అక్షర లక్షలు | Sakshi Editorial On Shehan Thilakarathna from Sri Lanka | Sakshi
Sakshi News home page

అక్షర లక్షలు

Published Sun, Oct 30 2022 11:56 PM | Last Updated on Mon, Oct 31 2022 5:57 AM

Sakshi Editorial On Shehan Thilakarathna from Sri Lanka

దక్షిణాసియా సాహిత్యపు ప్రతిష్ఠను పెంచుతూ ఈ ఏటి బుకర్‌ పురస్కారాన్ని శ్రీలంకకు చెందిన సెహన్  తిలకరత్న గెలుచుకున్నారు. మరణానంతర థ్రిల్లర్‌ ‘ద సెవన్  మూన్స్ ఆఫ్‌ మాలీ అల్మీదా’ ఆయనకు ఈ పురస్కారం తెచ్చిపెట్టింది. ఉన్నట్టుండి ఒకరోజు చావు నుంచి మేల్కొన్న ఫొటోగ్రాఫర్‌ మాలీ అల్మీదా తను దాచిన ఛాయాచిత్రాలను సరైన మనిషి చేతుల్లో పెట్టడానికి చేసే ప్రయత్నం ఈ నవల. దానికిగానూ అతడికి ఉన్న కాలం కేవలం ఏడు చంద్రులు. ఈ ప్రయాణంలో భాగంగా 1980–90ల నాటి శ్రీలంక సంక్షుభిత కాలాన్ని, అంతర్యుద్ధం వల్ల జరిగిన మానవ నష్టాన్ని నవల చిత్రిస్తుంది.

ఇంత కల్లోలంలోనూ ప్రతి మానవ జీవితమూ విలువైనదేనన్న ఒక ఆదర్శం కోసం అన్వేషించడం బుకర్‌ న్యాయనిర్ణేతలను కదిలించింది; షార్ట్‌లిస్టులో ఉన్న ఆరుగురు రచయితల్లోంచి కరుణతిలక వైపు మొగ్గేలా చేసింది. ఒక శ్రీలంక రచయిత ఈ బహుమతిని పొందడం ఇది రెండోసారి. మొదటి రచయిత కెనడాలో స్థిరపడిన మైకేల్‌ ఆండాట్జీ. 1992లో ‘ది ఇంగ్లిష్‌ పేషెంట్‌’ నవలకుగానూ ఆయన ఈ గౌరవం పొందారు.

అక్టోబర్‌ నెలంతా సాహితీ మాసంగా గడిచిపోయింది. ఈ నెలలోనే అంతా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం ఫ్రెంచ్‌ రచయిత్రి ఆనీ ఎర్నౌను వరించింది. ఆంగ్లంలో రాసిన, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ లేదా ఐర్లాండ్‌లో ప్రచురించిన పుస్తకాలు మాత్రమే అర్హమయ్యే బుకర్‌ ప్రై జ్‌ ‘పరిధి’ పరిమితమైనది అయినప్పటికీ, దీని కోసం కూడా సాహిత్య లోకం ఆసక్తిగా చూసింది.

ఆంగ్ల భాషా వ్యాప్తి పెరుగుతూండటమూ, ఇతర భాషల సాహిత్యాలు కుంచించుకుపోతుండటమూ, ఇతర భాషీయులు కూడా ఆంగ్లాన్ని తమ మాతృభాషలాగే స్వీకరించి సాహిత్యపరమైన ఆలోచనను కూడా ఆ భాషలోనే చేస్తూండటమూ, ఆంగ్ల సాహిత్యం నిత్యనూతనంగా ఉంటుండటమూ, ఇలా చాలా కారణాల వల్ల బుకర్‌ ప్రైజ్‌ అచ్చమైన అంతర్జాతీయ అవార్డు స్థాయిని పొందింది. ఈ పురస్కార విజేతకు 50 వేల పౌండ్ల నగదు లభిస్తుంది. బ్రిటిష్‌ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, దీని విలువ సుమారు 47 లక్షల రూపాయలు!

బుకర్‌ ప్రైజ్‌ పేరుతో ఇస్తున్నప్పటికీ 1969–2001 వరకు మాత్రమే బ్రిటిష్‌ ఫుడ్‌ హోల్‌సేల్‌ ఆపరేటర్‌ అయిన ‘బుకర్‌ గ్రూప్‌ లిమిటెడ్‌’ ఈ అవార్డుకు నిధులు సమకూర్చింది. అది తప్పుకొన్న తర్వాత, 2002–19 వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ‘మ్యాన్  గ్రూప్‌’ ఇచ్చినందున మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌ అని వ్యవహరించారు. 2019 నుంచి వెల్‌‡్ష శ్రీమంతుడు మైకేల్‌ మోరిట్జ్‌ ఛారిటీ సంస్థ ‘క్రాంక్‌స్టార్ట్‌’ దీనికి నిధులు ఇస్తోంది. దాతలు మారుతున్నప్పటికీ, ‘అత్యధిక పారితోషికం గల సాహిత్య పురస్కారాల్లో ఇదీ ఒక’టన్న ప్రతిష్ఠకు మాత్రం లోటురావడం లేదు. తమాషా ఏమిటంటే, దీన్ని తలదన్నే మొత్తాన్ని ఇస్తున్న పురస్కారాలు కూడా ఉన్నాయి.

యూఏఈకి చెందిన ‘మిలియన్స్ పొయెట్‌’ పోటీకి 50 లక్షల ధీరమ్స్‌ (సుమారు 11 కోట్ల రూపాయలు) ఇస్తున్నారు. అరబిక్‌ దేశాల్లోని అత్యుత్తమ కవులను వెతికే ఈ రియాలిటీ టెలివిజన్  కవితల పోటీ ప్రసారమైనప్పుడు, టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఫుట్‌బాల్‌నే వెనక్కి నెట్టేస్తుంది. నగదును టాప్‌–5 కవులకు పంచుతారు. ఇక స్పెయిన్ లో ఇచ్చే ‘ప్రీమియో ప్లానెటా దె నావెలా’ ప్రైజ్‌మనీ పది లక్షల యూరోలు. అంటే సుమారు 8 కోట్ల రూపాయలు. ప్రపంచంలో ఆర్థిక పరంగా ప్రస్తుతం ఇదే అత్యంత ఘనత వహించిన అవార్డు. 1952లోనే ఇది మొదలైంది.

పుస్తకాల ప్రచురణ కర్త ‘గ్రూపో ప్లానెటా’ దీన్ని బహూకరిస్తుండటం గమనార్హం. ఇక ‘ఆస్ట్రిడ్‌ లిండ్‌గ్రెన్  మెమోరియల్‌ అవార్డు’ పేరుతో స్వీడన్ లో ఇచ్చే పురస్కార విలువ 50 లక్షల స్వీడిష్‌ క్రోనాలు(సుమారు 37 లక్షల రూపాయలు). గుర్తుంచుకోవాల్సింది స్వీడన్  జనాభా అక్షరాలా ఒక కోటి నలభై లక్షలు మాత్రమే. ఇక అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ విజేతకు ఒక కోటి స్వీడిష్‌ క్రోనార్ల నగదు (సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు)తోపాటు 18 క్యారెట్ల బంగారు పతకం బహూకరిస్తారు.

మళ్లీ బుకర్‌ వద్దకే వస్తే– ఆంగ్లంలోకి అనువాదమైన ఇతర భాషా పుస్తకాల కోసం ప్రత్యేక విభాగంగా నెలకొల్పిన ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ పురస్కార నగదు కూడా 50,000 పౌండ్లు. దీన్ని రచయిత, అనువాదకులకు సమంగా పంచుతారు. పోయినేడాది హిందీ నవలా రచయిత్రి గీతాంజలి శ్రీ, అనువాదకురాలు డైసీ రాక్‌వెల్‌తో పాటు గెలుచుకున్నది ఇదే.

ఇంతేసి పారితోషికాలు, ఒక పుస్తకం కోసం సాహిత్య లోకం ఎదురుచూడటాలు తెలుగు నేలకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంగా కనిపించడం లేదూ! ఉమ్మడిగా రెండు రాష్ట్రాల జనాభా సుమారు తొమ్మిది కోట్లు. అయినా ఒక రచయిత తన సొంత ఖర్చుతో వేసుకునే వెయ్యి కాపీలు అమ్మడం కూడా దుర్భరం. ఇలాంటి వాతావరణానికి కారణాలు ఏమిటి? పఠనాన్ని తగ్గించాయని చెప్పే అన్ని కారణాలూ అన్ని దేశాలకూ వర్తిస్తాయి కదా. మరెక్కడుంది లోపం? మన సంస్కృతిలో. ‘చదవడం’ అంటే మనకు అర్థం వేరే. ‘ఒక దేశం తన కథకులను కోల్పోయిందంటే, తన బాల్యాన్ని కోల్పోయినట్టే’ అన్నాడు పీటర్‌ హాండ్కే.

మన జీవితమంతా మన చిన్నతనంలోనే ఉండిపోయిందని పెద్దయినకొద్దీ అర్థమవుతూ వస్తుంది. డబ్బులు మాత్రమే సర్వస్వమా అంటే– అది మన సారస్వత నిర్మాతలను మనం ఎలా గౌరవించుకుంటున్నాం అన్నది తెలియజేస్తుంది. బాక్సాఫీస్‌ కలెక్షన్లలో వెయ్యి కోట్లు దాటే సినిమాలు తీస్తున్న తెలుగు నేల మీద, ఒక తెలుగు రచయితకు కోటి రూపాయల బహుమతి ఇచ్చే ఊహయినా చేయగలమా? 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement