
అందుకోసం కొంత డబ్బుతో పాటు కొత్త బట్టలు కూడా కొని పెట్టుకున్నాడు
తిరువనంతపురం : కేరళను ముంచెత్తుతున్న వరదలు ఒక పంతొమ్మిదేళ్ల యువకుని భవిష్యత్తుని కూడా మింగాయి. వరదల్లో సర్టిఫికెట్లు నాశనం అయిన విషయం తట్టుకోలేని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. కొజికోడ్‌కు చెందిన కైలాష్ మరి కొద్ది రోజుల్లో ఐటీఐ కోర్సులో జాయిన్ కావాల్సి ఉంది. అందుకోసం కొంత డబ్బుతో పాటు కొత్త బట్టలు కూడా కొని పెట్టుకున్నాడు. కానీ అనుకోని ప్రమాదంలా వచ్చిన వరదలు అతని ఆశల్ని చిదిమేసాయి.
కేరళను ముంచెత్తిన భారీ వరదల్లో కైలాష్ నివాసం కూడా మునిగి పోయింది. దాంతో కైలాష్ తల్లిదండ్రులతో కలిసి సమీప సహాయక శిబిరానికి వెళ్లాడు. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు లేవని ప్రకటించడంతో కైలాష్ ఆదివారం తన నివాసానికి చేరుకున్నాడు. కానీ ఇంటి పరిస్థితుల చూసిన అతనికి నోట మాట రాలేదు. ఎందుకంటే ఆ వరదల్లో కైలాష్ ఇంట్లోని వస్తువులే కాక అతని ఇంటర్‌మీడియేట్ సర్టిఫికేట్లు కూడా నాశనమయ్యాయి. దాంతో మనస్తాపం చెందిన కైలాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.