తిరువనంతపురం: కేరళలో గతేడాది నిఫా వైరస్ సృష్టించిన అలజడి మరువకముందే.. తాజాగా వెస్ట్ నైల్ వైరస్ భయాందోళనలు రేకతిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే మలప్పురం జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. కోజికోడ్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న ఆ బాలుడికి పరీక్షలు నిర్వహించగా వెస్ట్ నైల్ వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అక్కడి వైద్యులకు సహాయం అందించడానికి ఎన్‌సీడీసీ గురువారం ఓ ప్రత్యేక వైద్యుల బృందాన్ని కేరళకు పంపింది. కానీ, వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. సోమవారం ఆ బాలుడు తుదిశ్వాస విడిచాడు.
వెస్ట్ నైల్ వైరస్‌ను తొలుత 1937లో యుగాండాలో కనుగొన్నారు. ఈ వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఉత్తర అమెరికాలో ఎక్కువగా వెస్ట్ నైల్ వైరస్ కేసులు నమోదు అవుతాయి. ఈ వైరస్ బారిన పడినవారిలో జ్వరం, తలనొప్పి, వాంతులు, ఒళ్లు నొప్పులు, కొన్ని సందర్భాల్లో దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ నివారించడానికి ఇప్పటివరకు ఎటువంటి మందులు లేదు. దోమలకు దూరంగా ఉండటం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా ఉండచ్చు.
వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని మలప్పురం జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఉత్తర మలబార్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటివరకు మరెవరికి వెస్ట్ నైల్ వైరస్ సోకినట్టుగా కేసులు నమోదు కాలేదు. కాగా, గతేడాది నిఫా వైరస్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బాధితులకు వైద్యం అందిస్తున్న వారు కూడా ఈ వ్యాధి బారిన పడి మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment