మోదీ అల్పబుద్ధికి నిదర్శనమంటూ కాంగ్రెస్ ధ్వజం
పదేళ్ల తర్వాత పంద్రాగస్టు వేడుకల్లో విపక్ష నేత
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రతిపక్ష నేత పాల్గొనడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అయితే ఆయనకు ఐదో వరుసలో సీటు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. రాహుల్ ముందు వరుసలో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత హాకీ క్రీడాకారులు కూర్చున్నారు. ఈ ఉదంతం ప్రధాని నరేంద్ర మోదీ అల్పబుద్ధికి నిదర్శనమంటూ కాంగ్రెస్ మండిపడింది.
‘‘లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలైన రాహుల్, మల్లికార్జున ఖర్గేలకు ప్రొటోకాల్ ప్రకారం తొలి వరుసలో సీటు కేటాయించాలి. కానీ వారిని ఐదో వరుసలో కూర్చోబెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మోదీలో అహంకారం తగ్గలేదు’’ అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ దుయ్యబట్టారు. ముందు వరుసలను ఒలింపిక్ విజేతలకు కేటాయించినందున రాహుల్‌ను వెనక వరుసకు మార్చామన్న రక్షణ శాఖ వివరణపై ఆయన తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు.
‘‘క్రీడాకారులకు గౌరవమివ్వాల్సిందే. కానీ అందుకోసం కొందరినే వెనక్కు జరిపారెందుకు? అమిత్ షా, జేపీ నడ్డా, ఎస్.జైశంకర్, నిర్మలా సీతారామన్ తదితర కేంద్ర మంత్రులను మొదటి వరుసలోనే ఎలా కూర్చోబెట్టారు?’’ అని ప్రశ్నించారు. దీనిపై సోషల్ మీడియాలోనూ బాగా చర్చ జరిగింది. లోక్‌సభలో విపక్ష నేతకు కేబినెట్ హోదా ఉంటుంది. కేంద్ర మంత్రులతో పాటు ఆయనకు కూడా ముందు వరుసలో సీటు కేటాయిస్తారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో విపక్ష నేత పదవి పదేళ్లు ఖాళీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment