ఐఎస్లో ఒక వ్యక్తిని చేర్చితే 6.47 లక్షలు! | Islamic State Pays Recruiters $10,000 Per Person: UN | Sakshi
Sakshi News home page

ఐఎస్లో ఒక వ్యక్తిని చేర్చితే 6.47 లక్షలు!

Published Sat, Oct 17 2015 1:43 PM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

ఐఎస్లో ఒక వ్యక్తిని చేర్చితే 6.47 లక్షలు!

ఐఎస్లో ఒక వ్యక్తిని చేర్చితే 6.47 లక్షలు!

బ్రస్సెల్స్: ఇరాక్, సిరియాలో జీహాద్ పేరిట యువతను ఎగదొస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కొత్తవారిని ఎలా నియమించుకుంటున్నది? కొత్తవాళ్లను నియమించేవారికి ఎంతమొత్తంలో చెల్లింపులు జరుపుతున్నది? అనే దానిపై ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఐఎస్ఐఎస్లో ఒక వ్యక్తిని చేర్చితే.. రిక్రూటర్లకు ఆ సంస్థ అక్షరాల పదివేల డాలర్ల వరకు (సుమారు రూ.6.47 లక్షలు) పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నది. బెల్జియంలో పర్యటించిన ఐక్యరాజ్యసమితి నిపుణులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బెల్జియం నుంచి ఐఎస్ఐఎస్లో చేరుతున్నవాళ్లు పెద్దసంఖ్యలో ఉండటంతో ఐరాస అధ్యయన బృందం ఆ దేశంలో పర్యటించి.. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకుంది.

ఐఎస్ఐఎస్ సంస్థ సోషల్ మీడియా ద్వారా కొత్తవారికి వల వేస్తున్నదని, అలాగే సిరియాలో కుటుంబసభ్యులు, స్నేహితుల ఉన్నవారి నెట్వర్క్ ను ఉపయోగించుకొని బెల్జియంలో కొత్త జీహాదీలను నియమించుకుంటున్నదని ఐరాస బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎల్జ్బీటా కర్స్కా తెలిపారు. ప్రస్తుతం ఇరాక్, సిరియాలో పనిచేస్తున్న 500 మందిపైగా ఐఎస్ ఫైటర్లు బెల్జియంకు చెందినవారని గుర్తించినట్టు ఆమె తెలిపారు. యూరప్ దేశాల్లో అత్యధికంగా ఐఎస్కు రిక్రూట్ అయిన వ్యక్తులు బెల్జియం వారే.

'కొత్తగా చేర్చే వ్యక్తుల సామర్థ్యాల ఆధారంగా రిక్రూటర్లకు ఐఎస్ఐఎస్ చెల్లింపులు జరుపుతున్నది. ఈ చెల్లింపులు రెండు వేల డాలర్ల నుంచి పది వేల డాలర్ల వరకు ఉంటున్నాయి. బాగా చదువుకున్నవాళ్లు, కంప్యూటర్ స్పెషలిస్టులు, వైద్యులు వంటివారిని చేర్చితే ఎక్కువమొత్తం చెల్లింపులు జరుపుతున్నది' అని ఆమె వివరించారు. బెల్జియానికి చెందిన షరియా ఫర్ బెల్జియం సంస్థ మొదట 2010లో ఐఎస్ కోసం నియామకాలు చేపట్టింది. దాని గుట్టురట్టయి.. నిర్వాహకులు అరెస్టు కావడంతో ఇప్పుడు వేర్వేరు వ్యక్తులు నియామకాలు చేపడుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement