దేశంలో సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన కేరళలోని కోజికోడ్‌ను భారతదేశపు తొలి సాహిత్య నగరంగా యునెస్కో ప్రకటించింది. అక్టోబర్ 2023లో కోజికోడ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ (యూసీసీఎన్)కు చెందిన సాహిత్య విభాగంలోకి ప్రవేశించింది.
కేరళలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎంబి రాజేష్.. కోజికోడ్ సాధించిన విజయాన్ని ప్రకటించారు. కోల్‌కతా వంటి ఘనమైన సాంస్కృతిక చరిత్ర కలిగిన నగరాలను పక్కకునెట్టి, యునెస్కో నుండి కోజికోడ్ ‘సిటీ ఆఫ్ లిటరేచర్’ బిరుదును దక్కించుకుందని మంత్రి తెలిపారు.
కోజికోడ్‌లో 500కుపైగా గ్రంథాలయాలు ఉన్నాయి. కేరళకు చెందిన ప్రముఖ మలయాళ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ కోజికోడ్‌లో ఉంటూ సాహిత్యరంగానికి ఎనలేని సేవలు అందించారు. యూసీసీఎన్‌లో చేరిన 55 కొత్త నగరాల్లో భారతదేశానికి చెందిన గ్వాలియర్, కోజికోడ్ ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సంగీత విభాగంలో ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సంపాదించుకోగా, కోజికోడ్ సాహిత్య విభాగంలోకి ప్రవేశించింది.
యునెస్కో నుండి ఈ ఘనతను అందుకున్న ఇతర నగరాల్లో బుఖారా ‘క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్’ విభాగంలో, కాసాబ్లాంకా ‘మీడియా ఆర్ట్స్’ విభాగంలో, చాంగ్‌కింగ్ డిజైన్ విభాగంలో, ఖాట్మండు ఫిల్మ్ కేటగిరీలో స్థానం దక్కించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment