ఘట్టమనేని ఘటికురాలు | ghattamaneni revathi special story on women empowerment | Sakshi
Sakshi News home page

ఘట్టమనేని ఘటికురాలు

Published Thu, Feb 15 2018 11:40 AM | Last Updated on Thu, Feb 15 2018 11:40 AM

ghattamaneni revathi special story on women empowerment - Sakshi

దక్షిణాఫ్రికాలో జరిగిన కామన్‌వెల్త్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సందర్భంగా భారతదేశ జాతీయ పతాకాన్ని సగర్వంగా ప్రదర్శిస్తున్న సాయిరేవతి (ఫైల్‌)

అలల రూపంలో ఎగసిపడుతూ వస్తున్న కష్టాలకు ఎదురునిలిచి గెలుస్తూ వచ్చిన ఆ యువతి పేరు ఘట్టమనేని సాయిరేవతి. తండ్రిని కోల్పోయి పేదరికమే పెద్ద దిక్కయిన ఇంట్లో తానే ఓ శక్తిగా మారింది. చిన్న వయసులోనే కుటుంబ భారం తెలిసిన ఆమెకు పవర్‌ లిఫ్టింగ్‌లో బరువులు తేలికగానే అనిపించాయి. చెదరని ఆత్మబలానికి కఠోర దీక్షను జత చేసింది. అంతే రాష్ట్ర, జాతీయ స్థాయిలో 40కుపైగా స్వర్ణ, రజక పతకాలు ఆమెకు తలవంచాయి. కామన్‌వెల్త్‌ క్రీడల్లో మూడు బంగారు పతకాలు మెడలో మణిహారమయ్యాయి. మరోవైపు చదువుల్లో మేటిగా రాణించి ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగమూ సాధించింది సాయి రేవతి.

తెనాలిరూరల్‌:  తెనాలి సమీపంలోని పెదరావూరు సాయి రేవతి నివాసం. చదువులు, బరువుల వేటలో అద్భుతంగా రాణిస్తున్న ఆమె జీవితం చాలా మందిలా వడ్డించిన విస్తరి కాదు. వీరి స్వస్థలం బుర్రిపాలెం. ఆరోతరగతిలో ఉండగా అనారోగ్యంతో తండ్రి మరణించాడు. తల్లి పద్మావతి సాయిరేవతినీ, పెద్దమ్మాయి యామినీజ్యోతిని తీసుకుని పెదరావూరులోని పుట్టింటికి చేరింది. ‘అమ్మమ్మ శాఖమూరి సీతారావమ్మ పెద్దమనసుతో ఆదరించింది. వారికుంది ఎకరం పొలమే. ఆ ఆదాయంతోనే అందరం సర్దుకున్నాం’ అని చెప్పింది సాయిరేవతి. అతికష్టం మీద ఇంటర్‌ పూర్తి చేసి తెనాలిలో ఏఎస్‌ఎన్‌ డిగ్రీ కాలేజీలో  చేరింది. వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడలో రాణిస్తే, పోలీసు అధికారి కావాలన్న కోరిక నెరవేరుతుందన్న భావన కలిగింది. కాలేజీ యాజమాన్యం ప్రోత్సాహం, వ్యాయామ అధ్యాపకుల పర్యవేక్షణతో సాధన ఆరంభించింది. శరీర గాయాలతో, పౌష్టికాహారానికి తగిన డబ్బులు లేక బాధపడిన సందర్భాలెన్నో! అన్నిటినీ తట్టుకుంటూ చేసిన సాధనకు ఇప్పుడు ఫలితం లభించింది.

కామన్‌వెల్త్‌లో మెరిసిన రేవతి..
సాధనతో ఎత్తే బరువులనే కాదు, మానసిక బలాన్ని పెంచుకుంటూ వెళ్లింది. దక్షిణాఫ్రికాలో గతేడాది జరిగిన 7వ కామన్‌వెల్త్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌–2007లో మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. అంతకు కొద్ది రోజుల ముందే కేరళలోని అలెప్పీలో ఇండియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన సీనియర్‌ నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జాతీయ రికార్డు నెలకొల్పింది. డెడ్‌లిఫ్ట్‌లో 2016లో జమ్ములో తాను నెలకొల్పిన రికార్డును బ్రేక్‌ చేసి, సరికొత్త రికార్డుతో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఓవరాల్‌ ప్రతిభలోనూ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది.  2015లో ఉత్తరాఖండ్‌లో జరిగిన సీనియర్‌ నేషనల్స్‌లో 350 కిలోల విభాగంలొ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓవరాల్‌లో తన ప్రతిభ 360 కిలోలకు పెరిగింది. 2016 డిసెంబరులో జార్ఖండ్‌లోని టాటానగర్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో ‘స్ట్రాంగ్‌ విమెన్‌’, ‘బెస్ట్‌ లిఫ్టర్‌’గా రెండు స్వర్ణ పతకాలను గెలిచింది. ఈ విజయాలతో ప్రతిష్టాత్మకమైన కామన్‌వెల్త్‌ పోటీలకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరు గుంటూరు జిల్లా యువతుల్లో సాయిరేవతి ఒకరు.  

అంతర్జాతీయపోటీల్లో సత్తా
2014లో థాయ్‌లాండ్‌లోని నార్త్‌ఛాంగ్‌మయి యూనివర్సిటీలో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ తరఫున పాల్గొంది. 2009–10 నాగార్జున యూనివర్సిటీ నుంచి ఆరేళ్లు వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌ను సాధించింది. ఇందులో 4 సార్లు బెస్ట్‌ లిఫ్టర్‌గా 3 సార్లు స్ట్రాంగ్‌ విమెన్‌గా నిలిచింది. కాకినాడలోని జేఎన్‌టీయూలో చదివేటప్పుడు అక్కడా ఐదేళ్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2 సార్లు బెస్ట్‌ లిఫ్టర్‌గా, మరో రెండేళ్లు స్ట్రాంగ్‌ విమెన్‌గా, ఒకసారి బెస్ట్‌ అథ్లెట్‌గా బహుమతులు గెలుచుకొంది. మరో ఏడాది ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది యూనివర్శిటీ’ అవార్డును అందుకోవటం విశేషం. బీకాం, ఎంబీఏ, ఎంఎస్సీ పూర్తిచేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీట్‌ పరీక్షలో టాపర్‌గా నిలిచి, బీపీఈడీ చేసింది. అదే స్ఫూర్తితో ‘నాగార్జున’ పీజీ సెట్‌ (2015)లో టాపర్‌గా నిలిచింది.

లక్ష్యంపైదృష్టి సారించాలి
చిన్నతనంలో నాకు ఎదురైన కష్టాలే సవాళ్లను నేర్పించాయి. తండ్రిని కోల్పోయాక ఉద్యోగం సాధించాలని దృఢంగా అనుకున్నాను. వెయిట్‌ లిఫ్టింగ్‌ రంగం ఎంచుకున్నాక బాగా శ్రమించాను. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లడంతో విజయాలు వాటంతట అవే వచ్చాయి. నేటి యువత సెల్‌ఫోన్, సామాజిక మాధ్యమాలపై పెట్టిన శ్రద్ధ కెరీర్‌పై ఉంచడం లేదు. ఈ ధోరణి మారాలి. లక్ష్యాన్ని ఏర్పరచుకుని శ్రమించాలి. – సాయిరేవతి,కామన్‌వెల్త్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement