సాంస్కృతిక సమ్మేళనం.. ప్రగతికి కీలకం | Cultural compound is crucial to Telangana progress | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక సమ్మేళనం.. ప్రగతికి కీలకం

Published Sat, Jan 26 2019 3:29 AM | Last Updated on Sat, Jan 26 2019 3:29 AM

Cultural compound is crucial to Telangana progress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అద్భుతమైన సాంస్కృతిక సమ్మేళనం తెలంగాణ ప్రగతికి కీలకమని, అభ్యుదయ రాష్ట్రంలో సాహితీ వేడుకలు ఓ భాగంగా మారాయని రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. వివిధ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి తరలివచ్చిన సాహితీవేత్తలు, రచయితలు. మేధావులు హైదరాబాద్‌ వేదికగా అనేక అంశాలపైన మాట్లాడుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చర్చలు రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయన్నారు. హైదరాబాద్‌ సాహిత్యుత్సవం తొమ్మిదో ఎడిషన్‌ వేడుకలు శుక్రవారం బేగంపేట్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్‌లో కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి.

వందలాది మంది సాహితీప్రియులు, కవులు, రచయితలు, చిత్రకారులు, వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో ఇలాంటి వేడుకలు ఒక భాగమన్నారు. మరోవైపు శాంతిభద్రతలను కాపాడటంలో రాష్ట్ర పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారని చెప్పారు. ఐదు లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఎక్కడ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా క్షణాల్లో పోలీసులు అక్కడికి చేరుకొనేవిధంగా భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేశామని చెప్పారు.

పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, వివిధ భాషల సాహిత్యంపైన ఇలాంటి సదస్సులు నిర్వహించడం సంతోషకరమన్నారు. తాను నేర్చుకుంటున్న చైనీష్‌లోనూ, గుజరాతీ భాషలో కొద్దిసేపు మాట్లాడి ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. హెచ్‌ఎల్‌ఎఫ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్, అజయ్‌గాంధీ, కిన్నెరమూర్తి, తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం వివిధ అంశాలపైన సదస్సులు జరిగాయి.

భారత్, చైనా బంధం బలోపేతమవ్వాలి
భారత్, చైనా మధ్య సాంస్కృతిక, సాహిత్య సంబంధాలు కొనసాగాలని చైనా రచయిత ఎ.లాయ్‌ అన్నారు. ‘సమకాలీన చైనీస్‌ సాహిత్య ధోరణులు’ అంశంపై జరిగిన ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేవలం హిమాలయ పర్వతాలు మాత్రమే విడదీసే రెండు గొప్ప పొరుగు దేశాల మధ్య ఉండాల్సినంత సాహిత్య బంధం లేదనీ, రామాయణం, కొన్ని టాగూర్‌ పద్యాలు, భారతీయ నవలలు, పాత సినిమాల జ్ఞానంతో తాను ఇక్కడికి వచ్చాననీ తెలిపారు.

సంస్కృతం నుంచి అనువాదమైన ఎన్నో బౌద్ధ రచనలు చదివిన జ్ఞానం భారతీయ స్నేహితులతో సంభాషించడానికి సరిపోతుందని చమత్కరించారు. చైనా ప్రభుత్వం రచయితలను నియంత్రించడం లేదనీ, స్వేచ్ఛగా రాయగలుగుతున్నామనీ చెప్పారు. నాజూకుదనం గురించి జరుగుతున్న విపరీత ప్రచారం, చైనా స్త్రీల జీవితంలో తెస్తున్న మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు నవలా రచయిత్రి జి షుయిపింగ్‌ చైనా రచయితలు గ్వాన్‌ రెన్షామ్, రంగ్‌ రంగ్, బెయ్‌ తా పాల్గొన్నారు.

గుజరాతీ సాహిత్యంపై గాంధీ ముద్ర
గుజరాతీ సాహిత్యం మహాత్మా గాంధీజీపైన ఎంతో ప్రభావం చూపిందని, అలానే ఆయన ప్రభావంతో అది మరింత సుసంపన్నమైందని ప్రముఖ గుజరాతీ రచయిత సితాన్షుయశస్‌చంద్ర అన్నారు. ‘గాంధీకి ముందు, గాంధీతోపాటు, గాంధీ తరువాత గుజరాతీ సాహిత్యం’అన్న అంశంపైన ఆయన మాట్లాడారు. గుజరాతీ సాహిత్యంలో నర్సిమెహతాను ప్రాచీన కవిగా పరిగణిస్తారని, అప్పటి సమాజాన్ని ఉన్నదున్నట్లుగా మాత్రమే ఆయన తన సాహిత్యంలో ప్రస్తావించారని చెప్పారు. భారతీయ సాహిత్యాన్ని దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో పరిచయం చేసిన ఘనత గాంధీకే దక్కుతుందన్నారు. అనంతరం ‘గాంధీ సమకాలీనత’అనే అంశంపై జరిగిన మరో చర్చలో డాక్టర్‌ శంభూప్రసాద్, సుధీర్‌చంద్ర తదితరులు మాట్లాడారు. జాతీయోద్యమ నిర్మాణంలో, గ్రామస్వరాజ్యంలో ఆయన ప్రతిపాదించిన వ్యూహాలు, ఎత్తుగడలు ఎప్పటికైనా ఆచరణయోగ్యమైనవేనన్నారు.

నోట్ల రద్దు ఒక న్యూక్లియర్‌ బాంబ్‌
అవినీతి నిర్మూలన, నల్లధనం వెలికితీత లక్ష్యంగా రాత్రికి రాత్రి ఒక న్యూక్లియర్‌ బాం బులా పేల్చిన పెద్ద నోట్ల రద్దు ఆ లక్ష్యాన్ని ఏ మాత్రం నెరవేర్చలేదని ప్రజలు అనేక రకాల బాధలను, ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వచ్చిందని ప్రముఖ ఆర్థికవేత్త రామ్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇది పూర్తిగా తప్పుడు చర్య అని పేర్కొన్నారు. ఆర్‌బీఐ సైతం నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్పిందన్నారు. నగదు వల్ల అవినీతి ఉండదని, కేవలం హవాలా వల్లనే అవినీతి జరుగుతుందన్నారు.

విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీల ఉదంతాలే అం దుకు నిదర్శనమన్నారు. మరోవైపు ‘మీ టూ’ పైన జరిగిన చర్చలో చిన్మయి, సంధ్యామీనన్, సుతాపపాల్‌లు మాట్లాడారు. వైరి ముత్తు వేధింపుల అంశాన్ని బయటపెట్టిన తరువాత తనపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున దాడి జరిగిందని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. మగవారిపై వచ్చే ఫిర్యాదులను సమాజం వెం టనే మరిచిపోతుందని, చాలా విషయాల్లో మహిళలనే ఎత్తుచూపడం వ్యవస్థీకృతమైన లోపమని సంధ్యామీనన్‌ అన్నారు. వేడుకలలో ఏర్పాటు చేసిన చైనా, గుజరాతీ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

మిషన్‌ కాకతీయ లక్ష్యం నెరవేరలేదు
మిషన్‌ కాకతీయ చేపట్టినప్పుడు తెలంగాణ నీరున్న రాష్ట్రంగా మారుతుందని ఆశించానని, కానీ ఈ పథకం కాంట్రాక్టర్‌ల చేతుల్లోకి వెళ్లడం వల్ల అవినీతిమయమైందని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ అన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మిషన్‌ కాంట్రాక్టర్ల చేతికి వెళ్లకముందు దేశంలోకెల్లా అద్భుతమైన ప్రాజెక్టుగా భావించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికయినా కాంట్రాక్టర్లను పక్కన పెట్టి కమ్యూనిటీకి ఆ పనులు అప్పగిస్తే పథకం లక్ష్యం నెరవేరుతుందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement