సాక్షి, కదిరి: ఒకప్పడు స్కూల్‌కు వెళ్లె పిల్లలకు తినుబండారాలంటే వేరుశనగ కాయలు, బెల్లం, బర్ఫీ, బొరుగు ఉంటలు,పాకంపప్పు ఇలాంటివి ఇచ్చేవారు. ఇప్పుడు పిల్లలకు ఇంట్లో తయారు చేసే తినుబండారాలు ఇవ్వడం దాదాపుగా మానేశారు. బిజీ జీవితంలో ఇళ్లలో వాటిని తయారు చేయడం కూడా మానేశారు. బడి ముందు అమ్మే నాసిరకం తినుబండారాలే తమ పిల్లలకు కొనిస్తున్నారు. పిల్లలు కూడా వాటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వాటితో వచ్చే ప్రమాదాలు చాలానే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఒకట్రెండు బ్రాండ్ కంపెనీలకు సంబంధించిన తినుబండారాలు మినహాయిస్తే చాలా వరకూ అనారోగ్యం కల్గించేవేనని వారంటున్నారు. ఆ ప్యాకెట్‌లో ఉండే బొమ్మలు, వాటి ప్యాకింగ్‌కు ఆకర్షితులై పిల్లలు కూడా వాటినే ఎక్కువగా ఇష్టపడతారని డాక్టర్లు చెబుతున్నారు. ఒక్కోసారి వాటితో ప్రాణపాయం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు వాటికి పిల్లలనూ దూరంగా ఉంచడమే మంచిదని వారు సూచిస్తున్నారు.
రోజూ రూ. 4 లక్షల వ్యాపారం: కదిరి నియోజక వర్గంలోని కదిరి పట్టణంతో పాటు మిగిలిన ఆరు మండలాల్లో చిన్నారులు కొనుక్కునే చిరుతిండి ప్యాకెట్ల వ్యాపారం ప్రతి రోజూ రూ. 4 లక్షలు దాకా ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. వీటిని స్థానికంగా తయారు చేయకపోయినా బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల నుంచి తెప్పిస్తున్నారు. వీటికి తోడు కదిరి పట్టణంలో ప్రతి వీధిలో ఒకట్రెండు ఇళ్లల్లో కలుషిత నీటితో రంగులు కలిపిన ఐస్‌లు తయారు చేస్తున్నారు. వీటి వలన పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని వైద్యులు తెలిపారు. అయితే వీటి అమ్మకాలు, తయారీలపై ఏనాడూ సంబంధిత అధికారులు దృష్టి సారించలేదు.
Comments
Please login to add a commentAdd a comment