భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించింది. భారత స్వాతంత్య్రానికి సంబంధించిన 10 ఆసక్తిక అంశాలు..
1. స్వాతంత్య్రం వచ్చిన రోజున మహాత్మా గాంధీ ఢిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోఖాలీలో ఉన్నారు. అక్కడ హిందువులు- ముస్లింల మధ్య నెలకొన్న మతపరమైన హింసను నియంత్రించేందుకు నిరాహార దీక్ష చేపట్టారు.
2. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వస్తుందని తెలియగానే జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌లు మహాత్మా గాంధీకి ఒక లేఖ పంపారు. ఆ లేఖలో ‘ఆగస్టు 15వ తేదీ మన దేశ తొలి స్వాతంత్య్ర దినోత్సవం. జాతిపితగా ఉత్సవాల్లో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి’ అని రాశారు.
3. అయితే దీనికి సమాధానంగా గాంధీజీ ‘కలకత్తాలో హిందువులు- ముస్లిములు పరస్పరం ఘర్షణ పడుతున్నప్పుడు నేను సంబరాలు చేసుకోవడానికి ఎలా వస్తాను? ఈ అల్లర్లను అదుపు చేయడానికి నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను’ అంటూ ఒక లేఖ ద్వారా సమాధానం పంపారు.
4. ఆగస్ట్ 14న అర్ధరాత్రి వైస్రాయ్ లాడ్జ్ (ప్రస్తుత రాష్ట్రపతి భవన్) నుండి జవహర్‌లాల్ నెహ్రూ ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ అనే చారిత్రాత్మక ప్రసంగం చేశారు. అప్పటికి నెహ్రూ ప్రధాని కాలేదు. ప్రపంచం మొత్తం ఈ ప్రసంగాన్ని విన్నది.
5. ఆగస్ట్ 15, 1947న లార్డ్ మౌంట్ బాటన్ తన కార్యాలయంలో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ తన మంత్రివర్గం జాబితాను అతనికి అందించారు. తరువాత ఇండియా గేట్ సమీపంలోని ప్రిన్సెస్ గార్డెన్‌లో జరిగిన సమావేశంలో ప్రసంగించారు.
6. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం నాడు భారత ప్రధాని ఎర్రకోట నుండి జెండాను ఎగురవేస్తారు. కానీ ఇది ఆగస్ట్ 15, 1947 న జరగలేదు. లోక్‌సభ సెక్రటేరియట్ పరిశోధనా పత్రంలోని వివరాల ప్రకారం నెహ్రూ 1947 ఆగస్టు 16న ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు.
7. అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ప్రెస్ సెక్రటరీ క్యాంప్‌బెల్ జాన్సన్ తెలిపిన వివరాల ప్రకారం జపాన్ మిత్రరాజ్యాల దళాలకు లొంగిపోయిన రెండవ వార్షికోత్సవం ఆగస్టు 15న జరగబోతోంది. ఆ రోజున భారతదేశానికి విముక్తి కల్పించడానికి బ్రిటీషర్లు నిర్ణయం తీసుకున్నారు.
8. భారతదేశం- పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ 1947, ఆగస్టు 15 నాటికి నిర్ణయం కాలేదు. ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్ ప్రకటన ద్వారా దీనిని నిర్ణయించారు.
9. భారతదేశం 1947, ఆగష్టు 15న స్వాతంత్య్రం పొందింది. కానీ జాతీయ గీతం రూపొందలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే ‘జన గణ మన’ రాశారు. ఈ జాతీయ గీతానికి 1950లో రూపకల్పన జరిగింది.
10. ఆగస్టు 15న మరో మూడు దేశాలకు కూడా స్వాతంత్య్రం లభించింది. దక్షిణ కొరియాకు 1945 ఆగష్టు 15న జపాన్ నుండి స్వాతంత్య్రం లభించింది. బహ్రెయిన్ 1971 ఆగష్టు 15న బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. కాంగో 1960, ఆగస్టు 15న ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందింది.
Comments
Please login to add a commentAdd a comment