అబుదాబి: కిడ్నాప్ చేసి.. మతం మార్చి.. ఉగ్రవాద గ్రూపులో చేర్చినట్లు ప్రచారం జరుగుతున్న కేరళ యువతి ఉన్నట్టుండి మీడియా ముందుకు వచ్చారు. ప్రేమించిన వ్యక్తి కోసం తాను అబుదాబి వెళ్లానని.. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు. వివరాలు.. కేరళ కోజికోడ్‌కు చెందిన 19 ఏళ్ల సియానీ బెన్ని అనే యువతి ఢిల్లీలోని జీసస్ అండ్ మేరి కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 18 నుంచి సియానీ కనిపించకుండా పోయారు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సియానీ అబుదాబి వెళ్లినట్లు గుర్తించారు. దాంతో ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని.. మతం మార్చి.. ఉగ్రవాద గ్రూపులో చేర్చారనే ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలో సియానీ మీడియా ముందుకు వచ్చారు. తనను కిడ్నాప్ చేశారంటూ వస్తోన్న వార్తల్ని ఖండించారు. ప్రేమించిన యువకుడి కోసం తాను అబుదాబి వెళ్లానని తెలిపారు. ఈ సందర్భంగా సియానీ మాట్లాడుతూ.. ‘అబుదాబిలో స్థిరపడిన భారత సంతతి వ్యక్తితో 9 నెలల క్రితం నాకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ప్రేమగా మారింది. అతడిని వివాహం చేసుకోవడం కోసమే నేను అబుదాబి వెళ్లాను. నా ఇష్ట ప్రకారమే ఇస్లాంలోకి మారాను. ఇందులో ఎవరి బలవంతం లేదు. భారత్‌కు చెందిన నేను మేజర్‌ని. నా జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం అయినా తీసుకునే హక్కు నాకుంది’ అని తెలిపారు.
అంతేకాక తన ఇష్ట ప్రకారమే ఇస్లాంలోకి మారానని అబుదాబి కోర్టులో కూడా తెలిపానన్నారు. తన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం తనను కలుసుకోవడానికి అబుదాబి వస్తున్నారని పేర్కొన్నారు సియానీ. తనకు ఇండియా వచ్చే ఉద్దేశం లేదని.. ఇక్కడే ఉంటానని.. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంటానని సియానీ స్పష్టం చేశారు. అంతేకాక తనను కిడ్నాప్ చేశారంటూ ప్రచారం చేస్తోన్న వారిపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment