
పాలివ్వొద్దంటూ భార్యను అడ్డుకున్న భర్తపై చర్యలు
అప్పుడే పుట్టిన బిడ్డకు పాలివ్వొద్దంటూ భార్యను అడ్డుకున్న ఓ వ్యక్తిపై కోజీకోడ్ జిల్లా కలెక్టర్ చర్యలకు ఆదేశించారు.
కోజీకోడ్: అప్పుడే పుట్టిన బిడ్డకు పాలివ్వొద్దంటూ భార్యను అడ్డుకున్న ఓ వ్యక్తిపై కోజీకోడ్ జిల్లా కలెక్టర్ చర్యలకు ఆదేశించారు. 'ఏ మతం కూడా పుట్టిన బిడ్డను ఆకలితో ఉంచమని చెప్పదు.. ఈ చర్యకు పాల్పడిన, అందుకు ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే' అంటూ కలెక్టర్ ప్రశాంత్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కోజికోడ్ జిల్లా ముక్కమ్ లోని ఓ ఆసుపత్రిలో అబూబాకర్ సిద్ధిక్ అనే వ్యక్తి భార్య బుధవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన వెంటనే పాలు పట్టమని ఆసుపత్రి సిబ్బంది తల్లికి సూచించారు. అయితే.. బిడ్డకు పాలివ్వడానికి వీలు లేదంటూ అబూబాకర్ భార్యను అడ్డుకున్నాడు. పుట్టిన బిడ్డ ప్రార్థనలు వినేంతవరకు పాలుపట్టడానికి వీలు లేదంటూ అడ్డుకున్నాడు.
ఈ విషయంలో ఆసుపత్రి సిబ్బంది అబూబాకర్‌కు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా అతడు మాత్రం తన పట్టు వీడలేదు. తనకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు సైతం ఇలాగే చేశానని.. అతడు ఆరోగ్యంగానే ఉన్నాడంటూ వాదించాడు. అంతేకాదు.. బిడ్డకు ఏదైనా జరిగితే ఆసుపత్రి వారికి ఎలాంటి సంబంధం లేదు అంటూ పేపర్‌పై సంతకం కూడా చేశాడు. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం మధ్యాహ్నం తరువాతే బిడ్డకు పాలుపట్టారు.
ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్థానిక సోషల్ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారులు శుక్రవారం అబూబాకర్, ఆయన భార్యను విచారించారు. అయితే.. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రానందున కేసు నమోదు చేయలేదని స్థానిక పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై అబూబకర్ నుంచి వివరణ కోరామని తెలిపారు.