Attappadi Trolley Bags Case: Ex-Employee With Lover Killed Hotel Owner - Sakshi
Sakshi News home page

దారుణం: ప్రియురాలినే ఎరగా వేసి హోటల్‌ గదికి రప్పించి.. ప్రతీకార హత్య!

Published Sat, May 27 2023 12:22 PM | Last Updated on Sat, May 27 2023 1:10 PM

Ex Employee With Lover Kills Owner - Sakshi

క్రైమ్‌: ఆ ఇద్దరికీ పాత గొడవలు ఉన్నాయి. అది మనసు పెట్టుకుని ఎలాగైనా చంపాలని ప్లాన్‌ చేశాడు శిబిల్‌. అందుకు తన ప్రియురాలినే ఎరగా ఉపయోగించాడు. హనీట్రాప్‌ ద్వారా ప్రత్యర్థిని రప్పించి.. అత్యంత కిరాతకంగా హతమార్చాడు. కేరళలో సంచలనం సృష్టించిన రంజిపాలెం మర్డర్‌ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. 

శుక్రవారం అట్టప్పడి వద్ద అనుమానాస్పద రీతిలో పడి ఉన్న రెండు ట్రాలీ బ్యాగ్‌లు పోలీసుల దృష్టికి వచ్చాయి. వాటిని ఓపెన్‌ చేసి చూడగా.. మనిషి శరీరం ముక్కలు కనిపించాయి. దీంతో ఆ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదే సమయంలో.. త్రిస్సూర్‌ చెరుతుర్తి వద్ద ఓ హోండా సిటీ కారును వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ కారుకు.. అటవీ ప్రాంతంలో దొరికిన ట్రాలీ బ్యాగులకు ఏదైనా కనెక్షన్‌ ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు.. ఆ కేసు ప్రతీకార హత్యగా తేలుస్తూ చిక్కుముడిని విప్పారు.  

మల్లప్పురం తిరూర్‌కు చెందిన సిద్ధిఖ్‌(58) ఐదేళ్ల కిందట గల్ఫ్‌ దేశాల నుంచి తిరిగి వచ్చాడు. రంజిపాలెంలో ఓ హోటల్‌ నడుపుతూ స్థిరపడ్డాడు. అందులో  శిబిల్‌(22) మేనేజర్‌గా పని చేసేవాడు. అయితే తన హోటల్‌ పేరుతో శిబిల్‌ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడనే విషయం సిద్ధిఖ్‌ దృష్టికి వచ్చింది. దీంతో..  అతన్ని ఉద్యోగంలోంచి తీసేశాడు సిద్ధిఖ్‌. ఈ పరిణామంతో శిబిల్‌ కోపంతో రగిలిపోయాడు. మరో స్నేహితుడితో కలిసి సిద్ధిఖ్‌ అంతుచూడాలని అనుకున్నాడు.  అందుకు తన ప్రియురాలు ఫర్హానా(18)ను సాయం చేయమని కోరాడు. 

ఫర్హానా సిద్ధిఖ్‌తో ఫోన్‌ ద్వారా పరిచయం పెంచుకుంది. చివరకు.. శారీరక సుఖం అందిస్తానని, ఎర్హనిపాలెంలోని ఓ హోటల్‌కు రావాలంటూ కబురు పంపింది. మే 18వ తేదీన హోటల్‌ వద్దకు సిద్ధిఖ్‌ చేరుకున్నాడు. గదిలోకి వెళ్లిన అతన్ని.. శిబిల్‌, ఫర్హానా కలిసి హతమార్చారు. చంపేశాక ఆ బాడీని ముక్కలు ముక్కలు చేసి.. రెండు ట్రాలీ బ్యాగుల్లో కుక్కేసింది ఆ ప్రేమ జంట. ఆపై మరో స్నేహితుడి సాయంతో ఆ ట్రాలీ బ్యాగులను సిద్ధిఖ్‌ కారులోనే తీసుకెళ్లి అట్టప్పడి వద్ద పడేసి వెళ్లిపోయారు.   

తండ్రి కనిపించకుండా పోవడంతో.. విదేశాల నుంచి తిరిగొచ్చాడు కొడుకు. నాలుగు రోజుల తర్వాత అంటే మే 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు ఫైల్‌ చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. రెండు రోజులకే సిద్ధిఖీ అకౌంట్‌ నుంచి ఏటీఎం కార్డు ద్వారా భారీగా నగదు విత్‌డ్రా అయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈలోపు ట్రాలీ బ్యాగులో మృతదేహం బయటపడడం.. అది సిద్ధిఖీదేనని పోలీసులు నిర్ధారించుకోవడం జరిగిపోయాయి.

డబ్బు విత్‌డ్రా అయిన ప్రాంతం గురించి పోలీసులు ఎంక్వైయిరీ చేయగా.. చెన్నై నుంచి ఆ డబ్బు విత్‌ డ్రా అయినట్లు తేలింది. దీంతో చెన్నై పోలీసుల సాయం కోరగా.. వాళ్లు శిబిల్‌, ఫర్హానాను అదుపులోకి తీసుకుని కేరళ పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు అషిఖ్‌ను సైతం కస్టడీలోకి తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement