకూర్, పర్వేశ్‌ వర్మలపై కేసులను నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసుల వైఫల్యాన్ని జస్టిస్‌ మురళీధర్‌ తీవ్రంగా తప్పుబట్టారు.



కొందరిని రక్షించేందుకే..
ఢిల్లీ అల్లర్ల కేసు నుంచి కొందరు బీజేపీ నేతలను రక్షించేందుకే జస్టిస్‌ మురళీధర్‌ను బదిలీ చేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. న్యాయవ్యవస్థపై కేంద్రం బెదిరింపు ధోరణికి పాల్పడుతోందని స్పష్టమైందని విమర్శించింది. ఈ బదిలీ న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య అని, న్యాయాన్ని అణచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. గతంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన జస్టిస్‌ లోయాను ఒక ట్వీట్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు.  

సుప్రీంకోర్టు సిఫారసుల మేరకే..
జస్టిస్‌ మురళీధర్‌ బదిలీ సుప్రీంకోర్టు కొలీజియం ఫిబ్రవరి 12న చేసిన సిఫారసుల మేరకే జరిగిందని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ పేర్కొన్నారు. సాధారణ పరిపాలనాపరమైన బదిలీని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సాధారణంగా, సంబంధిత న్యాయమూర్తి నుంచి అనుమతి తీసుకున్న తరువాతే బదిలీ చేస్తామన్నారు. ‘కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు. అందుకే దేశ అత్యున్నత వ్యవస్థలను నాశనం చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది’ అన్నారు. జస్టిస్‌ లోయాను రాహుల్‌ గాంధీ ప్రస్తావించడంపై స్పందిస్తూ.. ‘రాహుల్‌ సుప్రీంకోర్టు కన్నా తానే ఎక్కువ అనుకుంటాడు’ అని ఎద్దేవాచేశారు. జడ్జి బదిలీకి సంబంధించి ఫిబ్రవరి 12న సుప్రీం కొలీజియం సిఫారసులు చేసిందని, ఈ నిర్ణయం ఇప్పుడు ఆకస్మికంగా తీసుకున్నది కాదని కేంద్రమంత్రి జవదేకర్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement