
బాధితుడు తిరుపతి
బంజారాహిల్స్: సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న ఓ యువతిని అక్కడే పనిచేస్తున్న ఓ యువకుడు ప్రేమించాడు. ఇది అమ్మాయి అన్నయ్యకు నచ్చలేదు. దీంతో చెల్లెలిని ప్రేమించిన యువకుడిని కిడ్నాప్ చేసి దాడి చేశాడు. ఫిలింనగర్‌లో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. వివరాలు... ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌నగర్ బస్తీలో నివసించే జి. తిరుపతి(23) జూబ్లీహిల్స్ రోడ్ నెం. 82లోని రత్నదీప్ సూపర్‌మార్కెట్‌లో పని చేస్తున్నాడు. అందులోనే పని చేస్తున్న సేల్స్‌గర్ల్(22)ని గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. పలుమార్లు తన ఫోన్‌లో ఆమె ఫొటోలు కూడా తీయడమే కాకుండా ప్రేమ సందేశాలు పంపించాడు. ఈ విషయం యువతి సోదరుడు అరవింద్‌గౌడ్‌కు పది రోజుల క్రితం తెలిసింది. చెల్లెలిని మందలించాడు. అక్కడ పని మానేయాల్సిందిగా హెచ్చరించాడు. తండ్రికి గుండె సంబంధిత వ్యాధి ఉండటంతో ఈ విషయం తెలిస్తే గుండెపోటు వస్తుందేమోనని భయపడి ఆయనకు తెలియకుండా చెల్లెలిని ప్రేమిస్తున్న వ్యక్తిని మందలించి ఫోన్‌లో నుంచి ఫొటోలు డిలీట్ చేయించాలని తన స్నేహితులతో పథకం వేశాడు.
ఇందులో భాగంగానే శనివారం రాత్రి 11.30 గంటలకు సూపర్‌మార్కెట్ మూసేసిన తర్వాత బయటకు వచ్చిన తిరుపతిని మాట్లాడదాం రమ్మని అరవింద్‌గౌడ్ తన బైక్‌పై కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాడు. ఆ సమయంలో తిరుపతి స్నేహితుడు మహేష్ అక్కడే ఉండి ఇదంతా గమనించాడు. కొద్దిసేపటికి తిరుపతిని బైక్‌పై తీసుకెళ్ళిన అరవింద్ ఇంకో ఇద్దరు స్నేహితులతో కలిసి వెంకటగిరి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో తీవ్రంగా కొట్టారు. చేతులతో పిడిగుద్దులు గుద్దారు. కాళ్ళతో తన్నారు. ఫోన్‌లో చెల్లెలి ఫొటోలు డిలీట్ చేశారు. ఈ పరిణామాలతో తిరుపతి భయంతో బిక్కుబిక్కుమంటూ కుప్పకూలిపోయాడు. ఆందోళన చెందిన అరవింద్ వెంటనే తిరుపతిని సమీపంలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. సరిగ్గా 12 గంటలకు తన స్నేహితుడిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ మహేష్ 100 కు కాల్‌చేశాడు. క్షణాల్లో జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందింది. నైట్ డ్యూటీ ఎస్‌ఐ శంకర్‌తో పాటు పోలీసులంతా బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. తిరుపతి ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. అరవింద్ ఫోన్ కూడా పని చేయలేదు. మరింత కంగారుపడ్డ పోలీసులు అన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో గాలించారు. తీరా ఉదయం 6 గంటలకు అరవింద్ తన బైక్‌పైనే తిరుపతిని ఆయన గదిలో వేసి వెళ్ళిపోయాడు. అప్పటికి గాని పోలీసులు ఊపిరి పీల్చుకోలేదు. అరవింద్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment