ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న ఓ పేజీ...! | This Collector Has 1 Lakh Followers on Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న ఓ పేజీ...!

Published Tue, Sep 22 2015 5:41 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న ఓ పేజీ...! - Sakshi

ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న ఓ పేజీ...!

ఇటీవల స్వ ప్రయోజనాలకోసం  సామాజిక మాధ్యమాలను వినియోగించుకొంటున్నవారిని ఎందరినో చూస్తున్నాం. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, రచయితలు ఇలా ప్రతివారూ తమను తాము పరిచయం చేసుకొనేందుకు , తాము చేసే పనులను ప్రచారం చేసుకొనేందుకు సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటుంటారు. అయితే ఆ ప్రభుత్వాధికారి మాత్రం ప్రజా సేవే ధ్యేయంగా పనిచేయడం కోసం ఫేస్ బుక్ ను ఆయుధంగా చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ గా పనిచేస్తూ జిల్లా ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉండి, వారి సమస్యలను తీరుస్తూ లక్షకు పైగా ఫాలోయర్స్ తో ఆ పేజీకే సార్థకత చేకూరుస్తున్నారు.

ఫేస్ బుక్ లో 'కలెక్టర్ కోజికోడ్' పేరున కొనసాగుతున్న ఆ పేజీకి అతడొక్కడే నాయకుడు. కేరళలోని కోజికోడ్ జిల్లా కలెక్టర్... ప్రశాంత్ నాయర్ వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న ఈ పేజీ జిల్లా పరిపాలనకు నేతృత్వం వహిస్తూ... స్థానిక ప్రజల ప్రశంసలనందుకుంటోంది. వివిధ స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు నాయర్ ఈ సోషల్ మీడియాను ప్రచార సాధనంగా వినియోగిస్తున్నారు. కలెక్టర్ కోజికోడ్ పేరున కొనసాగుతున్న ఈ పేజీలో వచ్చే ప్రతి వ్యాఖ్యకు ప్రభుత్వాధికారులు సమాధానం ఇవ్వడం మొత్తం సోషల్ మీడియాలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రతిరోజూ ప్రజా సమస్యలపై చర్చిస్తూ, వారికివ్వాల్సిన సూచనలిస్తూ.. మంచి ప్రచార సాధనంగా ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారు.  సోషల్ మీడియాలో నాయర్ ఉనికిని రాజకీయ నాయకులు ఎన్నోసార్లు విమర్శించినా అతడు వెనుకంజ వేయలేదు. అంతేకాదు సాధ్యమైనంతమందికి అందుబాటులో ఉండాలంటూ నిర్వాహకులకు నాయర్ సూచించడం విశేషం.

ఫేస్ బుక్ పేజీ... జిల్లా ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రశాంత్ నాయర్ కు ఎంతగానో సహకరిస్తోంది. స్థానికులు తమ సమస్యలను నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడుతోంది. అంతేకాక వచ్చిన ప్రతి కామెంట్, ఫిర్యాదులు, సలహాలకు ప్రశాంత్ వెంటనే స్పందింస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో ఆకలి సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ప్రారంభించిన  ఆపరేషన్ సలైమణి... కోజికోడ్ పేజీలో ఎంతో గుర్తింపు కూడ పొందింది. ఈ ప్రాజెక్టు ద్వారా పలు కారణాలతో భోజనానికి డబ్బు వెచ్చించలేని ప్రజలకు  సలైమణి కూపన్లను అందించి వారి ఆకలి తీరుస్తుంటారు. పట్టణాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, రెస్టారెంట్లు, దుకాణాల వద్ద విద్యార్థి వాలంటీర్లు ఈ కూపన్లను పంపిణీ చేస్తుంటారు. కూపన్ తో ఆ ప్రాతంలో ఆహారం విక్రయించే వారివద్ద ఉచితంగా భోజనం పొందవచ్చు. సదరు భోజనశాల, హోటల్ నిర్వాహకులకు సలైమణి క్యాంపెయిన్ నిర్వహించే సంస్థ డబ్బు చెల్లిస్తుంది. దీనికితోడు స్థానిక మానసిక ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు, రోడ్లపై గుంతలు పూడ్చేందుకు ఆన్ లైన్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాక బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జనకు వ్యతరేకంగా.. ఛాయాచిత్రాలను పంపించే త్రిమూర్తి ఫొటో పోటీని కూడ  ఆన్ లైన్ లో ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు.   

ప్రజలు దేన్ని ఇష్టపడుతున్నారో... ఎక్కడ అందుబాటులో ఉంటారో ప్రభుత్వాధికారులు అక్కడ ఉండాలి అన్నది ప్రశాంత్ నాయర్ నమ్మిన సిద్ధాంతం. అందుకే ఆయన సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారు. ఒకప్పటిలా కార్యాలయాల్లో బోర్డులకు నోటీసులు అంటించడం ప్రస్తుతం పనికి రాదని ప్రజల్లోకి పారదర్శకంగా పాలన వెళ్ళాలంటే సోషల్ మీడియా ప్రస్తుత పరిస్థితుల్లో మంచి మార్గం అని ప్రశాంత్ సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement