కొల్లేటి కథ | Kolleti tourism | Sakshi
Sakshi News home page

కొల్లేటి కథ

Published Fri, Feb 20 2015 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

కొల్లేటి కథ

కొల్లేటి కథ

పర్యటన
 
ఫిబ్రవరి 14, 15 తేదీల్లో కథారచయితల కొల్లేటి పర్యాటన రచనా జగత్తులోని అంతర్లోకాల కంటే బాహ్యంగా జరుగుతున్న విధ్వంసాన్నే ఎక్కువ దర్శింప చేసింది.
 
‘అసలే పదమూడో తేదీ... ఆపై ఎస్13... ఏదో భయంగా ఉంది మిత్రమా’... అన్న్టాడొక కవిమిత్రుడు నవ్వుతూ ఒక సృజనకారుడికి మాత్రమే ఉండే అతి ఊహా భయ అపోహతో. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎస్13లో అందరం ప్రయాణం.  కొల్లేరుకి.  తేదీ అదే అయ్యింది.  బోగీ అదే అయ్యింది. అందుకే ఈ భయం.

పదమూడు సంఖ్య కొందరి దృష్టిలో దుశ్శకునం కావచ్చు. కాని అంతకంటే పెద్ద దుశ్శకునాన్ని చూడబోతున్నామని మాకు తెలీదు. పర్యావరణానికి దుశ్శకునం. ప్రకృతికి దుశ్శకునం. ప్రపంచంలో అరుదైన చిత్తడి నేలలకు దుశ్శకునం. కొల్లేరు దురాక్రమణ!
 ప్రోగ్రామ్ ఏమిటంటే ఉదయాన్నే లాంచీ ఎక్కి సాయంత్రం వరకు కొల్లేరులో తిరగాలని. పక్షులను చూడాలని. రక్కసి పొదల చాటున అందంగా ఉండే లంక గ్రామాల సౌందర్యాన్ని తిలకించాలని. ఏం... జాలరి వలలూ... తాటి దోనెలూ... పట్టిన తర్వాత రేకు డ్రమ్ముల్లో చిక్కి ఎగిరి నీళ్లల్లోకి దూకాలని పెనుగులాడుతున్న కొర్రమీనులూ గొరకలూ... వేలెడంత ఉండి తప్పించుకోవడానికి వీలు లేక నాలుగు గుర్రపు డెక్కల్ని మూతగా కూరితే లోన ఉక్కిరిబిక్కిరిగా సందడి చేస్తున్న చేదిబరిగెలూ...

 కొల్లేరుకు ఆనుకుని నిడమర్రు సమీపాన ‘పెదనిండ్రకొలను’ గ్రామంలో ఉంటున్న రచయిత కుమార్ కూనపరాజు కూడా ఇలాగే అనుకున్నారు. చాలాకాలం న్యూయార్క్, హైదరాబాద్‌లలో ఉండి ఇటీవల సొంతూళ్లో స్థిరపడిన కుమార్ కొల్లేరును చూసి చాలా రోజులవుతోంది. బాగానే ఉంటుంది కదా అనుకున్నారట. ఆ మొత్తం కార్యక్రమానికి హోస్ట్ ఆయనే. భీమవరంలో బేస్ క్యాంప్. అక్కడి నుంచి ఆకివీడుకి. కాస్త లోనకు దారి చేసుకుంటే కొల్లేరు ఒడ్డు. పది ఇరవై అడుగుల ఎత్తున మొలచిన దుబ్బును ఒరుసుకుంటూ మూడు నాలుగు చిన్నపడవలూ... ఒక లాంచీ... ఎన్నాళ్ల కోరికో చూడాలని.

ఎక్కాం.

ఎ... కాకు దీర్ఘం.. వత్తు... సున్నా... పదం పూర్తయ్యే లోపలే దిగాం.
 అంతే కొల్లేరు. ఇక్కడి నుంచి అక్కడికి. ఒక మురుగు కాల్వ అంత. రెండు మూరలు. పోనీ నాలుగు బారలు. అంతే. ఛిద్రదేహం. ముక్కలుగా చీరిన దేహం. పూడిన దేహం. ఎండిన దేహం. కొనఊపిరితో తీసుకుతీసుకు పడి ఉన్న దేహం. కొల్లేరు. కుమార్ అప్పుడు ఏమీ మాట్లాడలేదు. అది తను చిన్నప్పుడు చూసిన కొల్లేరు కాదు. గంభీరంగా మౌనంగా ఉండిపోయి హైదరాబాద్ చేరుకుని ఫోన్ చేస్తే అన్నారు- ‘ఆక్రమణ పూర్తయ్యింది. ఇంకేం మిగల్లేదు’. అదీ కొల్లేరు.

పది కాంటూర్లు.. అంటే 2.24 లక్షల ఎకరాలు. పోనీ ఐదు కాంటూర్లు... లక్ష ఎకరాలు... సరే మూడు కాంటూర్లు... ఏం లెక్క ఇది. సరస్సు సరస్సులా ఉండాలి. ప్రాణం ప్రాణంలా ఉండాలి. నీరు నీరులా ఉండాలి. చేప చేపలా ఈదాలి. ఏం చూశాం ఇక్కడ? పచ్చటి నేలలన్నీ చేపల చెరువులుగా రొయ్యల దొరువులుగా... జీవితాలు బాగుపడ్డాయి... సంపద పోగయ్యిందట... కాని అందరూ దాదాపుగా బాటిల్డ్ వాటర్ కొనుక్కొని తాగుతున్నారు. గ్రౌండ్ వాటర్ కలుషితం అయ్యింది. ఆక్వా మందులు నేల అడుగున ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జీవవాిహనీ... అంతర్వాహినీ... రసాయనిక విషవాహినీ...

రెండు వాదనలు వినిపించాయి. మొదటి వాదన- మహమ్మారి కొల్లేరు... వరద వస్తే లంకలను ముంచే దుఃఖదాయిని కొల్లేరు... జలగం వెంగళరావు పుణ్యమా అంటూ చేపల చెరువులు కల్పతరువులా మారి బతుకు బాగు చేసింది. గుడ్. రెండో వాదన- కానీ ఈ ప్రయత్నమే కొల్లేరు ముక్కు మూసేసింది. గుడ్లు పీకేసింది. ఊపిరితిత్తుల్లో తిష్ట వేసి రాచపుండులా నమిలి మింగేస్తోంది. పక్షులు అరాకొరా మిగిలాయి. చేపలు బిక్కుబిక్కుమంటున్నాయి. శాక రొయ్యలు.. బుంగ రొయ్యలు.. గాజు రొయ్యలు... ఏడ్చినట్టుంది. నీళ్లా అవి? పురుగుల మందు.
 కొల్లేటి కాపురం... సినిమా. కొల్లేటి బతుకు... వాడుక. కొల్లేటి జాడలు... ఇంతకాలానికైనా తెలుగులో వచ్చిన అక్కినేని కుటుంబరావు నవల. కొల్లేటి కథ? చాలా రాయాల్సి ఉంది. కొల్లేటి తాజా బతుకు మీద చాలా చేయాల్సి ఉంది. దానిని ఆక్రమించో ఆధారం చేసుకునో పొట్టపోసుకుంటున్న మామూలు మనుషులకు న్యాయం జరగాలి. కొల్లేరుకు జీవం రావాలి. ఈ రెండూ సాధించడం చాలా పెద్దపని. కొల్లేటి ప్రక్షాళన అంటే చాలా మంది వణుకుతున్నారు. భుక్తి పోతుందని. కాని ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు... తెలుగువారి సరస్సు... సైబీరియా పక్షుల మెట్టినిల్లు.... అటు చూస్తే తెలంగాణలో మిషన్ కాకతీయ... హుసేన్ సాగర్ పునరుజ్జీవనం... ఆంధ్రప్రదేశ్‌లో?
 బెంగ.

ఈలోపు కేశవరెడ్డి మరణవార్త మరో దిగులు.

 ఫిబ్రవరి 14న- దిగిన వెంటనే- పెదనిండ్రకొలనులో- కథాచర్చల కంటే ముందు కేశవరెడ్డి సంస్మరణ సభ- బహుశా రాష్ట్రంలోనే మొదటి సభ- ఏర్పాటు. రచయితలందరం కలిసి కేశవరెడ్డిని తలుచుకోవడం. ‘కేశవరెడ్డి గురించి తెలుగు ప్రాంతం కనీసం రెండు దశాబ్దాలు మౌనం పాటించింది. మునెమ్మ నవల మీద కాంట్రవర్సీ జరగకపోయి ఉంటే ఆ మౌనం ఇంకా కొనసాగేదేమో’ అని ఎవరో అన్నారు. ‘ఒక అగ్రకుల రచయిత అయి ఉండి జీవితాంతం శూద్రుల జీవితాలను రాసే పనికి పూనుకోవడం మామూలు విషయం కాదు’.. మరొకరు. ఇంకా ఎన్నో మాటలు... జ్ఞాపకాలు. తెలుగులో నవలను శ్రద్ధగా సాధన చేసిన ఒక శక్తిమంతమైన రచయితకి వీడ్కోలు. తెలుగు నవల తాత్కాలికంగా మూగదైంది. ఆ పిల్లనగ్రోవి మరి వినిపించదు.

ఆ మధ్యాహ్నం- సోషల్ మీడియాలో రాస్తున్న కొత్త రచయితల గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. ప్రింట్ మీడియా సంకెలల నుంచి, ‘ఎడిటర్లు అచ్చుకు స్వీకరించే’ అడ్డంకి నుంచి రచయితలను సోషల్ మీడియా విముక్తం చేయడాన్ని అందరూ మంచి పరిణామంగా చూశారు. అయితే ఒకటి రెండు కథలు రాయగా, నాలుగైదు లైకులు కనిపించగా, మరి మనంతవారు లేరని భావించే కొత్త రచయితలకు జాగ్రత్త చెప్పి కాపాడుకోవాలని కొందరు సూచించారు. అక్కర్లేదనీ తెలుసుకునేవారు తెలుసుకుంటారనీ లేకుంటే వాళ్ల పాపాన వాళ్లే పోతారని మరెవరో అనుభవం మీద తేల్చారు. అయితే విస్తృతి నుంచి ‘ఉన్మాద’స్థాయికి చేరుకున్న ఈ సోషల్ మీడియాలో క్షణమాత్రం సేపు కనిపించకపోతే బెంబేలు పడిపోయే కొత్త జబ్బు ‘ఫోమో’ (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) మీద మరో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ థీమ్‌ను తీసుకొని ఆరు కథలను ఆరుగురు రచయితలతో రాయించి ఆరు షార్ట్‌ఫిల్మ్స్ తీయాలన్న ప్రయత్నానికి తలో చేయి వేసే అంగీకారమూ కుదిరింది.

మహా రచయితలను తెలుసుకోవడం ముఖ్యం. ఒక రచయిత రచనా కృషిని తెలుసుకుంటే మన రచనాకృషిని బేరీజు వేసుకునే వీలవుతుంది. మహా రచయిత మార్క్వెజ్ రచనా ధోరణినీ ముఖ్యంగా పదాలతో దృశ్యం కట్టే అతడి ప్రతిభనీ విశదం చేస్తూ చాలా మంచి సెషన్ జరిగింది. ఒకే వాక్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల ప్రస్తావన వచ్చేలా మార్క్వెజ్ రాసేశైలి గురించి తెలుగువారు దృష్టి పెట్టారా? ప్రశ్న. ఈ చర్చ ఇలా జరుగుతుండగా నడక ఇబ్బంది వల్ల లాంచీలోనే ఉండిపోయిన సీనియర్ రచయితొకరు- ఐదారుమంది సిబ్బందిని కేకలేస్తూ పాసింజర్లను బుజ్జగిస్తూ పోటీదార్ల మీద కయ్యానికి దిగుతూ లాంచీని అలవోకగా నిర్వహిస్తున్న మహిళను పలకరించి మంచి కథకు సరిపడా సమాచారాన్ని సేకరించడం మిగిలినవాళ్లకు పెద్ద మిస్సింగు. ‘నేనెందుకు రాస్తున్నాను’ అనే అంశం మీద ఆ సాయంత్రం భీమవరం పాఠకుల మధ్య రచయితలు పంచుకున్న అనుభవాలు వారికే కాదు ఇతర రచయితలకు కూడా పాఠాలు.
 వీటన్నింటి నడుమ ప.గో.జిల్లా పల్లెల్ని చూడటం, గూడపెంకుల ఇళ్లను చూడటం, వాకిలి గోడలపై ముదురెరుపు మందారాలను చూడటం, కాలువల్లో మునకలు వేస్తున్న పిల్లలు, లారీలకు ఎక్కుతున్న తాజా చేపల తళుకులు, మిగిలి ఉన్న వరిచేల గ్రీన్ కార్పెట్, అమృతపాణి అరటిపండ్ల ఇన్‌స్టాంట్ శక్తి, భోజనంలో శీలవతి చేపల పులుసు అలవిగాని రుచి... ములక్కాడల్ని ఉడకబెట్టిన గుడ్లతో వండిన తియ్యగూర లొట్టలు... ఆ రాత్రి గుక్కెడు మదిరా... ఆ పైన కవుల కంఠాన పద్యమూ... కొన్ని గ్రూప్‌ఫొటోలూ మరికొన్ని చేబదులు సెల్‌స్నాప్‌లూ... అన్నింటి కంటే మించి అందరం కలిశాం కదా అని అభినయం లేని నిజమైన సంతోషం... రెండు రోజుల పర్యటనే... కాని రెండు సంవత్సరాలకు సరిపడా రాగిమాల్ట్.

 టైటానిక్ సురేష్ -7702806000, అక్కిరాజు భట్టిప్రోలు, కుప్పిలి పద్మల ఆధ్వర్యంలో కుమార్ కూనపరాజు -9989999599 పూనిక మీద జరిగిన ఈ కార్యక్రమంలో పాతా కొత్తా మిత్రులు చాలామంది. అల్లం రాజయ్య, దేవులపల్లి కృష్ణమూర్తి, హనీఫ్, భగవంతం, కోడూరి విజయకుమార్,  పూడూరి రాజిరెడ్డి, పద్మజా రమణ, దాట్ల దేవదానం రాజు, పెన్మత్స శ్రీకాంత్ రాజు. కలిదిండి వర్మ, నామాడి శ్రీధర్, బి.వి.వి.ప్రసాద్, డానీ, కుప్పిలి పద్మ, బా రహమతుల్లా, అనిల్ బత్తుల, జి.ఎస్.రామ్మోహన్, విజయలక్ష్మి, అజయ్ ప్రసాద్, అక్కిరాజు భట్టిప్రోలు, పద్మావతి, తెనాలి ఉమా, నాగేశ్వరరావు, ప్రసాదమూర్తి, శిఖామణి, లెనిన్ ధనిశెట్టి, కస్తూరి మురళీకృష్ణ, అనంత్... వీళ్లతో పాటు తల్లావఝల పతంజలి శాస్త్రి, మధురాంతకం నరేంద్ర కూడా రావాల్సింది. శాస్త్రిగారు కారణం చెప్పారు. నరేంద్ర ఏ పనుల్లో చిక్కుబడ్డారో ఏమో.

 ఒక రచనకు విధ్వంసానికి మించిన ధాతువు లేదు. ఆ విధ్వంసాన్ని చూపిన పర్యటన ఇది. జల ప్రళయం అంటే వేరేమిటో కాదు. నీటి ఆధారిత వ్యాపారంతో జరుగుతున్న భూ విధ్వంసం, సరస్సుల విధ్వంసం, స్వచ్ఛమైన జల వనరుల విధ్వంసం.
 రచయితలు చూడాల్సింది వీటినే. కలవాలి మనుషుల్ని. ఈ మూల ఈసారి. ఆ మూల మరోసారి. తదుపరి పర్యటన జూన్‌లోనట.
 కాసింత బస చూపి నాలుగు పూటలు భోజనం పెట్టేవారున్నారా? రచయితలు మీ ఊరు రావడానికి సిద్ధంగా ఉన్నారూ.                - ఒక కథకుడు
 
 కొల్లేటి కాపురం... సినిమా.
 కొల్లేటి బతుకు... వాడుక.
 కొల్లేటి జాడలు... ఇంతకాలానికైనా తెలుగులో వచ్చిన అక్కినేని కుటుంబరావు నవల.
 కొల్లేటి కథ?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement