తిరువనంతపురం: అథ్లెటిక్ దిగ్గజం, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కన్నీళ్ల పర్యంతమైంది. కోజికోడ్‌లోని తన అకాడమీలో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడి భద్రతపై కూడా ఉష తన బాధను వెల్లడించింది. ‘నా అకాడమీ మధ్యలోనే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. మేం బౌండరీ నిర్మించుకునేందుకు కూడా అడ్డు పడుతున్నారు. అదేమని అడిగితే దురుసుగా మాట్లాడుతూ బెదిరిస్తున్నారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశా ను.
ఆయన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా అకాడమీలోని 25 మంది మహిళా అథ్లెట్లలో 11 మంది ఉత్తరాదికి చెందినవారు. వారి భద్రత మాకు ముఖ్యం’ అని ఉష పేర్కొంది. సుమారు 30 ఎకరాల ఈ అకాడమీ స్థలాన్ని కేరళలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉషకు 30 సంవత్సరాల కాలానికి లీజుకు ఇచ్చింది. గత జూలైలో రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత తనపై ఇలాంటి వేధింపులు పెరిగాయని ఉష చెబుతోంది. దురదృష్టవశాత్తూ ప్రతీ రాజకీయ పార్టీ తనను మరో పార్టీ సానుభూతిపరురాలిగా చూస్తోందని, అయితే తనకు ఎలాంటి రాజకీయాలు తెలియవని ఉష తన బాధను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment