దేశ విభజన పాపం కాంగ్రెస్‌దే
ఖేడా (గుజరాత్): అత్యుత్సాహంతో ఉన్న కొందరు బీజేపీ నేతలు దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపాలను మారుస్తున్నారంటూ ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఆదివారం తిప్పికొట్టారు. కేవలం నెహ్రూ -గాంధీ కుటుంబాన్ని మాత్రమే స్తుతిస్తూ.. జాతీయ హీరోలను (నాయకులను) కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని, దేశ చరిత్రను మార్చడమే కాకుండా విభజనతో భౌగోళిక స్వరూపాన్నీ మారుస్తోందంటూ ధ్వజమెత్తారు. ఆదివారమిక్కడ ఓ ముస్లిం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించిన ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మోడీ ఈ మేరకు మాట్లాడారు. ‘ప్రధానమంత్రి గారూ.. మీ చేతుల్లో ఏమీ లేదని నాకు తెలుసు.
కానీ దేశ స్వరూపాన్ని మార్చిందెవరో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు పుట్టిన గ్రామం (పాకిస్థాన్‌లోని గాహ్) ఒకప్పుడు హిందూస్థాన్‌లో భాగం. నేడు కాదు. మరి ఎవరు భౌగోళిక రూపాన్ని మార్చారు? ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసిందెవరు?’ అంటూ మోడీ ప్రశ్నించారు. చైనా ఆక్రమణతో కూడా దేశ స్వరూపం కాంగ్రెస్ పాలనలోనే మారిపోయిందని, గుజరాత్‌లో సబర్మతి-దండి చరిత్రాత్మక రోడ్డునూ మార్చాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. నెహ్రూ, ఇందిర బతికుండగానే భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్.. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు మాత్రం చనిపోయిన 41 ఏళ్ల తర్వాత, బీఆర్ అంబేద్కర్‌కు స్వాతంత్య్రం వచ్చిన 33 ఏళ్లకు ఇచ్చిందని విమర్శించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్రయం లాల్-బాల్-పాల్‌లను కాంగ్రెస్ విస్మరించిందని, సోమవారం (నేడు) అబుల్ కలాం ఆజాద్, జేబీ కృపలానీ 125వ జయంతికీ ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించడం లేదన్నారు. ధరల పెరుగుదల, అవినీతి వంటి అంశాలపై ప్రధాని మాట్లాడి ఉంటే బాగుండేదని, కానీ ఆయన చరిత్ర, భౌగోళిక స్వరూపాల గురించి మాట్లాడటం విచారకరమన్నారు.