ఓ రోజు స్కూలు ప్యూను ఒక లిస్టు పట్టుకుని పేర్లు చదువుతున్నాడు. ఆ పేర్లు గల వాళ్లంతా వచ్చి అతడి ఎదురుగా నిలబడుతున్నారు. అలా ఏకంగా 45 మంది అమ్మాయిలు దీనంగా నిలబడ్డారు.
కర్నాటక రాష్ట్రం, కల్బుర్గి జిల్లా, మక్తంపురాలో ఓ తండ్రి. పేరు బసవరాజ్, గవర్నమెంట్ ఆఫీస్‌లో క్లర్కు. కూతురు ధానేశ్వరి అంటే తండ్రికి పంచప్రాణాలు. మక్తంపురాలో ఉన్న హైస్కూల్‌లో చదువుతోంది. గత ఏడాది ఊహించని అనారోగ్యం ఆమెను ఉన్న పళంగా తీసుకుపోయింది. గుండె బద్దలయ్యేలా ఏడ్చినా పోయిన కూతురు రాదని తెలుసు. కానీ కన్నీళ్లకు ఆ సంగతి తెలియదు. బసవరాజ్ ఆగని కన్నీళ్లను తుడుచుకుంటూ కూతురు చదివిన స్కూలు బాట పట్టాడు. అదే స్కూలు ఆవరణ నిండా తన కూతురు వయసు పిల్లలు గుంపులు గుంపులుగా కనిపించారు. అంతమందిలో తన కూతురు లేదన్న బాధతో.. వాళ్లలో తన కూతుర్ని చూసుకున్నాడు. నెలలు గడుస్తున్నాయి. రోజూ సాయంత్రం ఓ గంట సేపు స్కూలు దగ్గరకొచ్చి.. గ్రౌండ్‌లో ఆడుతున్న, చెట్టు కింద కూర్చుని చదువుకుంటున్న అమ్మాయిలను చూస్తూ ఉండేవాడు. ధానేశ్వరి వాళ్లందరిలో కనిపించేదతడికి. ఓ రోజు స్కూలు ప్యూను ఒక లిస్టు పట్టుకుని పేర్లు చదువుతున్నాడు. ఆ పేర్లు గల వాళ్లంతా వచ్చి అతడి ఎదురుగా నిలబడుతున్నారు. అలా ఏకంగా 45 మంది అమ్మాయిలు దీనంగా నిలబడ్డారు.
‘వారం రోజుల్లోగా ఫీజు కట్టాలని’ ప్యూను చెప్తున్నాడు. కట్టక పోతే స్కూలుకు రాకూడదని కూడా హెచ్చరిస్తున్నాడు. చాలా మంది అమ్మాయిలకు వాళ్ల ఇంటి పరిస్థితి కళ్ల ముందు మెదిలింది. గవర్నమెంట్ స్కూల్లో ఫీజు నామమాత్రంగానే ఉంటుంది. ఆ కొద్దిపాటి ఫీజు కట్టడం కూడా కష్టమైన కుటుంబాల పిల్లలు వాళ్లంతా. అది చూసిన బసవరాజ్‌కు గుండె బరువెక్కింది. ధానేశ్వరే దీనంగా చూస్తున్నట్లు అనిపించింది. దాంతో అతడు హెడ్మాస్టరు దగ్గరకు వెళ్లి ‘‘వాళ్లందరి ఫీజు నేనే కడతాను, ఈ ఒక్క ఏడాదికే కాదు, ఏటా కడతాను. ఈ స్కూల్లో చదువుతున్న ఏ ఆడపిల్లకూ ఫీజు కట్టలేని కారణంగా చదువు మానేయాల్సిన దయనీయమైన స్థితి రాకూడదు’’ అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే హెడ్ మాస్టరు సంతోషంగా చూశాడు. వెంటనే... ‘ఇతడేదో ఎమోషన్‌లో అంటున్నాడు కానీ నిజంగా ఫీజు కడతాడా’ అనే సందేహం కూడా కలిగిందతడికి. ఈ సందేహాలేవీ అవసరం లేదని ఆ మరుసటి రోజే తెలిసింది. ఎందుకంటే... బసవరాజు పదివేల రూపాయలు స్కూలు అకౌంట్‌లో జమ చేసి, ‘ఫీజు కట్టలేని ఆడపిల్లలందరి ఫీజులూ కట్టేయండి. ఇలా ఏటా మీకు ధానేశ్వరి పేరుతో డబ్బు అందుతుంది’ అని చెప్పాడు. ‘‘ఆర్థిక కారణాలతో అర్ధంతరంగా చదువు మానేస్తున్న వాళ్లు ఈ స్కూలు నుంచి ఏటా చాలా మందే ఉంటున్నారు.బాగా చదివే పిల్లలు ఇలా బడి మానేస్తుంటే బాధనిపిస్తుంది. బసవరాజ్ తీసుకున్న నిర్ణయంతో చాలామంది జీవితాలలో చదువుల వెలుగులు పూస్తాయి’’ అని టీచర్లందరూ సంతోషిస్తున్నారు.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment