
తిరువనంతపురం: కేరళలోని ఓ ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎంఈఎస్) సంస్కరణలు పేరుతో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. కోజికోడ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ తమ విద్యా సంస్థల పరిధిలో ముస్లిం విద్యార్థినుల బుర్ఖా వాడకంపై నిషేధం విధించింది. 2019-20 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఫజల్ గఫూర్ తమ విద్యాసంస్థల అధిపతులకు సర్క్యులర్ జారీచేశారు. ఇస్లాం మతాన్ని పాటించడంలో తప్పులేదని కానీ, మద్యప్రాచ్యంలోని ఇస్లాం పద్దతులను సాటించడం సరికాదని ఫజల్ గఫూర్ అభిప్రాయపడ్డారు.
విద్యార్థులతోపాటు బోధనా సిబ్బంది కూడా ఈ నిబంధనను తప్పక పాటించాల్సిందేనన్నారు. శ్రీలంకలో ఈస్టర్ సండే సందర్భంగా జరిగిన వరుస బాంబు పేలుళ్ల తర్వాత ఆ దేశ ప్రభుత్వం గత నెల 21న ముస్లిం మహిళల బురఖా వినియోగాన్ని నిషేధించిందని, కానీ తాము అంతకు ముందే నిషేధం విధించామన్నారు. ఇదిలా ఉంటే కేరళ జామియాథుల్ ఉలేమా అధ్యక్షుడు సయ్యద్ ముహమ్మద్ జిఫ్రీ ముధుక్కోయ థంగల్ మాట్లాడుతూ మత పరమైన అంశాలను ఎంఈఎస్ నిర్ణయించలేదన్నారు.
బుర్ఖాను నిషేధించాలన్న వారి ఆదేశాలను ఇస్లాంకు, షరియత్ చట్టాలకు వ్యతిరేకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈఎస్ తీసుకున్న నిర్ణయం సరి కాదన్నారు. బుర్ఖాను ధరించడం ఇస్లాం సాంప్రదాయంలో భాగమని ఆయన స్పష్టం చేశారు. ఎవరి మత సాంప్రదాయాన్ని వారు పాటించే హక్కు అందరికీ ఉందని.. నిబంధనలపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జఫ్రీ కోరారు. అయితే జఫ్రీ వ్యాఖ్యలపై స్పంధించిన ఎంఈఎస్ కేవలం కళాశాల ఆవరణంలోనే ఈ ఆదేశాలను పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో వారి ఇష్టమని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment