పిల్లల పుస్తకప్రపంచంలో తనదైన ప్రత్యేకత నిలుపుకుంది రూపా పాయ్. ఫాంటసీ–అడ్వెంచర్ పుస్తకాలతో పాటు ‘ది గీతా ఫర్ చిల్డ్రన్’లాంటి భిన్నమైన పుస్తకాన్ని రాసి ప్రశంసలు అందుకుంది. ఈ పుస్తకం ‘క్రాస్‌వర్డ్ అవార్డ్’ గెలుచుకుంది. మరో భిన్నమైన పుస్తకం ‘ది యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’తో పిల్లలను పలకరించింది బెంగళూరుకు చెందిన రూప...
పిల్లల పత్రిక ‘టార్గెట్’తో పాటు లండన్ కేంద్రంగా ప్రచురితమయ్యే ‘ట్రావెల్ ట్రెండ్స్’ మ్యాగజైన్ కోసం ఎన్నో రచనలు చేసింది రూప. అయితే తనకు పిల్లల కోసం రచనలు చేయడం అంటేనే బాగా ఇష్టం. ‘నేను రచయిత్రి కాకపోయి ఉంటే టీచర్‌ని అయ్యేదాన్ని’ అంటుంది కంప్యూటర్–ఇంజనీరింగ్ చదువుకున్న రూప. చిన్నప్పటి నుంచి పుస్తకాలు తెగ చదివేది. బెంగళూరులోని లైబ్రరీలన్నీ ఆమెకు సుపరిచితమే. చదవగా, చదవగా తనలో కాల్పనిక ప్రపంచం ఒకటి అస్పష్టంగా ఆవిష్కారమయ్యేది. కళ్ల ముందు ఏవేవో పాత్రలు, దృశ్యాలు కదలాడుతుండేవి. కాగితం, కలం పట్టిన తరువాత వాటికి ఒక రూపం ఇచ్చింది.
రకరకాల జానర్స్‌లో రచనలు చేయడం గురించి రూప ఇలా అంటోంది...‘కథ మంచిదైతే, ఆకట్టుకునేలా ఉంటే అది ఏ జానర్ అనేది పిల్లలు పట్టించుకోరు. వారికి కచ్చితంగా హాస్యం ఉండాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ అనేది వారికి నచ్చాలి’.‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పుస్తకం రూపకు ఎంతో పేరు తెచ్చింది.‘మన పురాణాలకు సంబంధించిన ఎన్నో సంక్లిష్టమైన విషయాలను పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా రాస్తున్నారు కదా....మరి భగవద్గీత గురించి ఎందుకు రాయకూడదు’ అని ఒకరోజు అడిగింది ఎడిటర్ వత్సల. అయితే అందుకుముందెన్నడూ భగవద్గీతను రూప చదవలేదు. అలా అని ‘నేను రాయలేను’ అనలేదు. ‘ఓకే’ అంటూ రంగంలోకి దిగింది. ‘గీత’ను ఎన్నోసార్లు చదివింది. అనేకసార్లు చదివిన తరువాత ‘గీత గురించి పిల్లలకు చెప్పాలనే ఆలోచన నాకు ఎందుకు రాలేదు’ అనుకుంది.నిజానికి అదొక సవాలు. కానీ ఆ సవాలును ఇష్టంగా స్వీకరించింది రూప.
‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పిల్లలనే కాదు వారి తల్లిదండ్రులను కూడా ఆకట్టుకుంది. ‘మంచి ప్రయత్నం’ అని ప్రశంసించారు.‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పుస్తకం విజయవంతం అయిన తరువాత ‘ఇదే కోవలో మరో పుస్తకం రాస్తే బాగుంటుంది’ అని చాలామంది అడిగారు. అయితే అలా రాస్తే రొడ్డకొట్టుడుగా ఉంటుందని రూపకు ఆనిపించింది. ‘ఇప్పుడు కావాల్సింది మరో విభిన్నమైన పుస్తకం’ అని అనుకుంది. అలా వచ్చిందే...‘సో యూ వాంట్ టు నో ఎబౌట్ ఎకనామిక్స్’ పుస్తకం. ఈ పుస్తకం రావడానికి మరో కారణం ‘గీతను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడంలో విజయం సాధించాను’ అనే ఆత్మవిశ్వాసం. ఈ పుస్తకం తరువాత వచ్చిన ‘రెడీ 99’కి కూడా మంచి స్పందన వచ్చింది.
పుస్తకం రాయడానికి రూప అనుసరించే పద్ధతి ఏమిటి?
పుస్తకం రాయడానికి ముందు మనసు అనే కాగితంపైనే ఎన్నో వాక్యాలు రాసుకుంటుంది. అక్కడే ఎడిటింగ్ చేసుకుంటుంది. తాను ఎంచుకున్న అంశంపై ఎన్నో పుస్తకాలు చదువుతుంది. ఆ అంశంపై పట్టు ఉన్న వాళ్లతో మాట్లాడుతుంది. విషయ అవగాహన తరువాత పిల్లలను ఆకట్టుకునేలా, అర్థమయ్యేలా ఎలా రాయాలో అనేదానిపై కసరత్తు చేస్తుంది.‘పన్నెండు సంవత్సరాల వయసులో ఒక పిల్లల మాసపత్రికను చూస్తూ...పెద్దయ్యాక ఈ పత్రికకు కథలు రాయాలనుకునేదాన్ని. నా కల నెరవేరింది. ఇంతకంటే అదృష్టం, ఆనందం ఏముంటాయి!’ అంటుంది రూపా పాయ్.
పిల్లలకు యోగా సూత్రాలు
భగవద్గీత శ్లోకాల సారాంశాన్ని, ఆర్థిక సూత్రాల మర్మాన్ని పుస్తకాల ద్వారా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పిన రూపా పాయ్ తాజా పుస్తకం ‘ది యోగ సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’. చిన్నప్పుడు మనసులో పడిన ఒక బీజం మొక్క అవుతుంది. ఆ తరువాత బలమైన చెట్టు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పుస్తకం ఇది. ‘మనలో కలిగే రకరకాల భావాలకి మనమే యజమాని’ ‘నేను శరీరాన్ని కాదు. కాని ఈ శరీరమనే అద్భుతమైన నిర్మాణంతో ఈ అద్భుత ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను’ ‘నేను మనసుని కాదు. కానీ మనసు అనే మహా నిర్మాణంలో ఎన్నో అద్భుతాలను అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాను’... ఇలా ఆకట్టుకునే మాటలు ఎన్నో ఉన్న ‘ది యోగ సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’ ఆబాలగోపాలానికి ప్రియమైన పుస్తకం అవుతుంది అనడంలో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment