రేవతి వీరమణి
అమ్మమ్మలు, నానమ్మలు ఏం చేస్తారు? ఇదిగో దేశానికి ఇలాంటి వరాల మూటను అందిస్తారు. తమిళనాడు నుంచి ఒలింపిక్స్‌కు పయనమైన 23 ఏళ్ల రేవతి వీరమణి 4 X 400 మీటర్ల మిక్స్‌డ్ రిలే పరుగులో భారత్‌కు మెడల్ అవకాశాలపై ఆశలు రేపుతోంది. ఏడేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన రేవతిని పనిలో పెట్టు అని అందరూ ఆమె అమ్మమ్మకు సూచిస్తే ‘నా మనవరాలు చదువుకోవాలి’ అని ఇటుక బట్టీల్లో తాను శ్రమించి రేవతిని క్రీడాకారిణిని చేసిందా అమ్మమ్మ. అందుకే ‘ఇదంతా మా అమ్మమ్మ’ ఘనతే అంటోంది రేవతి. విధి జీవితంతో ఆట ఆడొచ్చు. కాని విధిని గెలిచే ఆట మనం తప్పక ఆడాలి.
2016.
కోయంబత్తూరులో 32వ జూనియర్ అథ్లెటిక్ నేషనల్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. 100 మీటర్ల పరుగు ఫైనల్. ట్రాక్ మీద ఉన్న ఆ అమ్మాయిని ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి జమాజట్టీల్లాంటి జూనియర్ అథ్లెట్లు ట్రాక్ మీద ఉన్నారు. తుపాకీ మోగింది. ఆ అమ్మాయి చిరుతలా కదిలింది. రెప్పపాటు సమయంలో 100 మీటర్లను ముగించింది. 12.2 సెకన్ల కాలంలో 100 మీటర్లను ఫినిష్ చేసిన ఆ అమ్మాయి పేరేమిటా అని అందరూ ఆరా తీశారు. రేవతి వీరమణి. ఆ తర్వాత ఆ చాంపియన్‌షిప్‌లో రేవతి 200 మీటర్లను, 4 X 100 రిలేను గెలిచి తమిళనాడును పతకాల పంటలో రెండోస్థానంలో నిలిపింది. అప్పుడే అందరూ అనుకున్నారు ఈ అమ్మాయి ఒలింపిక్స్ వరకూ వెళుతుందని. ఇవాళ అదే జరిగింది. జపాన్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ తరఫున 4 X 400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో పాల్గొననుంది రేవతి. కచ్చితంగా మెడల్ సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది.
అమ్మమ్మ అరమ్మాళ్‌తో రేవతి వీరమణి
ఉత్త కాళ్లతో పరిగెత్తి...
రేవతిది మదురైకు ఆనుకుని ఉండే సక్కిమంగళం అనే చిన్న పల్లె. ఆమెకు ఏడేళ్ల వయసు ఉండగా తండ్రి ఉదర సంబంధమైన వ్యాధితో మరణించాడు. ఆ తర్వాత ఆరు నెలలకే తల్లి బ్రెయిన్ ఫీవర్‌తో ప్రాణాలు వదిలింది. రేవతి, రేవతి చెల్లెలు అనాథలయ్యారు. ఆ సమయంలో వారి వెనుక ఉక్కు గోడలా నిలిచి కాపాడుకుంది అమ్మమ్మ అరమ్మాళ్. ఇద్దరు మనవరాళ్లను ఆమె ప్రాణంగా పెంచుకోవాలని నిశ్చయించుకుంది. ఆమె అతి పేదరాలు. పొలాల్లో, ఇసుక బట్టీల్లో పని చేస్తేనే పొట్ట నిండేది. ‘నువ్వు వాళ్లను ఏం పెంచుతావు. పనిలో పెట్టు’ అని బంధువులందరూ చెప్పినా ‘నా మనవరాళ్లను చదివించుకుంటాను’ అని ఆమె కష్టపడింది. రేవతిని గవర్నమెంట్ స్కూల్లో వేస్తే ఇంటర్వెల్‌లో ఉత్త కాళ్ల మీద వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మమ్మను చూసి వెళ్లేది. ‘తూనీగలాగా పరిగెడతా ఉంది’ అనుకున్న అమ్మమ్మ పరుగులో రేవతిని ప్రోత్సహించింది. షూస్ కొనుక్కునే స్తోమత కూడా లేని రేవతి ఉత్త కాళ్లతో పల్లె రోడ్ల మీద పరుగులు తీస్తూ ప్రాక్టీసు చేసేది. ఆ సమయంలోనే మదురైకి చెందిన కోచ్ కన్నన్ దృష్టిలో పడటంతో రేవతి జీవితం మారింది.
అమ్మమ్మను ఒప్పించి
ఇంటర్ వరకూ ప్రాక్టీసుకు ఒప్పుకున్న అరమ్మాళ్ డిగ్రీ మదురైలో ఉండి చదువుకుంటూ రన్నింగ్‌ను సాధన చేయాలని కోచ్ చెప్పేసరికి భయపడింది. కాని కాలేజీలో సీటు ఫ్రీ హాస్టల్ ఏర్పాటు చేశాక అంగీకరించింది. మదురై పల్లెల్లో పిల్లలు చాలా వేగంగా ఆటలు ఆడతారు. వారికి జల్లికట్టు, మంజు విరాట్టు వంటి ఆటలు వేగాన్ని ఇస్తాయి. రేవతికి కూడా అలాంటి వేగం వచ్చింది. జాతీయస్థాయిలో మెడల్స్ సాధించి తమిళనాడు ప్రభుత్వ ప్రోత్సాహం అందుకుంది. అలాగే రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం పొందింది. ఆమె చెల్లెలు పోలీస్ ఆఫీసర్ అయ్యింది.
గాయపడినా...
ఆసియా క్రీడల్లో రేవతి 4 X 400 రిలేలో 4వ స్థానంలో వచ్చింది. వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో కూడా పాల్గొంది. కాని ఆ తర్వాత ఆమెకు మోకాలి సమస్య వచ్చింది. ‘నేను చాలా కష్టపడాల్సి వచ్చింది దాని నుంచి బయటపడటానికి’ అని రేవతి అంది. రేవతి అమ్మమ్మ ఆ సమయంలో మనవరాలి ఆత్మస్థయిర్యం చెదరకుండా చూసుకుంది. ‘ఆమె నన్ను ఆపలేదు. వెళ్లు. పరిగెత్తు’ అంది. కోచ్‌ల సాయంతో మళ్లీ నేను మామూలు స్థితికి వచ్చాను’ అంది రేవతి. ఒలంపిక్స్ సన్నాహాల్లో భాగంగా పాటియాలాలో జరిగిన క్యాంప్‌లో
4 X 400 మిక్స్‌డ్ రిలేలో 54 సెకన్ల వ్యక్తిగత సమయాన్ని నమోదు చేసింది రేవతి.
∙∙
రేవతి జపాన్‌కు వెళ్లింది. ఆమె అమ్మమ్మ ఎప్పటిలాగే పొలంలో పని చేసుకుంటూ మనవరాలు తెచ్చే శుభవార్త కోసం ఎదురు చూస్తోంది. రేవతి మెడల్ తెస్తే అందులో సగం ఆమె అమ్మమ్మకే దక్కుతుంది.
అమ్మమ్మ లేకపోతే ఇవాళ నేను లేను. కూతురి పెళ్లి చేసి బాధ్యతలు తీరాయి అనుకునే వయసులో నేను, నా చెల్లి ఆమె ఒడికి చేరాము. ఆమె తిరిగి మాకు అమ్మైంది. ఆమెకు చెప్పకుండా నేను ఏ పనీ చేయను. మేము కాకుండా ఆమెకు వేరే లోకం లేదు.
– రేవతి
Comments
Please login to add a commentAdd a comment