న్యూఢిల్లీ: తజకిస్తాన్ రాజధాని దుషాంబేలో 17న ప్రారంభంకానున్న వార్షిక షాంఘై సహకార సంఘం(ఎస్‌సీవో) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ(వర్చువల్) పద్ధతిలో ప్రసంగించనున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ నేరుగా దుషాంబేకు వెళ్లి అక్కడ జరుగుతున్న ఎస్‌సీవో సదస్సులో పాల్గొని భారత అభిప్రాయాలను పంచుకోనున్నారు. అఫ్గాన్ సంక్షోభం కారణంగా తలెత్తే పరిణామాలపై సదస్సులో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
‘తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలి రహ్మాన్ అధ్యక్షత ప్రారంభమయ్యే 21వ ఎస్‌సీవో సదస్సులో సభ్య దేశాల అగ్రనేతలు నేరుగా, వర్చువల్ పద్ధతిలో ప్రసంగించనున్నారు. భారత ప్రతినిధి బృందం తరఫున ప్రధాని మోదీ సదస్సు ప్లీనరీ సెషన్‌లో ప్రసంగించనున్నారు’ అని భారత విదేశాంగ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈసారి సమావేశాల్లో ఎస్‌సీవో సభ్య దేశాల నేతలు, పరిశీలక దేశాలు, ఎస్‌సీవో ప్రధాన కార్యదర్శి, ఎస్‌సీవో ప్రాంత ఉగ్రవ్యతిరేక విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముఖ్య అతిథులు పాల్గొననున్నారు. వర్చువల్ పద్ధతిలో సదస్సు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఎస్‌సీవోలో పూర్తి స్థాయి సభ్య దేశం హోదా సంపాదించాక భారత్ ఈ సదస్సులో పాల్గొనడం ఇది నాలుగోసారి. ‘ఎస్‌సీవో 20వ వార్షికోత్సవం సందర్భంగా గత రెండు దశాబ్దాల్లో సాధించిన ప్రగతిపై సమీక్ష జరిగే అవకాశముంది. భవిష్యత్తులో దేశాల సహకారంపైనా చర్చ జరగొచ్చు’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరాన్, తజకిస్తాన్, ముఖ్య దేశాల విదేశాంగ మంత్రులతో జై శంకర్ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. చైనా, రష్యా, పాక్ విదేశాంగ మంత్రులు సదస్సుకు హాజరుకానున్నారు. నాటో తరహాలో ఎనిమిది దేశాల కూటమిగా ఎస్‌సీవో ఆవిర్భవించింది. 2017 నుంచి భారత్, పాక్‌లు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులు సంయుక్తంగా 2001లో షాంఘైలో ఎస్‌సీవోను స్థాపించారు. భద్రతాపరమైన అంతర్జాతీయ సహకారం కోసం ఎస్‌సీవోతో, రక్షణ అంశాల్లో ఉమ్మడి పోరు కోసం యాంటీ–టెర్రరిజం స్ట్రక్చర్(ర్యాట్స్)లతో భారత్ కలిసి పనిచేస్తోంది.
ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ చర్చ
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో ప్రధాని మోదీ బుధవారం మాట్లాడారు. భారత్–ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మ భాగస్వామ్యంలో పురోగతిపై నేతలిద్దరూ చర్చించారు. ‘త్వరలో జరగబోయే ‘క్వాడ్’ సదస్సు గురించీ చర్చించాము’ అని ఆ తర్వాత మోదీ ట్వీట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment