మనం సాధించిందీ తక్కువేమీ కాదు! | Sakshi Guest Column On Indian Economy Growth | Sakshi
Sakshi News home page

మనం సాధించిందీ తక్కువేమీ కాదు!

Published Thu, Aug 15 2024 5:25 AM | Last Updated on Thu, Aug 15 2024 8:13 AM

Sakshi Guest Column On Indian Economy Growth

సందర్భం

భారతదేశం తన 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటోంది. వికసిత్‌ భారత్‌–2047 అనేది స్వాతంత్య్రం వచ్చి 100వ సంవత్సరమైన 2047 నాటికి సాకారం చేయాలని ప్రభుత్వ లక్ష్యం. భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే దృక్పథం ఉండటమే కాదు, దాన్ని తు.చ. అనుసరించడం అవసరం. వికసిత్‌ భారత్‌ అనేది ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత, సుపరిపాలన వంటి వివిధ అంశాల ఆధారంగా ఉంటుంది. 

ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించు కోవడంతోపాటు స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చేందుకు ఎంతవరకు కృషి చేస్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. స్వాతంత్య్ర సమరయోధుల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ కలలను మనం ఎంతవరకు సాధించాము? భారతదేశం తన జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందా? ఇవన్నీ ఈ సందర్భంగా చర్చ నీయాంశాలే.

మన దేశం 3.937 ట్రిలియన్‌ డాలర్ల స్థూల దేశీయోత్పత్తితో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం 2023–24లో తలసరి ఆదాయం రూ. 2.12 లక్షలు. కానీ ఇప్పటికీ మనం 5 శాతం పేదరికంతో బాధపడుతున్నాము. 2023 ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం, 125 దేశాలలో భారతదేశం 111వ స్థానంలో ఉంది. 

భారత ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించే కేంద్రం (సీఎంఐఈ) ప్రకారం, భారతదేశంలో నిరుద్యోగం రేటు 2024 మేలో 7 శాతం ఉంటే ఆ మరుసటి నెల (జూన్‌)లో 9.2 శాతానికి పెరిగింది. ఒక శాతం జనాభా సంపద వాటా 2022–23లో 40.1 శాతంగా ఉంది. 2023–24లో దేశంలోని పొదుపులో 92 శాతం సంపన్నులైన 20 శాతం మంది కలిగి ఉన్నారు.

వీటితో పాటు 2023లో ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నే షనల్‌ యొక్క ‘కరప్షన్‌ పర్సెప్షన్స్‌ ఇండెక్స్‌’ ప్రకారం 100కి 40 శాతం అవినీతి భారంతో భారతదేశం ఉంది. భారతదేశం 2023 నాటికి తన స్థూల దేశీ యోత్పత్తిలో దాదాపు 3–4 శాతం విద్యపై ఖర్చు చేస్తోంది. ఆరోగ్య సంరక్షణపై 1.2–1.5 శాతం ఖర్చు చేస్తోంది. మానవాభివృద్ధి–సంబంధిత అంశాలపై మొత్తం వ్యయం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 6–8 శాతంగా అంచనా వేయబడింది. 

అయితే ఇది వార్షిక బడ్జెట్‌ కేటాయింపులు, విధాన మార్పుల ఆధారంగా మారవచ్చు. సరళీకరణ ఆర్థిక వ్యవస్థలో ‘రెడ్‌ టేపిజం’ ఇప్పటికీ తన ప్రభావాన్ని చూపుతోంది. బంధుప్రీతి దాదాపు అన్ని రంగా లలో కనిపిస్తుంది. అయితే ఇది వ్యాపారం, రాజకీ యాలు, క్రీడలు, వినోద రంగాలలో ఎక్కువగా కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు ఇప్పటికీ మనం వర కట్నం, ఆడ శిశుహత్య, లింగ అసమానత్వం, గృహ హింస, అంటరానితనం వంటి సాంఘిక దురాచా రాలతో కునారిల్లుతున్నాం.

మన దేశం  ఎన్ని ఆటంకాలు ఎదురైనా విభిన్న రంగాలలో చాలా అభివృద్ధిని సాధించింది. మానవ వనరులలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది, ఉక్కు, బొగ్గు ఉత్పత్తిలో; మొబైల్‌ వినియోగంలో, వ్యవసాయ ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ ర్యాంక్‌ కలిగి ఉంది. బిలియనీర్ల సంఖ్యలో 3వ ర్యాంక్, గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ అవుట్‌పుట్‌ మరియు స్పేస్‌లో 5వ స్థానంలో ఉంది. 

విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులను స్వీకరించడంలో 8వ స్థానంలో ఉంది, 14వ అతిపెద్ద ఎగుమతిదారు మన దేశం. సాంస్కృతిక వైవిధ్యంలో 17వ ర్యాంక్, ఐటీ పరిశ్రమ పోటీ తత్వంలో18వ ర్యాంక్, హ్యాపీ ప్లానెట్‌ ఇండెక్స్‌లో 30వ ర్యాంక్, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో 40వ స్థానాన్ని భారత్‌ నిలుపుకుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఫిన్‌టెక్, పునరు త్పాదక శక్తి, బయోటెక్నాలజీ, డిజిటల్‌ లావా దేవీలు ఉన్నాయి.

సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ యుగంలో నిరంతర ఆర్థికాభివృద్ధి మరియు విభిన్న సంక్షేమ కార్యక్రమాలతో స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. దేశంలోని పౌరులు తమ హక్కులను పరిరక్షించడానికి మానవ హక్కుల సంఘాలు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ఫోర్త్‌ ఎస్టేట్, సమాచార హక్కు చట్టం మొదలైన ప్లాట్‌ఫారమ్‌లు, చట్టాల గురించి తెలుసుకోవాలి. 

పౌరుల ఆర్థిక పరిస్థితులు మెరుగు పడినప్పుడే సమానత్వం, సౌభ్రాతృత్వం లభిస్తాయి. అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యక్రమాలపై అవగాహన ఉన్న పౌరుల భాగస్వామ్యంతోనే స్వాతంత్య్ర సమర యోధుల స్ఫూర్తిని సాధించగలుగుతాం.

డా‘‘ పి ఎస్‌. చారి 
వ్యాసకర్త మేనేజ్మెంట్‌ స్టడీస్‌లో ఆచార్యులు
మొబైల్‌ : 83090 82823

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement