యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం: ప్రధాని మోదీ
కోజికోడ్: ఉడీ ఉగ్రదాడి అనంతరం తొలిసారిగా బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ పాకిస్థాప్ పై నిప్పులు చెరిగారు. 18 మంది జవాన్లను పోగొట్టుకున్న ఉడీ ఘటనను భారత్ ఎన్నటికీ మర్చిపోదని అన్నారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో భాగంగా శనివారం కేరళలోని కోజికోడ్ లో ఏర్పాటుచేసిన కార్యకర్తల సభలో ఆయన మాట్లాడారు.
'పాకిస్థాన్ ప్రజలారా.. ఇండియా గడ్డ నుంచి మీతో మాట్లాడుతున్నా.. చరిత్ర మొదలు 1947 వరకు మీ పూర్వీకులు ఇక్కడి నేలకు నమస్కరించినవారేనని గుర్తుంచుకోండి. విడిపోయిన తర్వాత మీ పాలకులు ఏ విధంగా మారిపోయారో ఒక్కసారి గమనించండి. గడిచిన కొద్ది నెలల్లో ఒక్క కశ్మీర్ లోనే 110 మంది టెర్రరిస్టులు చనిపోయారు. వీళ్లందరూ ఎవరి బిడ్డలు? ప్రస్తుతం భారత్ నుంచి అన్ని దేశాలకు ఇంజనీర్లను పంపుతున్నాం. కానీ మీ దేశం(పాకిస్థాన్) ఏం చేస్తోంది? ఉగ్రవాదులను పంపుతోంది.. ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేయాలనుకుంటోంది. పాక్ అన్నదమ్ములారా.. మీతో కలిసి యుద్ధం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. రండి.. పేదరికంపై, ఆకలిదప్పులపై యుద్ధం చేద్దాం. అప్పుడు పాకిస్థాన్, ఇండియాల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం..' అని మోదీ ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఉగ్రవాదులూ చెవులు రెక్కించి వినండి.. ఉరీ ఘటనను మేం మర్చిపోం. అని హెచ్చరికలు జారీచేశారు.
ఇంకా.. '21వ శతాబ్ధంలో అద్భుతాలు సాధించాలనే దిశగా ఆసియా దేశాలన్నీ కలలు కంటున్నాయి. ఒకేఒక్క దేశంతప్ప! ఆ దేశం(పాకిస్థాన్) వల్ల ఒక్క భారతేకాదు ఆసియా దేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొటున్నాయి. పాకిస్థాన్ ను నిందిస్తున్నాయి. ఆ దేశం తీరు ఎలా ఉంటుందో చూడండి.. ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనంలో కశ్మీర్ లోని కొంత భాగం(పీవోకే), బలూచిస్థాన్, గిల్గిట్ లు ఉన్నాయి కదా, వాటినైనా సరిగ్గా పరిపాలిస్తున్నారా? అక్కడి ప్రజల సమస్యలు తీరుస్తున్నారా? అలా చెయ్యకపోగా వాళ్ల(పాకిస్థాన్ కన్ను) మన కశ్మీర్ పై పడింది. పాకిస్థాన్ కు నేను గట్టిగా చెప్పదలుచుకున్నా.. పీవోకే, గిల్గిట్, బలూచ్ లలో ఇకపై మీ ఆటలు సాగవని హెచ్చరిస్తున్నా'అని మోదీ అన్నారు.