
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో.. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఇరుదేశాల సంబంధాల బలోపేతంపై చర్చించారు. హెచ్ 1బీ వీసాలు, అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య యుద్ధ మేఘాలు, రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయాలుకుంటున్న ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థకు ఆటంకాలు తదితర అంశాలపై మోదీ, పాంపియో చర్చించినట్టు తెలుస్తోంది. జూన్ 28, 29 తేదీల్లో జపాన్‌లోని ఒసాకాలో జీ 20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ భేటీకానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
అజిత్ దోవల్, జైశంకర్‌తోనూ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తర్వాత.. అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యారు. సౌత్‌బ్లాక్‌లో జరిగిన ఈ భేటీలో ఉగ్రవాదంపై పోరాటం
గురించి ఇద్దరు నేతలు చర్చించారు. తర్వాత విదేశాంగమంత్రి జయ్‌శంకర్‌తో పాంపియో చర్చలు జరిపారు. రష్యా నుంచి ఎస్ 400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు విషయంలో ఆంక్షలు గురించి ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రూ. 40వేల కోట్ల విలువైన ఎస్ 400 శ్రేణి క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్ గత అక్టోబరులో రష్యాతో ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందానికి అమెరికా అభ్యంతరం చెబుతూ వస్తోంది. రష్యాతో సుదీర్ఘ రక్షణ సంబంధాల దృష్ట్యా.. ఆంక్షల తొలగించేలా అమెరికాను ఒప్పించేందుకు జయ్‌శంకర్ సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment