ఒకపక్క ఉక్కుపాదం.. మరోపక్క గుప్పు గుప్పు | Ganja Worth Rs 1. 42 Crore Seized Two People Arrested In Khammam | Sakshi
Sakshi News home page

ఒకపక్క ఉక్కుపాదం.. మరోపక్క గుప్పు గుప్పు

Published Fri, Nov 12 2021 1:18 AM | Last Updated on Fri, Nov 12 2021 1:18 AM

Ganja Worth Rs 1. 42 Crore Seized Two People Arrested In Khammam - Sakshi

సత్తుపల్లిలో పట్టుబడిన గంజాయి ప్యాకెట్లను పరిశీలిస్తున్న ఖమ్మం సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ 

సాక్షి, నెట్‌వర్క్‌: ఎంత ఉక్కుపాదం మోపినా గంజాయి ఇంకా గుప్పుమంటూనే ఉంది. రవాణా చేస్తూ కొందరు.. పంట సాగుచేస్తూ ఇంకొందరు.. ఇంట్లోనే పెంచుతూ ఒకరు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఆయా దాడుల్లో దాదాపు 600 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకోగా, పదుల సంఖ్యలో మొక్కల్ని పోలీసులు ధ్వంసం చేశారు.

గురువారం నమోదైన ఆయా కేసుల వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని మారేడుమిల్లి నుంచి రాజమండ్రి, అశ్వారావుపేట, ఖమ్మం, హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్ర తరలించేందుకు నిందితులు ట్రాలీ అడుగు భాగంలో ప్రత్యేక అరను తయారుచేసి 566 కేజీల గంజాయి ప్యాకెట్లను రవాణా చేస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సత్తుపల్లిలో బుధవారం రాత్రి సదరు ట్రాలీని, అందులోని రూ.1.42 కోట్ల విలువైన 566 కేజీల ఎండు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు గురువారం ఖమ్మం సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్లు యోగేష్‌ లింబాజీ థోర్వ్, ఇర్ఫాన్‌ సదర్‌ పఠాన్‌ను అరెస్ట్‌చేశామని, మరో ప్రధాన నిందితుడు గణేష్‌ ఉబలే పరారీలో ఉన్నాడని తెలిపారు. 

దర్జాగా రిజర్వేషన్‌ కోచ్‌లో ప్రయాణం 
ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన నిలంచల పట్నాయక్, ప్రకాష్‌చంద్ర బెహర డబ్బులు సంపాదించాలనే ఆశతో గంజాయిని ముంబైలో అమ్మాలనుకున్నారు. 20 కేజీల ఎండు గంజాయిని 4 ప్యాకెట్లుగా ప్యాక్‌చేసి రెండు క్లాత్‌బ్యాగుల్లో పెట్టి అనుమానం రాకుండా కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రిజర్వేషన్‌ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. రైలు వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు రాగానే పోలీసులు అనుమానంతో వీరిని తనిఖీచేయగా గుట్టురట్టయింది. గంజాయి విలువ రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 

విద్యార్థులకు అమ్మకం.. 
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ శివారులోని మడద క్రాసింగ్‌ వద్ద వాహన తనిఖీల్లో ఇద్దరు యువకుల నుంచి పోలీసులు 280 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మెదక్‌ జిల్లా రామాయంపేటలో విద్యార్థులకు గంజాయి అమ్ముతున్న నవీన్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని 3 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.  

బయట దొరకట్లేదని ఇంట్లోనే సాగు 
మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధి అరుంధతినగర్‌లో ఉండే ఆయాజ్‌ఖాన్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌. గంజాయి మత్తుకు అలవాటుపడిన అతడు.. బయట ఎక్కడా సరుకు దొరక్కపోవడంతో ఇల్లు అద్దెకు తీసుకొని మేకలను పెంపకం మాటున గంజాయి మొక్కల్ని పెంచుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం దాడిచేసి గంజాయి మొక్కలను, 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 

పత్తిచేనులో ‘మత్తు’సాగు 
ఆదిలాబాద్‌ జిల్లా బొసార గ్రామంలో, బోథ్‌ మండలం పార్డి కె గ్రామ శివారులో పత్తిచేను మాటున గంజాయి సాగుచేస్తున్న క్షేత్రాలపై పోలీసులు దాడులు చేశారు. రెండుచోట్లా 80 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. సాగుచేస్తున్న రైతులు సీతారాం, ఈశ్వర్‌పై కేసు నమోదుచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement