చెన్నై: ‘‘నాకు హిందీ మాట్లాడటం వచ్చా? రాదా? అన్నది కాదు ఇక్కడ సమస్య. హిందీ వస్తేనే నన్ను భారతీయురాలిగా గుర్తిస్తాననడం సిగ్గుచేటు’’ అంటూ డీఎంకే నేత, లోక్‌సభ ఎంపీ కనిమొళి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హిందీ అనువాదకురాలిగా పనిచేశారంటూ తన గురించి వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత హెచ్ రాజా తీరుపై మండిపడ్డారు. హిందీ భాషకు జాతీయతకు ముడిపెట్టడం సరికాదంటూ హితవు పలికారు. కాగా కేరళలోని కోళీకోడ్ ఎయిర్‌పోర్టు వద్ద ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో అక్కడికి వెళ్లిన కనిమొళికి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ మహిళా జవాను ‘మీరు భారతీయులేనా?’అని తనను ప్రశ్నించినట్లు ఈ తూతుక్కుడి ఎంపీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. హిందీ భాష వ్యతిరేకోద్యమానికి నిలయమైన తమిళనాడులో ఈ విషయంపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. రాజకీయ దుమారం రేగింది.(ఎన్‌ఈపీ 2020: తమిళనాడు కీలక నిర్ణయం)
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత పి. చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంతో పాటు పలువురు తమిళనేతలు సీఎస్‌ఐఎఫ్ తీరును ఖండిస్తూ ఆమెకు మద్దతు తెలిపారు. అయితే తమిళనాడు బీజేపీ నేత హెచ్ రాజా మాత్రం కనిమొళి ట్వీట్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘భారత ఉప ప్రధాని దేవీలాల్ తమిళనాడుకు వచ్చినపుడు ఆయన హిందీ ప్రసంగాన్ని కనిమొళి తమిళంలోకి అనువదించారు. కాబట్టి తనకు హిందీ తెలియదని చెప్పడం పచ్చి అబద్ధం అని తేలింది. ఎన్నికలు ఇంకా సమీపించలేదు కదా’’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (కేరళలో కనిమొళికి చేదు అనుభవం)
ఇందుకు ఆమె సైతం అదే స్థాయిలో ఘాటుగా బదులిచ్చారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ నేనెవరికీ హిందీ అనువాదకురాలిగా పనిచేయలేదు. తెలియని భాషలో నేనెలా మాట్లాడగలను? నా విద్యాభ్యాసం అంతా తమిళ, ఆంగ్ల భాషల్లోనే సాగింది. ఢిల్లీలో ఉన్నా నాకు హిందీ రాదు. ఈ విషయం చాలా మంది రాజకీయ నాయకులకు కూడా తెలుసు. అయినా ఇక్కడ సమస్య భాష గురించి కాదు. భాషను జాతీయతతో ముడిపెట్టడం గురించి. ఒకే భాష, ఒకే మతం, ఒకే సిద్ధాంతం పాటిస్తేనే భారతీయులా. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. కొందరు ఈ విషయం గురించి రాజకీయం చేయడం సిగ్గుమాలిన చర్య’’ అంటూ కనిమొళి కౌంటర్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment