నిఫాతో చనిపోయిన బాలుడికి కోజికోడ్‌లో పీపీఈ కిట్లతో స్థానిక సిబ్బంది అంత్యక్రియలు
కోజికోడ్: కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేరళలో మరో వైరస్ బయటపడింది. నిఫా వైరస్ సోకి 12 ఏళ్ల బాలుడు చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జి ఆదివారం వెల్లడించారు. అతడి నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ)కి పంపగా, నిఫా వైరస్‌గా నిపుణులు ధ్రువీకరించారని తెలిపారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్‌కు చెందిన నిపుణులను కేరళకు పంపించింది. ఈ బృందం వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో రాష్ట్ర యంత్రాంగానికి సాయపడనుంది.
బాలుడి మృతిపై ఆరోగ్య మంత్రి వీణా జార్జి మీడియాతో మాట్లాడారు. ‘12 ఏళ్ల బాలుడు నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. శుక్రవారం అతడి లాలాజలం తదితర నమూనాలను పుణెకు పంపించాం. శనివారం రాత్రి అతడి పరిస్థితి విషమంగా మారింది. ఆదివారం ఉదయం 5 గంటలకు అతడి మృతి చెందాడు. ఆగస్టు 27వ తేదీ నుంచి బాలుడితో సన్నిహితంగా ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితులు, చికిత్స జరిగిన ఆస్పత్రులకు చెందిన మొత్తం 188 మందిని గుర్తించాం. వీరందరినీ ఐసోలేషన్‌లో ఉండాలని కోరాం. వీరిలో హైరిస్క్ ఉన్న 20 మందిని కోజికోడ్ మెడికల్ కళాశాలలో ఐసోలేషన్‌లో ఉంచాం.
వీరిలో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల నమూనాల్లో నిఫా వైరస్ జాడలు బయటపడ్డాయి’అని ఆమె వివరించారు. ‘కోజికోడ్ మెడికల్ కాలేజీలో నిఫా బాధితుల కోసం ప్రత్యేకంగా వార్డు ఏర్పాటుచేశాం. ముందు జాగ్రత్తగా, బాలుడి నివాసం చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించాం’అని మంత్రి తెలిపారు. ‘ఇక్కడే నిఫా వైరస్ నిర్థారణ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని పుణె ఎన్‌ఐవీ అధికారులను కోరాం’ అని ఆమె వివరించారు. కాగా, దక్షిణ భారతంలోనే మొట్టమొదటి సారిగా 2018లో కేరళలోని కోజికోడ్‌లో నిఫా వైరస్ బారినపడిన 17 మంది చనిపోయారు.
ఏమిటీ నిఫా..!
ఇది›జూనోటిక్ వైరస్. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. దీనికి ప్రధాన ఆవాసం గబ్బిలాలే. వాటి నుంచి ఇతర జంతువులు, మనుషులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా పందులు, శునకాలు, గుర్రాలు ఈ వైరస్ బారినపడే ప్రమాదం ఉంది. మనుషులకు సోకితే ఆరోగ్య పరిస్థితి విషమించి మరణం సంభవించే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది.
లక్షణాలేమిటి?
► బ్రెయిన్ ఫీవర్
► తీవ్రమైన దగ్గుతో కూడిన జ్వరం.
► ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు
► ఇన్‌ఫ్లూయెంజా తరహా లక్షణాలు.. అంటే జ్వ రం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి, మగతగా ఉండడం.
► కొన్ని సందర్భాల్లో న్యుమోనియా తలెత్తడం
► 24 నుంచి 48 గంటలపాటు కోమాలోకి వెళ్లిపోయే అవకాశం సైతం ఉంది.
► మనిషి శరీరంలో ఈ వైరస్ 5 నుంచి 14 రోజులపాటు ఉంటుంది. కొన్ని కేసుల్లో 45 రోజులదాకా ఉండొచ్చు.
గుర్తించడం ఎలా?: అనుమానిత లక్షణాలున్న వ్యక్తి శరీరంలోని స్రావాలతో గుర్తించవచ్చు. ఇందుకోసం రియల్–టైమ్ పాలీమెరేజ్ చైన్ రియాక్షన్(ఆర్‌టీ–పీసీఆర్) పరీక్ష చేస్తారు. ఎలిసా, పీసీఆర్, వైరస్ ఐసోలేషన్ టెస్టుల ద్వారా కూడా గుర్తించవచ్చు.
మనుషుల్లో ఎలా వ్యాప్తి చెందుతుంది?
నిఫా వైరస్ సోకిన జంతువులు లేదా మనుషులకు దగ్గరగా మసలితే వ్యాప్తి చెందే అవకాశం ఉంది. నిఫా సోకిన గబ్బిలాల విసర్జితాల్లో ఈ వైరస్ ఆనవాళ్లు ఉంటాయి. ఈ గబ్బిలాలు ఉండే ప్రాంతాల్లో పండ్ల కోసం చెట్లు ఎక్కడం లేదా చెట్టు నుంచి రాలిన పండ్లు తినడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉంది. నిఫా వల్ల మరణించివారి మృతదేహాల్లోనూ వైరస్ ఉంటుంది. అలాంటి మృతదేహాలకు దూరంగా ఉండడం ఉత్తమం.
నివారణ ఎలా?: చేతులు తరచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లను బాగా కడిగిన తర్వాతే తినాలి. వైరస్ బారినపడిన వారికి దూరంగా ఉండాలి.
చికిత్స ఉందా?: నిఫా వైరస్ బాధితులకు ప్రస్తుతానికి నిరి్ధష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. అనుమతి పొందిన వ్యాక్సిన్, ఔషధాలూ లేవు. ల్యాబ్‌లో నిఫా వైరస్‌పై రిబావిరిన్ డ్రగ్ కొంత మేర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే, మనుషులపై ఈ డ్రగ్ ఉపయోగించవచ్చా? లేదా? అనేది నిర్ధారణ కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment