
సోలాపూర్–ధూళే నేషనల్ హైవేపై సర్వీసు రోడ్డును నిర్మిస్తున్న ఎన్‌హెచ్‌ఏ
ఓవైపు ‘హరితహారం’ఏర్పాట్లు ..మరోవైపు చెట్ల నరికివేత పనులు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తుల్జాపూర్ నాక వాసులు
సోలాపూర్: ఒకవైపు పట్టణవ్యాప్తంగా ‘హరితహారం’కోసం ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు తుల్జాపూర్‌లో అందుకు భిన్నంగా చెట్ల నరికివేత జరుగుతోంది. దీంతో ఎస్‌ఎంసీ వైఖరి ఏమిటో అంతుబట్టడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సోలాపూర్ – ధూళే నేషనల్ హైవేపై సోలాపూర్– తలే ఇప్పర్గా మార్గంలో నేషనల్ హైవే అథారిటీ సర్వీసు రోడ్డును నిర్మిస్తోంది. ప్రతి ఏడాది తుల్జాపూర్‌లో జరిగే కోజగిరి పూర్ణిమ వేడుకల కోసం వేలాది భక్తులు ఈ మార్గం గుండానే కాలినడకన ప్రయాణిస్తారు. అలాగే పండరీపూర్‌లో జరిగే ఆషాఢ ఏకాదశి ఉత్సవాల కోసం వేలాది మంది వార్కారీలు, భక్తులు సాధుసంతుల పల్లకీలతో ఇదే మార్గంలో పాదయాత్రగా వెళుతుంటారు. వీరంతా మార్గమధ్యంలో ఈ చెట్లనీడనే సేదతీరతారు. ఇప్పుడా సౌకర్యం ఉండబోదంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కాగా సర్వీసు రోడ్డు పనుల కోసమే చెట్లను నరికివేస్తున్నామని, పూర్తైన అనంతరం తిరిగి మొక్కలు నాటుతామని సోలాపూర్ జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ రాకేష్ జవాడే తెలిపారు.