=భర్త, అత్తింటివారి వేధింపులు
=మాయచేసి విడాకుల పత్రంపై సంతకం చేయించుకున్న భర్త
=కోర్టులో కొనసాగుతున్న విచారణ
=గండిగుంట శివారు మూర్తిరాజుగూడెంలో ఘటన
ఉయ్యూరు, న్యూస్‌లైన్ : జీవితాంతం తోడుండాల్సిన భర్త నమ్మించి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక ఓ వివాహిత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల నుదిటి భాగంలో సుడి ఉంటే తమ ఇం టిలో పెద్దవాడి ప్రాణానికే ప్రమాదం ఉందనే నెపంతో తనకు తెలియకుండా విడాకుల నోటీసులపై సంతకం చేయించడాన్ని, విడిపోదామంటూ బెదిరించడాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయి రెండేళ్లయినా గడవకుండానే తమ కుమార్తె మృత్యువాత పడటాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు స్థానికుల హృ దయాలను కలిచివేసింది.
ఆధునిక సాంకేతిక, సమాచార సమాజంలో కూడా సుడులు, జాతకాల పేరిట అర్ధాంగి ఆయుష్షు తీసేందుకు కారణమైన ఈ ఘట న ఉయ్యూరు మండలం మూర్తిరాజుగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పామర్రుకు చెందిన మన్నెం కనకదుర్గాప్రసాద్‌తో ఉ య్యూరు మండలం గండిగుంట గ్రామ శివారు మూ ర్తిరాజుగూడేనికి చెందిన ఈడే వెంకటరామారావు కుమార్తె రేవతి(24)కి గత ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. దుర్గాప్రసాద్ టింకరింగ్ పని చేస్తుం టాడు. రేవతి కాపురానికి వచ్చినప్పటినుంచి వేధిం పులకు గురవుతోంది.
ఆమె నుదుటి భాగాన సుడి ఉందని, ఇలా ఉన్న ఆడపిల్ల ఎవరి ఇంట కాలుపెట్టినా ఆ ఇంటి పెద్ద చనిపోతాడని దుర్గాప్రసాద్ కు టుంబ సభ్యులు ప్రచారం చేశారు. దుర్గాప్రసాద్ పెద్దన్నయ్య దీన్ని మరింతగా నమ్మించడంతో ఆమెను వదిలించుకునేందుకు మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. కట్నంగా ఇచ్చిన 60 సెంట్ల పొలాన్ని అమ్ముకురావాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. విషయాన్ని రేవతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టారు.
కట్నం వేధింపులపై రేవతి పుట్టింటివారి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో దుర్గాప్రసాద్ అరెస్టయ్యాడు. తరువాత పెద్ద మనుషులు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. మళ్లీ అత్తారింటికి వెళ్లిన రేవతిని ఏదో ఒక కారణంతో హింసించేవారు. ఈ క్రమంలో దుర్గాప్రసాద్ భార్యతో ప్రేమగా ఉంటున్నట్లు నటిస్తూ విడాకుల పత్రాలపై తెలివిగా సంతకాలు చేయించుకున్నాడు. తరువాత పుట్టింటికి తీసుకువచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉండి రమ్మని చెప్పి వెళ్లిపోయాడు.
కొన్ని రోజులు గడిచాక రేవతి పుట్టిం టికి కోర్టు నుంచి విడాకుల నోటీసులు అందాయి. దీంతో వారు షాక్‌కు గురయ్యారు. రేవతి భర్తకు ఫోన్ చేసి ఇదేమిటని ప్రశ్నిస్తే విడిపోదామంటూ సలహా ఇచ్చాడు. ఈ కేసు విచారణ గుడివాడ కోర్టులో జరుగుతోంది. ఈనెల రెండో తేదీన ఇద్దరూ వాయిదాకు హాజరయ్యారు. ఈ క్రమంలో కోర్టు బయట రేవతిని దుర్గాప్రసాద్ దూషించి విడాకులకు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ నెల 31న ఇదే కేసుపై మళ్లీ న్యాయస్థానం ఎదుట వారు హాజరుకావాల్సి ఉంది. భర్త, అత్తింటివారి మోసాన్ని భరించలేక రేవతి గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకుంది. కుమార్తె ఆత్మహత్యపై వెంకట రామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ పోలీసులు తెలిపారు.
వివాహిత బలవన్మరణం
Published Fri, Dec 20 2013 2:11 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement