
మోదీకి అత్యంత సన్నిహితులెవరు?
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితులైన మంత్రులెవరూ? మోదీకి కళ్లు-చెవులుగా వ్యవహారించే జూనియర్ మంత్రులెవరూ? మోదీ తరచూ మాట్లాడే ప్రతిపక్ష నాయకులెవరు? ప్రధాని మోదీ రోజు ఎంత మందిని కలుస్తారు?అసలు మోదీ డైలీ రొటిన్ ఎలా ఉంటుంది?... అయితే చదవండి...
విదేశీ ప్రయాణాలు ఓ వైపు, బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించడం ఓ వైపు - క్షణం తీరికుండదు ప్రధాని నరేంద్ర మోదీకి. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో నిద్రలేచే మోదీ దినచర్య యోగాసనాలు, ప్రాణాయమంతో మొదలవుతుంది. ఆరున్నరకంతా ఆయన సిద్ధమవుతారు. దాదాపు గంట, గంటన్నర పాటు న్యూస్ పేపర్లు పరిశీలిస్తారు. ఎనిమిది గంటల ప్రాంతంలో రేస్ కోర్సు రోడ్డులోని ఆఫీసు గదికి వస్తారు. ముఖ్యమైన ఫోన్ కాల్స్ అన్నీ ఇక్కడి నుంచే చేస్తారట. తొమ్మిది గంటల నుంచి ఆయన అపాయింట్‌మెంట్స్ మొదలవుతాయి. సగటున మోదీ ప్రతీ రోజూ మూడు సమావేశాల్లో పాల్గొంటారు, కనీసం 50 నుంచి 65 మంది వ్యక్తుల్ని కలుస్తారు. ఉదయం పదిన్నర గంటలకల్లా సౌత్ బ్లాక్‌లోని తన ఆఫీసుకు చేరుకుంటారు మోదీ. అదే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉదయం 10 గంటల 45 నిమిషాల ప్రాంతంలోనే పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు.
రాత్రి తొమ్మిదిన్నర నుంచి 11 గంటల మధ్య వివిధ రాష్ట్రాల్లో ఉన్న తన స్నేహితులకు, విదేశాల్లో ఉన్న సన్నిహితులకు ఫోన్ చేస్తారు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తెలుసుకునేందుకు మోదీ ప్రతీ రోజు అరగంట సమయం ప్రత్యేకంగా కేటాయిస్తారట. మోదీ దినచర్య ఇది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి, ఆహార శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లతో ప్రధాని మోదీ ప్రతీ రోజూ మాట్లాడుతారు. వీళ్ల అభిప్రాయాలకు చాలా విలువిస్తారని సమాచారం.
ఇక జూనియర్ మంత్రులు నిర్మలా సీతారామన్, వి.కె.సింగ్, జితేంద్ర సింగ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, శర్వానంద్ సొనోవాల్‌ను ప్రధాని కళ్లు, చెవులుగా చెప్పుకోవచ్చు. అన్ని విషయాలపై ప్రధానికి సమగ్ర సమాచారమందించే బాధ్యత ఈ మంత్రులదని ప్రచారం. తన పార్టీకి చెందిన వారే కాదు ప్రతిపక్ష నేతలకూ ప్రధాని నరేంద్ర మోదీ తరచూ ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. ఈ జాబితాలో బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్సీపీ నేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కూడా నరేంద్ర మోదీ తరచూ మాట్లాడతారని సమాచారం.
ఇక మోదీని అత్యధిక సార్లు కలిసేది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్. ఆయన కనీసం రోజు రెండుసార్లు ప్రధానితో భేటీ అవుతారు. కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా , ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాతో ప్రధాని మోదీ తరచూ మాట్లాడుతారు. ఇక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో ప్రధాని రోజుకూ కనీసం నాలుగు నుంచి ఐదుసార్లు మాట్లాడుతారట. రాజకీయంగా చోటుచేసుకునే ప్రతీ పరిణామాన్ని అప్ టూ డేట్‌గా తెలుసుకునేందుకు ప్రధాని ఆసక్తి చూపుతారు.
- R. పరమేశ్వర్, సాక్షి టీవీ