న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే మనదేశం విడిపోయి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌జీ) అజిత్ ధోవల్ చెప్పారు. అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(అసోచామ్) శనివారం ఢిల్లీలో నిర్వహించిన మొదటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక ఉపన్యాసంలో ఆయన ప్రసంగించారు. ‘బోస్ నాయకత్వ సామర్థ్యాలు అసాధారణమైనవి. ఆయన దేశాన్ని కుల, మత, జాతి విభజనలకు అతీతమైన ఒక వాస్తవంగా గుర్తించారు. ఐక్య భారతం కోసం ఆయన కలలుగన్నారు. ఆయన ప్రసిద్ధ నినాదం కదమ్ కదమ్ బధాయే జా’అన్ని వర్గాల ప్రజలను కదిలించింది. ద్విజాతి సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చిన మహ్మద్ అలీ జిన్నా సైతం చంద్రబోస్ ఒక్కరినే నాయకుడిగా గుర్తిస్తానని చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చే నాటికి బోస్ జీవించి ఉంటే భారతదేశ విభజన జరిగి ఉండేది కాదు’అని దోవల్ పేర్కొన్నారు. నేతాజీ తన జీవితంలోని వివిధ క్లిష్టమైన దశల్లో సాహసోపేతంగా వ్యవహరించారు. అప్పట్లో తిరుగులేని నేతగా ఉన్న గాంధీని సైతం నమ్మిన సిద్ధాంతం కోసం ఎదిరించిన ధైర్యం ఆయన సొంతం. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి మళ్లీ స్వాతంత్య్ర పోరాటం సాగించారు’అని ఎన్‌ఎస్‌జీ అప్పటి పరిణామాలను గుర్తు చేశారు. ప్రజల సామర్థ్యాలపై నేతాజీకి అపారమైన నమ్మకం ఉండేదన్నారు. దేశాభివృద్ధిపై ధోవల్ మాట్లాడుతూ.. ‘మన దేశానికున్న అతిపెద్ద బలం మానవ వనరులు...చురుకైన నిబద్ధత కలిగిన శ్రామికశక్తి. క్లిష్టమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంతోపాటు, మన శ్రామిక శక్తిని అంతర్జాతీయంగా పోటీ పడేలా నైపుణ్యాలను పెంపొందించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment