
సుబ్బరావమ్మ... మదర్ ఆఫ్ గోపీచంద్!
హీరోయిన్‌గా గతంలో ఓ వెలుగు వెలిగిన కథానాయికలు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రేవతి, రమ్యకృష్ణ, నదియా, మీనా, రాశి, ఐశ్వర్య తదితరులు ఈ కోవలో ఉన్నారు. అలనాటి అందాల తార రేవతి ఇటీవల ‘లోఫర్’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో హీరో తల్లి పాత్రలో కనిపించారు. ఇప్పుడు మరో చిత్రంలో ఆ పాత్ర చేయనున్నారని సమాచారం. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
రియల్ లైఫ్‌లో గోపీచంద్ తల్లి సుబ్బరావమ్మ ‘పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ’ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఆ పాత్రలోనే రేవతి కనిపించనున్నారని సమాచారం. గోపీచంద్ పాత్రలో హీరో సుధీర్‌బాబు నటించనున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రం నిర్మించనుంది. స్వతహాగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన సుధీర్... గోపీచంద్ పాత్రకు పూర్తి న్యాయం చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో చిత్రీకరణ మొదలు పెట్టాలనుకుంటున్నారు.