ఫైల్ ఫోటో
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ : రాజకీయ ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి కర్తార్‌పూర్ కారిడర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిద్దూను పాక్ ముఖ్య అతిథిగా పిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇమ్రాన్‌పై సిద్దూ ప్రశంసల జల్లు కురిపించాడు. కర్తార్‌పూర్ కారిడర్ నిర్మాణానికి సహకరించిన ఇమ్రాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిద్దూ గురించి పాకిస్తాన్ సెనేట్ ఫైజల్ జావెద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘పాక్ స్నేహితుడు నవజ్యోత్‌సింగ్ సిద్దూ 9 టెస్టు సెంచరీలు సాధించాడు. కానీ పాకిస్తాన్‌పై మాత్రం సాధించలేదు. ఇంతకంటే ఏం రుజువు కావాలి.. పాకిస్తాన్‌పై ముఖ్యంగా ప్రధాని ఇమ్రాన్‌పై సిద్దూకు ఎంత ప్రేమ ఉందో తెలపడానికి’అంటూ ఫైజల్ వ్యాఖ్యానించాడు. ఇక 1989-90లో పాక్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో సిద్దూ సభ్యుడు. ఆ పర్యటనలో పాక్ జట్టుకు ఇమ్రాన్ సారథ్యం వహించాడు. అయితే ఈ పర్యటనలో ఏడు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగిన సిద్దూ సెంచరీ సాధించలేకపోయాడు. అత్యధికంగా 97 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే సిద్దూ పాక్‌పై సెంచరీ చేయలేదనే విషయాన్ని పాక్ సెనేటర్ గుర్తుచేశాడు. ప్రస్తుతం సిద్దూపై పాక్ సెనేటర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారాతో పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించే కర్తార్‌పూర్ కారిడార్ శనివారం ప్రారంభమైంది. సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ కారిడర్‌ను ప్రారంభించారు. ఈ రోజు 500 మంది భారత యాత్రికులతో కూడిన మొదటి బృందం కర్తార్‌పూర్ వెళ్లింది. ఈ బృందంలో సిద్దూ కూడా సభ్యుడే.
Comments
Please login to add a commentAdd a comment