మనకెదురైన ఇబ్బంది మనలోని సామర్థ్యాన్ని బయటపెడితే ఎదుటి వాళ్లకు వచ్చిన కష్టం మనలోని మానవత్వాన్ని చూపెడుతుంది. ఈ నిజాన్ని ప్రకృతి వైపరీత్యాలెన్నో రుజువు చేశాయి. ఇప్పుడు కేరళ వరదలూ ఆ దృశ్యాలను చూపెడుతున్నాయి. వందేళ్ల కనివినీ ఎరుగని వరదలు కేరళను ముంచేస్తున్నాయి. దాదాపు 400 మందిని మింగేశాయి. ఇంకెంతోమంది జాడను గల్లంతు చేశాయి. ప్రకృతి చేస్తున్న ఆ బీభత్సాన్ని ఆపలేం. చేతుల్లో ఉన్నది.. సాయం చేయడమే. చేయందించి ఒడ్డుకు లాగడమే. ఆ పని రెస్క్యూ టీమ్ చేస్తోంది. జ్వరంతో ఒళ్లు కాలిపోతున్న పిల్లాడిని గుండెలకత్తుకొని... వరదపోటుకి కూలిపోతున్న బ్రిడ్జి మీద నుంచి పరిగెత్తి... ఆ పిల్లాడి ప్రాణాలు కాపాడిన రెస్క్యూ ఆఫీసర్ కన్నయ్య కుమార్ సాహసం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే... ఇంకో పేరు వినిపిస్తోంది.. మనిషీ కనిపిస్తున్నాడు. ఆయన విష్ణు కఛ్వా.
మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. వ్యాపార నిమిత్తం కేరళలోని కన్నూర్ జిల్లా, ఇరిట్టీలో ఉంటున్నాడు భార్య, ఇద్దరు పిల్లలతో. నెలలో రెండుసార్లు హరియాణాకు వెళ్లి అక్కడి నుంచి బ్లాంకెట్స్ తెచ్చి ఇరిట్టీ, చుట్టుపక్కల ఊళ్లలో ఇంటింటికీ తిరిగి వాటిని అమ్ముతుంటాడు. ఎప్పటిలాగే ఈసారీ వెళ్లాడు హర్యానా దుప్పట్లు తేవడానికి. వెళ్లేముందు అంతా బాగానే ఉంది. దుప్పట్ల బేరం అయ్యాక హరియాణాలో రైలు ఎక్కి ఇక్కడ దిగేదాకా తెలియదు అంతా మునిగిపోయిందని. హతాశుడయ్యాడు. ఇల్లు, పొలం, పుట్రా, గొడ్డు, గోదా ఉన్న కుటుంబాలన్నీ దిక్కులేని వాళ్లయ్యారని, ఎక్కడో రెస్క్యూ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారని తెలిసి విలవిల్లాడాడు. వానకు తడిసి.. చలితో వణికిపోతున్న ముసలివాళ్లు, పిల్లలు కళ్లల్లో మెదిలారు. తను చేయదగ్గదొక్కటే.. బ్యాగ్‌లో ఉన్న బ్లాంకెట్స్‌ను వాళ్లకు అందివ్వడమే. వెంటనే కన్నూరు కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లి విషయం చెప్పాడు. అతని వివరాలు, జీవనాధారం అన్నీ తెలుసుకున్న కలెక్టర్.. ‘‘వీటిని పంచేస్తే నువ్వెలా బతుకుతావు.. వద్దు’’ అని సున్నితంగా వారించాడు. ‘‘నాకు అన్నం పెట్టిన ఊరు, ఉండడానికి చోటిచ్చిన నా మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ల బాధలతో నేను వ్యాపారం చేసుకోలేను సర్.. నేను చేయగలిగింది ఇదొక్కటే.. దయచేసి ఈ దుప్పట్లను వాళ్లకు ఇచ్చేయండి’’ అన్నాడట నీళ్లు నిండిన కళ్లతో బ్యాగ్‌ను కలెక్టర్ చేతుల్లో పెడుతూ. ఆ మాటలకు కలెక్టర్‌తో పాటు అక్కడున్న ప్రభుత్వ సిబ్బంది కళ్లూ చెమ్మగిల్లాయి. విష్ణును తీసుకొని అప్పుడే తెరిచిన అడిచుకూట్టి స్కూల్ శిబిరానికి వెళ్లాడు కలెక్టర్. విష్ణు చేతుల మీదుగానే ఆ దుప్పట్లను ఇప్పించాడు. అంత వైపరీత్యానికి విష్ణుది ఉడుత సాయమే కావచ్చు.. కానీ అది చేయూతనివ్వడానికి ముందుకొచ్చే వాళ్లకు అది కొండంత స్ఫూర్తి!
మదరసా నిలిచింది..
అంతా బాగా ఉన్నప్పుడు.. అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నప్పుడు.. మనిషి, మనిషికీ మధ్య కులం, మతం, డబ్బు అన్నీ అడ్డుగోడలవుతాయి. వీటిని కూలగొట్టడానికేనేమో ప్రకృతి ఇలాంటిది సృష్టిస్తుంది అనిపిస్తోంది కోజికోడ్ జిల్లాలోని మదరసాను చూస్తుంటే. ఆ జిల్లాలోని హిందువులందరికీ ఆశ్రయమిస్తూ రక్షిస్తోంది ఈ మదరసానే! మనుషుల్లాగే ఉందాం.. అంతా బాగున్నప్పుడు కూడా! మానవత్వాన్ని నిద్రలేపడానికి వైపరీత్యాల అవసరం మనకొద్దు! కష్టానికి చలించడం మన నైజం. దాన్నెప్పుడూ జీవంతోనే ఉంచుదాం!
మనిషి పుడతాడు కష్టంలో
Published Tue, Aug 21 2018 12:17 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment