
సాక్షి, కోజికోడ్ : ధనార్జనే ధ్యేయంగా యాంత్రికంగా సాగుతున్న సమాజంలో వృత్తిని ప్రాణంగా ప్రేమించే వైద్యులు అరుదవుతున్న రోజుల్లో ఓ వైద్యుడి చర్య అందరినీ కదిలించింది. ప్రాణాంతక నిపా వైరస్‌తో మరణించిన రోగి అంత్యక్రియలను జరిపేందుకు బంధువులే వ్యాధి సోకుతుందనే భయంతో వెనుకాడితే డ్యూటీని పక్కనపెట్టి మరీ వైద్యుడు స్వయంగా ఆ తతంగం పూర్తిచేశారు. కోజికోడ్ కార్పొరేషన్ వైద్యాధికారి డాక్టర్ గోపకుమార్ స్వయంగా నిపా వైరస్‌తో మరణించిన 12 మంది మృతదేహాలకు అవసరమైన లాంఛనాలు పూర్తిచేసి అంతిమ యాత్రను పర్యవేక్షించారు. ముగ్గురు నిపా బాధితుల అంత్యక్రియలను తాను నిర్వర్తించానని 41 ఏళ్ల గోపకుమార్ పేర్కొన్నారు.
నిపా వైరస్‌తో కేరళలో ఇప్పటివరకూ 17 మంది మరణించారు. వీరిలో 14 మంది కోజికోడ్‌లో మరో ముగ్గురు పొరుగన ఉండే మలప్పురంలో తుదిశ్వాస విడిచారు. నిపా వైరస్‌తో మరణించిన 17 సంవత్సరాల బాలుడి అంత్యక్రియలను తాను నిర్వహించానని, నిపా వైరస్ సోకిందనే అనుమానంతో అతడి తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడ్ని చూసే పరిస్థితిలోనూ లేరని గోపకుమార్ చెప్పారు.
బాలుడి అంతిమయాత్రలో అతని సమీప బంధువులు, కుటుంబసభ్యులు ఎవరూ లేకపోవడం తనను బాధించిందని అన్నారు. అయితే బాలుడి అంత్యక్రియలను హిందూ సంప్రదాయాల ప్రకారం పూర్తిచేయాలని భావించి పూర్తి లాంఛనాలతో జరిపించానని చెప్పారు.ఇది తన బాధ్యతగా చేపట్టానని డాక్టర్ గోపకుమార్ చెప్పడం అక్కడివారిని కదిలించింది.
Comments
Please login to add a commentAdd a comment