Recruiters
-
కొత్త ఉద్యోగాలు పెరగనున్నాయ్.. ఇదిగో సాక్ష్యం!
కరోనా వైరస్ కారణంగా చాలా కంపెనీలు భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్తగా ఉద్యోగులను చేర్చుకోవడం లేదా ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేయడం గానీ పూర్తిగా ఆపేసాయి. అంతే కాకుండా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించగా.. మరికొన్ని సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ వెసలుబాటు కల్పించి ఇంటికే పరిమితం చేశాయి. కాగా ఇప్పుడు ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు.. నియామకాల జోరు కూడా పెరుగుతోంది. నివేదికల ప్రకారం, 2023 డిసెంబర్ చివరి నాటికి కొత్త ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని, ఇప్పటికే ఖాళీ ఉన్న పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయడానికి కంపెనీలు సన్నద్ధమవుతాయని తెలుస్తోంది. నౌకరి హైరింగ్ అవుట్ లుక్ (Naukri Hiring Outlook) రూపొందించిన ఒక నివేదికలో 1200ల కంటే ఎక్కువ నియామక సంస్థలు, కన్సల్టెంట్స్ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: భారత్ ఎన్సీఏపీ ప్రారంభం నేడే.. దీనివల్ల ఉపయోగాలెన్నో తెలుసా? రానున్న రోజుల్లో దాదాపు 92 శాతం నియామకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇందులో కూడా కొత్త ఉద్యోగాల సంఖ్య పెరిగే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్ వంటి వాటిలో ఉద్యోగాలు మెండుగా ఉండనున్నాయి. ఈ ఏడాది చాలా సంస్థలు తమ ఉద్యోగులకు చాలా తక్కువ మొత్తంలో ఇంక్రిమెంట్స్ కల్పించాయి, కాగా మరికొన్ని కంపెనీలు ఇంక్రిమెంట్ ఊసే ఎత్తలేదు. అంతే కాకుండా చాలా రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటుపడిన ఉద్యోగులను తప్పకుండా ఆఫీసులకు రావాలని బడా సంస్థలు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఇవన్నీ కూడా కొత్త ఉద్యోగాలు కల్పించడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. -
మ్యాడ్స్కిల్స్కు మహర్దశ.. ఇంతకీ మ్యాడ్‌స్కిల్స్ అంటే?
మీరు కబడ్డీలో మేటి కావచ్చు. సంగీతంలో ఘనాపాఠీ కావచ్చు. సాహసాలు చేయడంలో ‘వారెవా’ అనిపించవచ్చు... అయితే ఇవి మీ అభిరుచి, ఆసక్తికి మాత్రమే పరిమితం కావడం లేదు. మీరు మంచి ఉద్యోగంలో ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించే శక్తులు అవుతున్నాయి. కాలంతో పాటు ఉద్యోగ ఎంపిక ప్రమాణాలలో కూడా మార్పు వస్తోంది. ఉద్యోగం రావడానికి ఉపకరించే హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్ విభాగాలకు ఇప్పుడు మూడో విభాగం కూడా తోడైంది. అదే... మ్యాడ్ స్కిల్స్. ఇంతకీ మ్యాడ్‌స్కిల్స్ అంటే? ఉద్యోగప్రయత్నాలు చేసేవారి రెజ్యూమ్ లేదా సీవీలలో హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్ అని రెండు విభాగాలు ఉంటాయి. మొదటిది జ్ఞానాన్ని సర్టిఫికెట్లతో తూచే విషయం. రెండోది మార్కులు, ర్యాంకులతో పాటు నైపుణ్యబలాన్ని అంచనావేయడం. ఇప్పుడు ఈ రెండు విభాగాలతో పాటు ‘మ్యాడ్ స్కిల్స్’ అనే మూడో విభాగం కూడా తోడైంది. మ్యాడ్ స్కిల్స్ అనగానే వ్యంగ్యం, వ్యతిరేకత ధ్వనించవచ్చుగానీ... ఇక్కడ మ్యాడ్ స్కిల్స్ అంటే ‘పనికిరాని వృథా స్కిల్స్’ అని అర్థం కాదు. ఉద్యోగుల ఎంపికకు సంబంధించి కంపెనీల నిర్ణయాలలో ‘మ్యాడ్ స్కిల్స్’ కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. సాఫ్ట్ స్కిల్స్ కంటే ‘మ్యాడ్ స్కిల్స్’ను అరుదైన, అవసరమైన స్కిల్స్గా భావిస్తున్నాయి కంపెనీలు. ఒక మేనేజర్ పోస్ట్ ఎంపికలో అభ్యర్ధి అభిరుచులపై కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది గతంలో అంతగా లేకపోవచ్చు. ఇప్పుడు మాత్రం అది ఒక అనివార్యమైన విషయం అయింది. రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్‌లు రెజ్యూమ్‌లోని ‘హాబీస్ అండ్ ట్రావెల్స్’ స్పేస్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ‘మ్యాడ్ స్కిల్స్’ను కంపెనీలు తమ ప్రత్యేక ఆస్తిగా భావించుకోవడానికి కారణం అవి క్రియేటివ్ స్కిల్స్ రూపంలో తమ కంపెనీకి తోడ్పడతాయనే నమ్మకం. ఉదాహరణకు కీర్తి అనే అమ్మాయి ఒక కంపెనీలో ఏదో ఉద్యోగానికి అప్లై చేసింది అనుకుందాం. కీర్తికి ‘ట్రెక్కింగ్’ హాబీ ఉంది. అయితే ఉద్యోగ ఎంపికలో అది ఆమె వ్యక్తిగత అభిరుచికి సంబధించిన గుర్తింపుకే పరిమితం కావడం లేదు. ఈ అభిరుచి ద్వారా కంపెనీలు తన వ్యక్తిత్వాన్ని అంచనావేయడానికి ఉపయోగపడుతుంది. ‘కొత్త ప్రదేశాలలో సర్దుకుపోగలదు’ ‘సవాళ్లను స్వీకరించగలదు’ ‘అందరితో కలిసిపోయే స్వభావం ఉంది’.. ఇలా కీర్తి గురించి కొన్ని అంచనాలకు రావడానికి వీలవుతుంది. ‘ఒక మేనేజర్ పోస్ట్‌కు పదిమంది వ్యక్తులు పోటీ పడితే, అందరి బలాలు సమానంగా ఉన్నాయనుకున్నప్పుడు మ్యాడ్ స్కిల్స్ కీలకం అవుతాయి. అభిరుచుల ఆధారంగా వ్యక్తిత్వంపై ఒక అంచనాకు రావడానికి ఇవి తోడ్పడతాయి. విభిన్నమైన అభిరుచులు, నైపుణ్యాలు, బలమైన వ్యక్తిత్వం, పర్సనల్ ప్రాజెక్ట్‌లకు కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి’ అంటుంది ‘యూ విల్ బీ ఏ మేనేజర్ మై సన్’ పుస్తక రచయిత్రి సాండ్రిన్. ఆటలు (ఫుట్‌బాల్ నుంచి చెస్ బాక్సింగ్ వరకు), ఆర్టిస్టిక్ యాక్టివిటీస్(రచనలు చేయడం నుంచి పాటలు పాడడం వరకు), ప్రధాన స్రవంతికి భిన్నంగా ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడం ... ఇలా ఎన్నో మ్యాడ్‌స్కిల్స్ (యూనిక్ క్రియేటివ్ స్కిల్స్) విభాగంలోకి వస్తాయి. ‘జాబ్ ఔట్లుక్ 2022’ సర్వే ప్రకారం ఉద్యోగ ఎంపికలో బడా కంపెనీలు ప్రాబ్లమ్ సాల్వింగ్–స్కిల్స్, ‘ ఇది మాత్రమే నా పని’ అని కాకుండా ఇతరత్రా విషయాలలో ‘చొరవ’ చూపించే నైపుణ్యం, రచన, కమ్యూనికేషన్ స్కిల్స్... మొదలైవాటికి అగ్రస్థానం ఇస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన వేర్లు ‘మ్యాడ్ స్కిల్స్’లోనే ఉన్నాయి! అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రతిధ్వనించిన ఎక్స్ప్రెషన్ మ్యాడ్ స్కిల్స్. సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు ఉద్యోగ ఎంపికలో మ్యాడ్ స్కిల్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పుడు యూరప్‌లో కూడా ఉద్యోగ ఎంపికలో ‘మ్యాడ్ స్కిల్స్’ ట్రెండ్‌గా మారింది. ‘మంచి మార్కులు, ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సరిౖయెన సమాధానాలు చెప్పడం అనేవి ఉద్యోగ ఎంపికలో కీలక పాత్ర పోషించినప్పటికీ, మ్యాడ్‌స్కిల్స్ ప్రాధాన్యత వేరు. కంపెనీ అభివృద్ధి చెందాలంటే భిన్నంగా ఆలోచించేవారు ఉండాలి. వారి నుంచే కంపెనీ అభివృద్ధికి అవసరమైన సృజనాత్మక ఐడియాలు వస్తాయి. హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ద్వారా అభ్యర్థిని సులభంగా అంచనా వేయవచ్చు. అయితే మ్యాడ్‌స్కిల్స్ ద్వారా అది అంత సులభం కాకపోయినా అసాధ్యం మాత్రం కాదు’ అంటున్నారు విశ్లేషకులు. ‘సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే నాకు ఇష్టం. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి సేవాకార్యక్రమాలు కూడా కీలక పాత్ర వహిస్తున్నాయి అనే విషయం తెలిశాక సంతోషం వేసింది’ అంటున్నాడు బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నిఖిల్. (క్లిక్ చేయండి: వీకెండ్ పార్టీలకు వెళ్తున్నారా? మోసగాళ్లు తొలుత ఏం చేస్తారో తెలుసా?) -
ఎఫ్బీ పోస్టులతో జాబ్‌కు ఎసరు..
వాషింగ్టన్ : ఫేస్బుక్ ప్రొఫైల్‌లో వివాదాస్పద అంశాలపై మీ అభిప్రాయాలను వెల్లడించే పోస్ట్‌లు ఉంటే మీకు ఉద్యోగం లభించే అవకాశం సన్నగిల్లినట్టేనని తాజా అథ్యయనం తేల్చిచెప్పింది. సోషల్ మీడియా పోస్టుల్లో మితిమీరి తలదూర్చడం, నిర్థిష్ట అభిప్రాయాలను కలిగి ఉండే అభ్యర్ధులను రిక్రూటర్లు ఎంపిక చేసుకునే అవకాశాలు తక్కువని అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. డ్రగ్స్, ఆల్కహాల్‌ను ప్రోత్సహించే కంటెంట్‌ను పోస్ట్ చేసే వారిని కూడా తమ ఉద్యోగులుగా రిక్రూటర్లు నియమించుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సెలెక్షన్ అండ్ అసెస్మెంట్లో ప్రచురితమైన ఈ అథ్యయనం గుర్తించింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయని, తమ గురించి మిగిలిన ప్రపంచానికి తెలియచేస్తాయనే భావన ఉన్నా తమ వ్యక్తిగత ఆసక్తులు, ప్రతిభపై అమితాసక్తిని కనబరిచే వారు ఇతర ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాల కోసం త్యాగం చేసే స్వభావం తక్కువగా కలిగి ఉంటారని హైరింగ్ మేనేజర్లు అభిప్రాయపడుతున్నారని పరిశోధకులు వెల్లడించారు. ఇక వివాదాస్పద అంశాలపై భిన్న ఉద్దేశాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు సహకార ధోరణితో సర్ధుకుపోయే స్వభావం కలిగిఉండరని, వాదన ధోరణిని కలిగిఉంటారనే అభిప్రాయం రిక్రూటర్లలో నెలకొందని విశ్లేషించారు. ఇక మద్యం, డ్రగ్ వాడకంపై పోస్ట్‌లు చేసేవారు ఒక ఉద్యోగంలో కుదురుగా ఉండరని రిక్రూటర్లు భావిస్తున్నారని పరిశోధకులు తెలిపారు. చదవండి : నువ్వే నా సర్వస్వం - ఫేస్బుక్ సీవోవో -
రిక్రూటర్లకు వారే అతిపెద్ద సవాల్
ముంబై : కంపెనీల్లో ఉద్యోగులను నియమించుకోవాలంటే రిక్రూటర్లకు తల ప్రాణం తోకకు వస్తోంది. సీనియర్ స్థాయి ఉద్యోగుల నియమించుకునేటప్పుడైతే, ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. రిక్రూటర్లకు ప్రస్తుతం సీనియర్ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడం అతిపెద్ద సవాల్‌గా నిలుస్తుందని, ఈ అభ్యర్థులు ప్రస్తుత వేతనానికి 20 నుంచి 40 శాతం పెంపు కోరుకుంటున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. మెజార్టీ సీనియర్ స్థాయి ఉద్యోగులు, తమ ప్రస్తుత వేతనానికి 20 శాతం నుంచి 40 శాతం పైగా పెంపు ఉంటేనే ఉద్యోగ మార్పును పరిగణలోకి తీసుకుంటున్నారని సీఐఈఎల్ నిర్వహించిన టాలెంట్ మార్కెట్‌పై ఏడాది సర్వే వెల్లడించింది. ఇది భవిష్యత్తులో ఉద్యోగవకాశాల విశ్వసనీయతపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ప్రతిభావంతులను ఆకర్షించుకోవడం కూడా రిక్రూటర్లకు అతిపెద్ద సవాల్ అని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో, పలు రంగాల్లో వివిధ స్థాయిలోని 107 ఎగ్జిక్యూటివ్‌లపై ఈ సర్వే నిర్వహించింది. కేవలం సీనియర్ ఉద్యోగులను నియమించుకోవడమే కాక, రిక్రూటర్లకు ఎంప్లాయర్ బ్రాండింగ్ కూడా సవాల్‌గా నిలుస్తుందని సర్వే బహిర్గతం చేసింది. 35 శాతం మంది దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారన్నారు. ఎంట్రీ లెవల్, మధ్య స్థాయి వారికి కొత్త ఉద్యోగవకాశాలు చూడటం, వేతనాలు, ప్రయోజనాలు వంటివి అత్యంత ముఖ్యమైన కారకాలు కాగ, సీనియర్ స్థాయి వారికి వేతనం, ఇతరాత్ర ప్రయోజనాలు రెండో అతిపెద్ద కారకాలని సర్వే పేర్కొంది. కొత్త ఉద్యోగాలు వెతుకోవడానికి మరో ముఖ్యమైన అంశం మేనేజర్లతో సంబంధాలని కూడా తెలిపింది. కెరీర్లో వెదకడం కోసం కూడా ఉద్యోగం మారుతున్నట్టు చెప్పింది. -
ఐఎస్‌లో ఒక వ్యక్తిని చేర్చితే 6.47 లక్షలు!
బ్రస్సెల్స్: ఇరాక్, సిరియాలో జీహాద్ పేరిట యువతను ఎగదొస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కొత్తవారిని ఎలా నియమించుకుంటున్నది? కొత్తవాళ్లను నియమించేవారికి ఎంతమొత్తంలో చెల్లింపులు జరుపుతున్నది? అనే దానిపై ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఐఎస్ఐఎస్లో ఒక వ్యక్తిని చేర్చితే.. రిక్రూటర్లకు ఆ సంస్థ అక్షరాల పదివేల డాలర్ల వరకు (సుమారు రూ.6.47 లక్షలు) పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నది. బెల్జియంలో పర్యటించిన ఐక్యరాజ్యసమితి నిపుణులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బెల్జియం నుంచి ఐఎస్ఐఎస్లో చేరుతున్నవాళ్లు పెద్దసంఖ్యలో ఉండటంతో ఐరాస అధ్యయన బృందం ఆ దేశంలో పర్యటించి.. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకుంది. ఐఎస్ఐఎస్ సంస్థ సోషల్ మీడియా ద్వారా కొత్తవారికి వల వేస్తున్నదని, అలాగే సిరియాలో కుటుంబసభ్యులు, స్నేహితుల ఉన్నవారి నెట్వర్క్ ను ఉపయోగించుకొని బెల్జియంలో కొత్త జీహాదీలను నియమించుకుంటున్నదని ఐరాస బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎల్జ్బీటా కర్స్కా తెలిపారు. ప్రస్తుతం ఇరాక్, సిరియాలో పనిచేస్తున్న 500 మందిపైగా ఐఎస్ ఫైటర్లు బెల్జియంకు చెందినవారని గుర్తించినట్టు ఆమె తెలిపారు. యూరప్ దేశాల్లో అత్యధికంగా ఐఎస్‌కు రిక్రూట్ అయిన వ్యక్తులు బెల్జియం వారే. 'కొత్తగా చేర్చే వ్యక్తుల సామర్థ్యాల ఆధారంగా రిక్రూటర్లకు ఐఎస్ఐఎస్ చెల్లింపులు జరుపుతున్నది. ఈ చెల్లింపులు రెండు వేల డాలర్ల నుంచి పది వేల డాలర్ల వరకు ఉంటున్నాయి. బాగా చదువుకున్నవాళ్లు, కంప్యూటర్ స్పెషలిస్టులు, వైద్యులు వంటివారిని చేర్చితే ఎక్కువమొత్తం చెల్లింపులు జరుపుతున్నది' అని ఆమె వివరించారు. బెల్జియానికి చెందిన షరియా ఫర్ బెల్జియం సంస్థ మొదట 2010లో ఐఎస్ కోసం నియామకాలు చేపట్టింది. దాని గుట్టురట్టయి.. నిర్వాహకులు అరెస్టు కావడంతో ఇప్పుడు వేర్వేరు వ్యక్తులు నియామకాలు చేపడుతున్నారు. -
టెక్ ఇంటర్వ్యూలో మెరిసేదెలా!
టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాల భర్తీకి నిర్వహించే మౌఖిక పరీక్షలు భిన్నంగా ఉంటాయి. ఇందులో రిక్రూటర్లు సాంకేతిక అంశాలపై ఎక్కువ ప్రశ్నలు సంధిస్తుంటారు. కళాశాలలో నేర్చుకున్న మౌలికాంశాలపై కూడా అడుగుతుంటారు. టెక్నాలజీ రంగంలో చాలాకాలంగా పనిచేస్తున్న అభ్యర్థులు ఇలాంటి ఇంటర్వ్యూలను తేలిగ్గా తీసుకుంటారు. ప్రిపరేషన్ అవసరం లేదని భావిస్తుంటారు. రిక్రూటర్లు బేసిక్స్‌పై ప్రశ్నలు వేస్తే మాత్రం నీళ్లు నములుతుంటారు. టెక్ ఇంటర్వ్యూలు అనుకున్నంత సులభంగా ఉండవు. ఇందులో క్లిష్టమైన సమస్యలు ఎదురవుతుంటాయి. వాటికి పరిష్కార మార్గాలు చూపగలగాలి. ఆ మార్గాలు ప్రభావవంతంగా ఉన్నప్పుడే మీ తెలివితేటలు, చురుకుదనం రిక్రూటర్‌కు తెలుస్తాయి. బేసిక్స్ నెమరువేసుకోవాలి: టెక్ ఇంటర్వ్యూలో బేసిక్ అల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి బేసిక్స్‌ను తప్పనిసరిగా నెమరు వేసుకోవాలి. గ్రాఫ్స్, సెట్స్, హష్ టేబుల్స్, బైనరీ సెర్చ్ ట్రీస్పై కూడా రిక్రూటర్లు ప్రశ్నిస్తారు. డేటా స్ట్రక్చర్స్‌ను ఉపయోగిస్తూ కోడ్‌ను తయారు చేయమని సూచిస్తారు. రిక్రూటర్‌ను మెప్పించే సమాధానాలు ఇవ్వాలంటే బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. పూర్తిస్థాయిలో సన్నద్ధమైతేనే ఇది సాధ్యం. ప్రోగ్రామింగ్‌పై కనీసం రెండు పుస్తకాలు క్షుణ్నంగా చదవాలి. దీనివల్ల ఇంటర్వ్యూలో విజయం దక్కడమే కాదు, మీరు మంచి ప్రోగ్రామర్‌గా కూడా పేరు తెచ్చుకుంటారు. మ్యాప్స్, సెట్స్: మౌఖిక పరీక్షలో మ్యాప్‌లు, సెట్స్‌పై వచ్చే సమాధానాలను బట్టే బలహీన, బలమైన అభ్యర్థులు ఎవరో రిక్రూటర్లు తేల్చేస్తారు. కాబట్టి వీటిపై సాధనకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలను పూర్తిగా అధ్యయనం చేయాలి. సెట్స్, హష్ టేబుల్స్‌ను సందర్భానుసారంగా ఎక్కడెక్కడ ఉపయోగించాలో చక్కగా వివరిస్తే రిక్రూటర్ల దృష్టిలో మీ స్థాయి పెరిగిపోవడం ఖాయం. కోడింగ్ సాధన: అభ్యర్థుల కోడింగ్ ైనె పుణ్యాలను తప్పనిసరిగా పరీక్షిస్తారు. కోడింగ్‌పై ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ముందే తెలుసుకోవాలి. దీనిపై అంతర్జాలంలో సమాచారం లభిస్తుంది. కాగితం, కలం ఉపయోగిస్తూ రియల్ కోడింగ్‌ను ఎక్కువగా ప్రాక్టీస్ చే యండి. నాన్-కోడింగ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోడింగ్‌పై ప్రశ్నలను ఎదుర్కోవాల్సిందే. అలాగే సింటాక్స్‌ను మర్చిపోయి ఇంటర్వ్యూలో రిక్రూటర్‌కు ‘సారీ’ చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దు. టెక్నికల్ స్కిల్స్‌కు సాన పెట్టుకుంటే టెక్ ఇంటర్వ్యూలో నెగ్గడం తేలికేనన్న విషయం గుర్తుంచుకోండి.