Sreelakshmi Suresh The Youngest Web Designer Story Sakshi Special- Sakshi
Sakshi News home page

డ్రీమ్‌ వీవర్‌ కీప్‌ మూవింగ్‌.. డోంట్‌ క్విట్‌

Published Sat, May 8 2021 4:55 AM | Last Updated on Sat, May 8 2021 9:00 AM

Sakshi Special Story On Web Designer Sreelakshmi Suresh

శ్రీలక్ష్మి సురేశ్‌... ప్రపంచంలోనే అతి చిన్న వయసులో వెబ్‌ డిజైనర్, సిఈవోగా నిలిచిన అమ్మాయి. కేరళ కోజికోడ్‌లో తను చదువుతున్న స్కూల్‌ కోసం ప్రెజెంటేషన్‌.కామ్‌ అనే వెబ్‌ సైట్‌ను తయారుచేసి రికార్డు సాధించారు. అప్పుడు శ్రీలక్ష్మి వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలు. ఇందుకుగాను శ్రీలక్ష్మి 40కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. అత్యద్భుతంగా వెబ్‌ డిజైన్‌ చేసిందని మేధావుల ప్రశంసలు సైతం అందుకున్నారు.

అసోసియేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ వెబ్‌మాస్టర్స్‌ సంస్థ శ్రీలక్ష్మికి తమ సంస్థలో సభ్యత్వంతోపాటు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గోల్డ్‌ వెబ్‌ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఆ అసోషియేషన్‌లో 18 సంవత్సరాల లోపు ఉండి, సభ్యత్వం పొందిన ఏకైక అమ్మాయి తనే. ఎన్నో సత్కారాలు, అవార్డులు అందుకున్న శ్రీలక్ష్మి ఇప్పుడు సొంతంగా వెబ్‌ ఇడిజైనింగ్‌ కంపెనీ ప్రారంభించారు. (www. edesign.co.in) ఈ కంపెనీకి సిఈవో. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో సిఈవోగా రికార్డు సాధించారు శ్రీలక్ష్మి. ఇప్పుడు శ్రీలక్ష్మి సైబ్రోసిస్‌ టెక్నో సొల్యూషన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌తో కలిసి ఆన్‌లైన్‌ పిక్సెల్‌ ట్రేడర్స్‌ సంస్థను ప్రారంభించి, విజయవంతంగా నడుపుతున్నారు.

శ్రీలక్ష్మి తండ్రి సురేశ్‌ మీనన్‌. ఆయన అడ్వొకేట్‌. తల్లి విజు సురేశ్‌. వెబ్‌ డిజైనింగ్‌ మీద తనకు ఆసక్తి కలగడానికి కారణం.. తన తండ్రి తనను చిన్నతనం నుంచి కంప్యూటర్‌ మీద పనిచేసుకోనివ్వటమే అంటారు. ‘కంప్యూటర్‌ నోట్‌పాడ్‌ మీద ఇంగ్లీషు అక్షరాలు టైప్‌ చేస్తూ నేర్చుకున్నాను’ అంటారు శ్రీలక్ష్మి. ఇంకా స్కూల్‌లో కూడా చేరకముందే మైక్రోసాఫ్ట్‌ పెయింట్‌లో బొమ్మలు వేయడం ప్రారంభించారు శ్రీలక్ష్మి. ‘కంప్యూటర్‌ నా ప్రాణ స్నేహితురాలు.

నా ఆరు సంవత్సరాల వయసులో ఒక చిన్న కుర్రవాడు తయారు చేసిన వెబ్‌సైట్‌ని నాన్న నాకు చూపిస్తూ, నాకు ఇష్టమైతే నన్ను కూడా చేయమని చెప్పారు. అప్పుడు నేను ఎంఎస్‌ వర్డ్‌ ఉపయోగిస్తూ ప్రయత్నించాను, ఆ తరవాత ఎంఎస్‌ ఫ్రంట్‌ పేజీలో ప్రయత్నించాను. అలా నా మొదటి వెబ్‌సైట్‌ని డిజైన్‌ చేసుకున్నాను. అది కూడా మా స్కూల్‌ కోసం www.presentationshss.com పేరున తయారు చేశాను. అప్పుడు నా వయసు ఎనిమిది సంవత్సరాలు. ఇప్పుడు నేను వెబ్‌సైట్స్‌ని డ్రీమ్‌వీవర్‌ ఉపయోగిస్తూ డెవలప్‌ చేస్తున్నాను’ అని ఎంతో ఆనందంగా చెబుతారు శ్రీలక్ష్మి.

టైనీలోగో (tinylogo) అనే సెర్స్‌ ఇంజిన్‌ కూడా తయారు చేశారు శ్రీలక్ష్మి. తనకు లోగోలను సేకరించటమంటే ఇష్టమని, అందుకోసమే ఈ సైట్‌ ప్రారంభించానని చెబుతారు. అయితే ఇతరుల అనుమతి లేకుండా వారి లోగోలను తీసుకోవటం నేరమని నాన్న చెప్పారు. అందువల్ల వారి దగ్గర నుంచి చట్టబద్ధంగా లోగోలను సేకరిస్తున్నట్లు చెబుతారు శ్రీలక్ష్మి. ఆ సమయంలోనే శ్రీలక్ష్మి ‘సైనల్‌ రైన్‌బో’ టెక్నాలజీతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన అబిదీన్‌ (సైబ్రోసిస్‌ టెక్నో సొల్యూషన్స్‌) ని కలిసి, లోగోల ఆధారంగా వాటికి సంబంధించిన అంశాలను సెర్చ్‌ చేయటం గురించి చర్చించారు. ఆ విధంగా లోగో ఆధారంగా సమాచారాన్ని సేకరించేలా వారితో కలిసి సెర్చ్‌ ఇంజిన్‌ తయారుచేశారు.

‘‘నా మొదటి వెబ్‌సైట్‌ తయారు చేసుకున్నప్పుడు నేను ఎవరో ఎవరికీ తెలియదు. అందువల్ల నాకు అస్సలు టెన్షన్‌ లేదు. ఇప్పుడు మాత్రం నాకు చాలా టెన్షన్‌గా ఉంటోంది. అందరూ మెచ్చుకునేలా చేయాలనే సంకల్పంతో, ఇప్పుడు ఎక్కువ సమయం వెబ్‌ డిజైనింగ్‌ గురించి బాగా చదువుతున్నాను. ఇంకా పిహెచ్‌పి, ఏఎస్‌పి... లాంగ్వేజెస్‌ కూడా నేర్చుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులంతా మెచ్చుకునేలా కష్టపడుతున్నాను’ అంటూ సంతోషంగా అంటారు శ్రీలక్ష్మిసురేశ్‌.

ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగటం వల్ల శ్రీలక్ష్మికి మంచి గుర్తింపు వచ్చింది. చాలామంది నిపుణులతో చర్చించటానికి అవకాశాలు వస్తున్నాయి. ‘‘విదేశీ మార్కెట్‌ మీద ఆధారపడిన వారి పరిస్థితులు బాలేవు. నేను విదేశీ కంపెనీలకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయట్లేదు. చిన్నవి మాత్రమే చేస్తున్నాను. వెబ్‌సైట్ల అవసరం రోజురోజుకీ బాగా పెరుగుతోంది. వ్యక్తిగతంగా కూడా వెబ్‌సైట్లు పెట్టుకుంటున్నారు. నేను ఎక్కువ ఆర్డర్లు తీసుకుని, చక్కగా చేసి ఇస్తున్నాను. అందువల్ల నా కంపెనీ భవిష్యత్తు గురించి నేను బాధపడనక్కర్లేదు’’ అంటారు ఎంతో ధీమాగా శ్రీలక్ష్మి.

ప్రస్తుతం www.stateofkerala.in వెబ్‌సైట్‌లో కేరళ గురించి సమాచారాన్ని పొందుపరచి, ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించేలా రూపొందిస్తున్నాను’’ అంటున్న శ్రీలక్ష్మి చదువుతో పాటు ఈ పనులన్నీ ఎంతో ప్రణాళికతో చేస్తున్నారు. తనకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలనుందని, అదేవిధంగా అందరికీ చాలా సౌకర్యంగా ఉండే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందించాలని ఉంది. పిల్లలు కూడా పెద్దవాళ్లు చేసినవన్నీ చేయగలరు అంటూ ఎంతో ఉత్సాహంగా చెబుతారు. ‘కీప్‌ మూవింగ్, డోంట్‌ క్విట్‌’ అనేది శ్రీలక్ష్మి నినాదం.                    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement