మ్యాడ్‌స్కిల్స్‌కు మహర్దశ.. ఇంతకీ మ్యాడ్‌స్కిల్స్‌ అంటే? | Mad Skills Meaning, Definition, Uses in Telugu | Sakshi
Sakshi News home page

మ్యాడ్‌స్కిల్స్‌కు మహర్దశ.. ఇంతకీ మ్యాడ్‌స్కిల్స్‌ అంటే?

Published Fri, Dec 23 2022 6:46 PM | Last Updated on Fri, Dec 23 2022 6:46 PM

Mad Skills Meaning, Definition, Uses in Telugu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మీరు కబడ్డీలో మేటి కావచ్చు. సంగీతంలో ఘనాపాఠీ కావచ్చు. సాహసాలు చేయడంలో ‘వారెవా’ అనిపించవచ్చు... అయితే ఇవి మీ అభిరుచి, ఆసక్తికి మాత్రమే పరిమితం కావడం లేదు. మీరు మంచి ఉద్యోగంలో ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించే శక్తులు అవుతున్నాయి. కాలంతో పాటు ఉద్యోగ ఎంపిక ప్రమాణాలలో కూడా మార్పు వస్తోంది. ఉద్యోగం రావడానికి ఉపకరించే హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్‌ విభాగాలకు ఇప్పుడు మూడో విభాగం కూడా తోడైంది. అదే... మ్యాడ్‌ స్కిల్స్‌.

ఇంతకీ మ్యాడ్‌స్కిల్స్‌ అంటే?
ఉద్యోగప్రయత్నాలు చేసేవారి రెజ్యూమ్‌ లేదా సీవీలలో హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్‌ అని రెండు విభాగాలు ఉంటాయి. మొదటిది జ్ఞానాన్ని సర్టిఫికెట్లతో తూచే విషయం. రెండోది మార్కులు, ర్యాంకులతో పాటు నైపుణ్యబలాన్ని అంచనావేయడం.

ఇప్పుడు ఈ రెండు విభాగాలతో పాటు ‘మ్యాడ్‌ స్కిల్స్‌’ అనే మూడో విభాగం కూడా తోడైంది. మ్యాడ్‌ స్కిల్స్‌ అనగానే వ్యంగ్యం, వ్యతిరేకత ధ్వనించవచ్చుగానీ... ఇక్కడ మ్యాడ్‌ స్కిల్స్‌ అంటే ‘పనికిరాని వృథా స్కిల్స్‌’ అని అర్థం కాదు. ఉద్యోగుల ఎంపికకు సంబంధించి కంపెనీల నిర్ణయాలలో ‘మ్యాడ్‌ స్కిల్స్‌’ కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి.

సాఫ్ట్‌ స్కిల్స్‌ కంటే ‘మ్యాడ్‌ స్కిల్స్‌’ను అరుదైన, అవసరమైన స్కిల్స్‌గా భావిస్తున్నాయి కంపెనీలు.

ఒక మేనేజర్‌ పోస్ట్‌ ఎంపికలో అభ్యర్ధి అభిరుచులపై కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది గతంలో అంతగా లేకపోవచ్చు. ఇప్పుడు మాత్రం అది ఒక అనివార్యమైన విషయం అయింది.

రిక్రూట్‌మెంట్‌ స్పెషలిస్ట్‌లు రెజ్యూమ్‌లోని ‘హాబీస్‌ అండ్‌ ట్రావెల్స్‌’ స్పేస్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ‘మ్యాడ్‌ స్కిల్స్‌’ను కంపెనీలు తమ ప్రత్యేక ఆస్తిగా భావించుకోవడానికి కారణం అవి క్రియేటివ్‌ స్కిల్స్‌ రూపంలో తమ కంపెనీకి తోడ్పడతాయనే నమ్మకం.

ఉదాహరణకు కీర్తి అనే అమ్మాయి ఒక కంపెనీలో ఏదో ఉద్యోగానికి అప్లై చేసింది అనుకుందాం. కీర్తికి ‘ట్రెక్కింగ్‌’ హాబీ ఉంది. అయితే ఉద్యోగ ఎంపికలో అది ఆమె వ్యక్తిగత అభిరుచికి సంబధించిన గుర్తింపుకే పరిమితం కావడం లేదు. ఈ అభిరుచి ద్వారా కంపెనీలు తన వ్యక్తిత్వాన్ని అంచనావేయడానికి ఉపయోగపడుతుంది.
‘కొత్త ప్రదేశాలలో సర్దుకుపోగలదు’ ‘సవాళ్లను స్వీకరించగలదు’ ‘అందరితో కలిసిపోయే స్వభావం ఉంది’.. ఇలా కీర్తి గురించి కొన్ని అంచనాలకు రావడానికి వీలవుతుంది.

‘ఒక మేనేజర్‌ పోస్ట్‌కు పదిమంది వ్యక్తులు పోటీ పడితే, అందరి బలాలు సమానంగా ఉన్నాయనుకున్నప్పుడు మ్యాడ్‌ స్కిల్స్‌ కీలకం అవుతాయి. అభిరుచుల ఆధారంగా వ్యక్తిత్వంపై ఒక అంచనాకు రావడానికి ఇవి తోడ్పడతాయి. విభిన్నమైన అభిరుచులు, నైపుణ్యాలు, బలమైన వ్యక్తిత్వం, పర్సనల్‌ ప్రాజెక్ట్‌లకు కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి’ అంటుంది ‘యూ విల్‌ బీ ఏ మేనేజర్‌ మై సన్‌’ పుస్తక రచయిత్రి సాండ్రిన్‌.

ఆటలు (ఫుట్‌బాల్‌ నుంచి చెస్‌ బాక్సింగ్‌ వరకు), ఆర్టిస్టిక్‌ యాక్టివిటీస్‌(రచనలు చేయడం నుంచి పాటలు పాడడం వరకు), ప్రధాన స్రవంతికి భిన్నంగా ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ ఆలోచించడం ... ఇలా ఎన్నో మ్యాడ్‌స్కిల్స్‌ (యూనిక్‌ క్రియేటివ్‌ స్కిల్స్‌) విభాగంలోకి వస్తాయి.

‘జాబ్‌ ఔట్‌లుక్‌ 2022’ సర్వే ప్రకారం ఉద్యోగ ఎంపికలో బడా కంపెనీలు ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌–స్కిల్స్, ‘ ఇది మాత్రమే నా పని’ అని కాకుండా ఇతరత్రా విషయాలలో ‘చొరవ’ చూపించే నైపుణ్యం, రచన, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌... మొదలైవాటికి అగ్రస్థానం ఇస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన వేర్లు ‘మ్యాడ్‌ స్కిల్స్‌’లోనే ఉన్నాయి!

అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ప్రతిధ్వనించిన ఎక్స్‌ప్రెషన్‌ మ్యాడ్‌ స్కిల్స్‌. సిలికాన్‌ వ్యాలీలోని కంపెనీలు ఉద్యోగ ఎంపికలో మ్యాడ్‌ స్కిల్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పుడు యూరప్‌లో కూడా ఉద్యోగ ఎంపికలో ‘మ్యాడ్‌ స్కిల్స్‌’ ట్రెండ్‌గా మారింది.

‘మంచి మార్కులు, ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సరిౖయెన సమాధానాలు చెప్పడం అనేవి ఉద్యోగ ఎంపికలో కీలక పాత్ర పోషించినప్పటికీ, మ్యాడ్‌స్కిల్స్‌ ప్రాధాన్యత వేరు. కంపెనీ అభివృద్ధి చెందాలంటే భిన్నంగా ఆలోచించేవారు ఉండాలి. వారి నుంచే కంపెనీ అభివృద్ధికి అవసరమైన సృజనాత్మక ఐడియాలు వస్తాయి. హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్‌ స్కిల్స్‌ ద్వారా అభ్యర్థిని సులభంగా అంచనా వేయవచ్చు. అయితే మ్యాడ్‌స్కిల్స్‌ ద్వారా అది అంత సులభం కాకపోయినా అసాధ్యం మాత్రం కాదు’ అంటున్నారు విశ్లేషకులు.

‘సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే నాకు ఇష్టం. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి సేవాకార్యక్రమాలు కూడా కీలక పాత్ర వహిస్తున్నాయి అనే విషయం తెలిశాక సంతోషం వేసింది’ అంటున్నాడు బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి నిఖిల్‌. (క్లిక్ చేయండి: వీకెండ్‌ పార్టీలకు వెళ్తున్నారా? మోసగాళ్లు తొలుత ఏం చేస్తారో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement