నిందితుడు విష్ణు తేజ
సాక్షి, గుంటూరు : ‘మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలకు ఈ భూమి మీద అదే చివరి రోజు అవుతుంది.. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఉరిశిక్ష పడేలా చేస్తాం.. ఇలాంటి వారిని మహిళలు రోడ్లపైకి ఈడ్చి బుద్ధి చెప్పాలి..’ ఈ మాటలన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దాచేపల్లిలో మైనర్ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన సమయంలో గుంటూరు వచ్చిన ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో హెచ్చరికలు చేయడంతో అంతా నిజమని నమ్మారు. అయితే ఆయన హెచ్చరించిన వారం రోజులకే అదే దాచేపల్లిలో ఓ మైనర్ బాలికపై టీడీపీ మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా గర్భవతిని సైతం చేసిన దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారే తప్ప, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయాయి.
మంత్రి నియోజకవర్గంలో మరో అమానుషం..
తాజాగా రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరులో 11 ఏళ్ల మైనర్ బాలికపై అధికార పార్టీ నేత తనయుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడ్డ మృగాడిని కఠినంగా శిక్షించాల్సిన అధికార పార్టీ నేతలే నిరుపేద బాధిత కుటుంబాన్ని డబ్బుతో మభ్యపెట్టి కేసు లేకుండా చేశారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కులం పరువు పోతుందంటూ కొందరు అధికార పార్టీ నేతలు పంచాయితీ చేసి బాలిక కుటుంబానికి కొంత డబ్బు ఇచ్చేలా మాట్లాడి కేసు లేకుండా రాజీ కుదిర్చారు. పోలీసులకు అత్యాచార ఘటన గురించి వివరాలు తెలిసినప్పటికీ అధికార పార్టీ నేత తనయుడు కావడంతో రాజీ పడ్డారంటూ కేసు నమోదు చేయకుండా వదిలేశారు. దీనిపై ఈనెల 13న‘మైనర్ బాలికపై టీడీపీ నేత తనయుడి లైంగిక దాడి’ శీర్షికతో ప్రచురించిన వార్తకు స్పందించిన ఎస్పీ వెంకటప్పలనాయుడు ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా శనివారం అమృతలూరు వెళ్ళిన సమయంలో బాలిక తల్లిదండ్రులను పిలిపించి విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ తెనాలి డీఎస్పీ స్నేహితను ఆదేశించారు.
అమానుష ఘటన వివరాలివీ...
అమృతలూరు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న 11 ఏళ్ళ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన శరణు విశ్వతేజ అనే యువకుడు ఈనెల 2వ తేదీ మధ్యాహ్నం బాలికకు మాయమాటలు చెప్పి రామమందిరం వద్దకు తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. విష్ణుతేజ తండ్రి నాగేశ్వరరావు అధికార పార్టీ ముఖ్యనేత. గతంలో ఆయన కూచిపూడి నీటి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. మృగాడి బెదిరింపులతో విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు బాలిక భయపడింది. ఇది జరిగిన రెండు రోజులకు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుండగా అనుమానం వచ్చిన తల్లి గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఫిర్యాదు చేసేందుకు కుమార్తెతో కలసి పోలీసు స్టేషన్‌కు వెళుతుండగా, మృగాడి బంధువులు ఆమెను అడ్డుకుని కుల పెద్దలు, అధికార పార్టీ నేతలతో పంచాయితీ పెట్టారు. బాలిక కుటుంబం పూరిగుడిసెలో నివాసం ఉంటూ కటిక బీదరికంతో ఇబ్బందులు పడుతుండటాన్ని ఆసరాగా తీసుకుని బాలికపై అమానుషానికి వెలకట్టేందుకు వెనుకాడలేదు. చివరకు రూ.10 లక్షలు ఇచ్చేలా బేరం కుదుర్చుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా రాజీ కుదిర్చారు.
పోలీసులకు తెలిసినా...
అత్యాచార ఘటన విషయం పోలీసులకు తెలిసినప్పటికీ వారిద్దరూ రాజీ పడ్డారంటూ కేసు నమోదు చేయకుండా వదిలేశారు. బాలిక కుటుంబానికి మాత్రం కేవలం రూ.4 లక్షలు చెల్లించారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ‘సాక్షి’ దీనిని వెలుగులోకి తెచ్చింది.
రూరల్ ఎస్పీ చొరవతో...
విషయం తెలుసుకున్న రూరల్ ఎస్పీ సీహెచ్.వెంకటప్పలనాయుడు ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా శనివారం అమృతలూరుకు వెళ్ళిన సమయంలో బాలికను, ఆమె తల్లిని పిలిపించి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ తెనాలి డీఎస్పీ స్నేహితను ఆదేశించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం బాలికను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రిలో బాలిక, ఆమె తల్లితో డీఎస్పీ స్నేహిత మాట్లాడి సంఘటనపై ఆరా తీశారు. అధికార పార్టీ ముఖ్య నేతలు రాష్ట్రంలో ఎంత పెద్ద సంఘటన జరిగినా నష్టపరిహారం పేరుతో డబ్బులు ఇచ్చి తూతూ మంత్రపు చర్యలతో సరిపెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అమృతలూరు అధికార పార్టీ నేతలు సైతం ఇదే మార్గాన్ని ఎంచుకుని డబ్బుతో ఆడపిల్లపై అమానుషానికి పాల్పడితే దానికి వెలకట్టే దుశ్చర్యకు పాల్పడ్డారు. విషయం బయట పడడంతో కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసు అధికారులపై ఒత్తిడి పెంచే యత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment