కుటుంబ సభ్యులకు అస్వస్థత బెంగతో వృద్ధుడి ఆత్మహత్య
మృతుడి కుటుంబం మొత్తం ఆసుపత్రిలోనే...
రామాయంపేట: తనతోపాటు కుటుంబ సభ్యులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారనే బెంగతో ఆ వృద్ధుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం రాత్రి మండలంలోని నిజాంపేటలో జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజాంపేటకు చెందిన రేగుల పోచయ్య(70)కు ముగ్గురు కుమారులున్నారు. వీరికి పెళ్లిళ్లయ్యాయి. వారికి పిల్లలున్నారు. కాగా నాలుగైదు రోజుల క్రితం ఆ కుటుంబ సభ్యులు మొత్తం వాంతులు, విరేచనాలతో తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. వీరితోపాటు పోచయ్య కూడా అస్వస్థతతో తల్లడిల్లుతున్నాడు.
అతడి కుమారులతోపాటు కోడళ్లు, మనవలు, మనవరాళ్లను చికిత్స కోసం గురువారం రామాయంపేట తరలించగా, ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. గ్రామంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన పోచయ్య రాత్రి నిజాంపేటలోని తన ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతోపాటు అనారోగ్యంతో సతమతమవుతూ బెంగపెట్టుకున్న పోచయ్య ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందాడు. విషయం తెలుసుకొని రామాయంపేటలో చికిత్స పొందుతున్న అతడి కుటుంబ సభ్యులు జ్వరంతోనే గ్రామానికి చేరుకున్నారు. వారు తీవ్ర అనారోగ్యంతోనే మృతదేహం పక్కనే పడుకొని విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈమేరకు స్థానిక ఎస్‌ఐ నాగార్జునగౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.