ముంబై: పులిని ఎవరూ బెదిరించలేరు...మా సత్తా ఏంటో మాకు తెలుసు...కొత్త పొత్తుల కోసం పాత మిత్రులను దూరం చేసుకోవాలని చూస్తే ఖబడ్దార్...అంటూ శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే బీజేపీపై మండిపడ్డారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)తో బీజేపీ వైఖరేంటో స్పష్టం చేయాలని ఉద్ధవ్ గురువారం మీడియాతో అన్నారు. మహాకూటమిలో విభేదాలు సృష్టించేలా వ్యవహరిస్తున్న కొంత మంది నేతలను ఇప్పటికైనా బీజేపీ నియంత్రించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ‘ఐదు పార్టీలు ఉన్న మహాకూటమినిబ్రేక్ చేయం. ఇప్పటికీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. మాకు అనుకూల వాతావరణం ఉంది. కేంద్రం, రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తాం. అందులో ఎలాంటి సందేహం లేద’ని అన్నారు. కూటమిలో అసమ్మతి రేగేలా వ్యవహరిస్తున్న నాయకులను ఆ పార్టీ నాయకత్వం అదుపు చేయాల్సిన అవసరముందని బీజేపీకి హెచ్చరికలు పంపారు.
మమ్మల్ని ఎవరూ వంచించలేరని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేకంగా అభ్యర్థులను దింపొద్దని రాజ్‌ఠాక్రేను నితిన్ గడ్కారీ కలిసి కోరడంపై మండిపడ్డారు. రాష్ట్ర వ్యవహారాల్లో పార్టీ అధినాయకత్వం తీసుకునే వ్యవహారాన్ని ఒక్క వ్యక్తే ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. నిన్న బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారని, తమ పార్టీ సమావేశాలు జరిగాక మరో రెండు రోజుల్లో ఫోన్‌కాల్ చేస్తానని తెలిపారని వివరించారు. ఎన్‌డీఏ కూటమిలోకి ఏ కొత్త భాగస్వామిని తీసుకోమని హామీ ఇచ్చారని వివరించారు. ఎన్‌డీఏను అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు తాను కృషి చేస్తున్నానని వెల్లడించారు. అయితే కొంత మంది తమ స్పీడ్‌కు బ్రేక్‌లు వేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
సామ్నా సంపాదకీయంలోను విసుర్లు
ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేతో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ భేటీ అనంతరం జరిగిన పరిణామాలపై శివసేన ఇప్పటికే అసంతృప్తితోనే ఉంది. దీనిపై ఇప్పటికే పార్టీ నాయకులు ఉద్ధవ్ ఠాక్రేను కలిసి బుజ్జగించారు. అయినప్పటికీ మరోసారి ఆయన సామ్నా పత్రిక సంపాదకీయంలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. మీకు ఏ మిత్రులైతే వెన్నంటి మద్దతిస్తున్నారో.. వారిని పక్కనబెట్టాలని చూస్తే, ప్రజల మనస్సులో ఏర్పడే అవిశ్వాసమనే రాళ్లు మీ తలపై పడుతాయని పరోక్షంగా బీజేపీని హెచ్చరించారు. ఈ విధంగా ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై పరోక్షంగా అవిశ్వాసానికి పాల్పడేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. తాము ఒంటరిగా పోరాడేందుకు కూడా సమర్థులమని హెచ్చరించారు. ప్రత్యర్థులపై కొట్టాల్సిన లాఠీని తమ తలపై కొట్టుకుని తలపై బొడుపు (బొడుసు)లు తెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలోని మా మిత్రపక్షమైన బీజేపీకి బొడుపు వచ్చిందా..? వస్తే ఎవరు బాధ్యులని పరోక్షంగా ఎమ్మెన్నెస్ సాన్నిహిత్యంపై చురకలంటించారు. మిత్రుడు ఉండగానే ప్రత్యర్థునితో దొడ్డిదారిన చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తే ఇలాగే ఉంటుందన్నారు.
మహాకూటమిలో అసమ్మతి మొదలైంది
ముంబై: ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే వల్ల బీజేపీ, శివసేనల మధ్య ప్రారంభమైన వివాదం ముదిరిందని ఎన్సీపీ పేర్కొంది. ప్రస్తుతం శివసేన, బీజేపీల మధ్య యుద్ధం జరుగుతోందని, ఆ తర్వాత మహాకూటమిలో ఉన్న మిగతా పార్టీలకి అసమ్మతి సెగ తాకుతుందని రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు భాస్కర్ జాదవ్ గురువారం మీడియాకు తెలిపారు. మండలి ఎన్నికల నుంచి నామినేషన్ వెనక్కి తీసుకున్న నార్వేకర్‌ను అభినందించారు.
రైతులను ఆదుకోండి: ఉద్ధవ్
ముంబై: రాష్ట్రంలో ఇటీవల కురిసిక అకాల వర్షాలు ధాటికి పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పార్టీల నాయకులు ముందుకు రావాలని ఆయన గురువారం మీడియాతో అన్నారు. తక్షణమే ప్రభుత్వం బాధితులకు ఆర్థిక సహాకారం అందించాలని తెలిపారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంటే ప్రభుత్వం నుంచి రైతులకు ఆర్థిక సహాయం అందించడం సులువవుతుందన్నారు. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అగ్ర నేతలు ఏకతాటిపైకి వచ్చి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 12 లక్షలకు పైగా హెక్టార్లలో పంట ధ్వంసమైంది.
‘పులి’తో ఆటలొద్దు!
Published Thu, Mar 13 2014 10:26 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement