కేరళలోని కోజికోడ్‌లో ఈ నెల 23 నుంచి 25 వరకు బీజేపీ జాతీయ మండలి సమావేశాలు జరగనున్నాయి.
న్యూఢిల్లీ: కేరళలోని కోజికోడ్‌లో ఈ నెల 23 నుంచి 25 వరకు జరిగే బీజేపీ జాతీయ మండలి సమావేశాలను పార్టీ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్‌కు అంకితమివ్వనున్నారు. 25న ఉపాధ్యాయ్ శత జయంతి ఉత్సవాలను, ఆయన స్మృత్యర్థం ఏడాది పాటు జరిగే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
బీజేపీ మాతృ సంస్థ జనసంఘ్‌కు ఉపాధ్యాయ్ 1967లో ఇదే వేదికలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సమావేశాల్లో ‘పేదల సంక్షేమం’ను ప్రధాన ఎజెండాగా చేపడుతారు. 2 వేల మంది పార్టీ ప్రతినిధులకు వసతి కల్పించే స్వప్న నగరిలోని ప్రాంతానికి ఉపాధ్యాయ్ పేరు పెడతారు. అక్కడ ఓ ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తారు. ఆధునిక కాల రాజకీయ నాయకుల్లో ఉపాధ్యాయ్‌కు తగిన గుర్తింపు దక్కలేదని బీజేపీ నేతలు తరచూ ఆవేదన చెందుతున్నారు.
25న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతారు. తరువాత మోదీ ముగింపు ప్రసంగం చేస్తారు. దళితులపై వరస దాడులు, ధనికుల అనుకూల ప్రభుత్వం అని విమర్శలు ఎదురవడంతో పేదలకు చేరువయ్యేందుకు బీజేపీ ‘గరీబ్ కళ్యాణ్(పేదల సంక్షేమం)’ ఎజెండాను ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే.