కట్టు కథ చెప్పి నోట్ల కట్టలు స్వాహా
కర్నూలు: అన్నం పెట్టిన యజమానికి నమ్మకద్రోహం చేయాలనుకున్నాడు ఓ గుమస్తా. కట్టుకథలు చెప్పి నోట్ల కట్టలు మాయమయ్యాయని పోలీసులను ఫి ర్యాదు చేసి తప్పించుకోవాలని ఉపాయం పన్ని ఎట్టకేలకు దొరికిపోయాడు. యజమానికి సంబంధించిన రూ.7 లక్షలు నగదు స్వాహా చేసేందుకు ప్రయత్నించిన గుమాస్తాను, అతనికి సహకరించిన మరోకరిని రెండవ పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. మహబూబ్ నగర్ జిల్లా ఐజ పట్టణానికి చెందిన వై.ఆనందరావు స్థానికంగా వెంకటరమణ రైస్‌మిల్ నిర్వహిస్తున్నాడు. అతని దగ్గర దావూద్ అనే వ్యక్తి 20 ఏళ్లుగా గుమాస్తాగా పని చేస్తూ నమ్మకం ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదిన కర్నూలులోని యాక్సిస్ బ్యాంకులో రూ.7 లక్షలు చెక్కులను ఇచ్చి డ్రా చేసుకొని రమ్మని పంపాడు. మధ్యాహ్నం 12.15 గంటలకు డబ్బులు డ్రా చేసుకుని ఆ మొత్తాన్ని స్వాహా చేసేందుకు పథకం రచించాడు. దావూద్‌కు చిన్న నాటి స్నేహితుడైన సాబిర్‌హుసేన్‌ను పిలిపించుకుని డబ్బు మొత్తం అతనికి అప్పగించి దాచిపెట్టమని పంపాడు. మూడు గంటల సమయంలో యజమానికి ఫోన్ చేసి తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించి డబ్బులు తీసుకుపోయారని కట్టుకథ చెప్పాడు. అమరావతి హోటల్ దగ్గర ఆటో ఎక్కి బస్టాండ్‌కు బయల్దేరగా ఐదు రోడ్ల కూడలి దగ్గర మరో వ్యక్తి ఆటో ఎక్కి తనను కత్తితో పొడుస్తానని బెదిరించి మత్తుమందు వాసన చూపించాడని అపస్మారక స్థితిలో చెన్నమ్మ సర్కిల్ దగ్గర దింపేసి డబ్బులు తీసుకుని వెళ్లిపోయారని రెండవ పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిపై అనుమానం వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. అతని సెల్‌ఫోన్ ఆధారంగా కేసును రెండు రోజుల్లోనే ఛేదించారు. ఫిర్యాదిదారుడు దావూద్‌తో పాటు అతనికి సహకరించిన సాబిర్‌హుసేన్‌ను అరెస్టు చేసి శుక్రవారం సాయంత్రం ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించి చోరీ అయిన సొత్తును రెండు రోజుల్లోనే రికవరీ చేసినందుకు రెండవ పట్టణ సీఐ బాబు ప్రసాద్, ఎస్‌ఐ ఖాజావలి, కె.రామసుబ్బయ్య, ఏఎస్‌ఐ బాబున్‌సాహెబ్, కానిస్టేబుళ్లు శేఖర్‌బాబు, వినోద్‌కుమార్, అమర్‌నాథ్‌రెడ్డి, చెన్నయ్య, మధుసూధన్, నాగరాజులను ఎస్పీ అభినందించారు. అదనపు ఎస్పీ ఎస్.బాబురావు, పి.మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు.