పూర్వం మందపాలుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయనకు లపిత అనే భార్య ఉండేది. అయితే, వారికి సంతానం లేదు. మందపాలుడికి తపస్సు చేయాలనే కోరిక కలిగింది. వెంటనే బ్రహ్మచర్య దీక్ష వహించి, ఒక కీకారణ్యంలోకి చేరుకున్నాడు. అక్కడ వెయ్యేళ్లు ఘోర తపస్సు చేశాడు. తర్వాత యోగమార్గంలో ప్రాణత్యాగం చేశాడు. ప్రాణాలు వదిలిన తర్వాత ఊర్ధ్వ లోకాలకు పయనమయ్యాడు. పుణ్యలోకాల్లోకి ప్రవేశించకుండా దేవదూతలు అతడిని అడ్డుకున్నారు.
‘నన్నెందుకు అడ్డుకుంటున్నారు? వెయ్యేళ్లు తపస్సు చేసిన నాలాంటి తపస్సంపన్నుడైన మహర్షికి పుణ్యలోకాల్లో ప్రవేశం లేకపోవడానికి కారణం ఏమిటి? నేనే పాపం చేశాను?’ అని మందపాలుడు దేవదూతలను నిలదీశాడు. ‘ఎంత తపస్సు చేసినా ఏం ప్రయోజనం? సంతానం లేనిదే సద్గతులు సంప్రాప్తించవు. నువ్వు తిరిగి భూలోకానికి వెళ్లి, సంతానం పొంది వస్తే, అప్పుడు పుణ్యలోకాల్లోకి ప్రవేశించగలవు’ అని బదులిచ్చారు దేవదూతలు.
మందపాలుడు మళ్లీ భూలోకానికి వచ్చేశాడు. త్వరితగతిన సంతానం పొందడం భూమ్మీద పక్షులకే సాధ్యమని, పక్షుల్లో లావుక పిట్టలు మరింత త్వరితగతిన సంతానం పొందగలవని గుర్తించి, లావుక పిట్టగా మారాడు. జరిత అనే లావుక పిట్టతో కాపురం చేసి, సంతానం పొందాడు. పక్షుల రూపంలో పుట్టినా, మందపాలుడి నలుగురు కుమారులూ బ్రహ్మజ్ఞానులు.
సంతానం కలిగిన తర్వాత మందపాలుడు జరితకు, ఆమె నలుగురు కుమారులకు ఖాండవవనంలో ఒక గూడును ఏర్పరచాడు. కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత తన మొదటి భార్య లపిత దగ్గరకు బయలుదేరాడు.ఒకరోజు అతడికి మార్గమధ్యంలో ఖాండవవనం వైపు వస్తున్న అగ్నిదేవుడు ఎదురయ్యాడు. అగ్నిని చూడగానే, అతడు ఖాండవవనాన్ని దహించడానికే వస్తున్నాడని మందపాలుడికి అర్థమైపోయింది.
అగ్నికీలల్లో తన భార్యకు, సంతానానికి ప్రాణగండం తప్పదని గ్రహించి, అగ్నిసూక్తాలు పఠిస్తూ ఎదురేగి, అగ్నికి నమస్కరించాడు. మందపాలుడి స్తోత్రాలకు అగ్నిదేవుడు ప్రసన్నుడయ్యాడు. ‘మహర్షీ! ఏమి కోరిక?’ అని అడిగాడు. ‘అగ్నిదేవా! ఈ ఖాండవవనంలోనే నా భార్య, నా నలుగురు కొడుకులు లావుక పిట్టల రూపంలో ఉన్నారు. ఖండవవనాన్ని దహించేటప్పుడు వాళ్ల మీద దయచూపు. వాళ్లకు ప్రాణహాని లేకుండా కాపాడు’ అని ప్రార్థించాడు.
ఈ సంగతి జరితకు, ఆమె పిల్లలకు తెలియదు. సరేనంటూ అగ్నిదేవుడు మందపాలుడికి అభయమిచ్చాడు. కృష్ణార్జునుల అండతో అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహించడం ప్రారంభించాడు. అగ్నిని నిలువరించడానికి వచ్చిన దేవేంద్రుడితో కృష్ణార్జులు యుద్ధం సాగించారు. వనాన్నంతటినీ అగ్నికీలలు దహించివేస్తూ దూసుకొస్తుండటంతో జరిత భయపడింది.
రెక్కలు రాని కూనలను ఎలా రక్షించుకోగలననుకుని ఆమె దుఃఖించసాగింది. కూనలను వదిలేసి, తన మానాన తాను ఎగిరిపోవడానికి ఆమెకు మనసు రాలేదు. అందుకని ఆమె తన కొడుకులకు ఒక ఉపాయం చెప్పింది.‘బిడ్డలారా! ఈ చెట్టు కిందనే నేల మీద ఎలుకలు చేసిన బొరియ కనిపిస్తోంది. మీరు నెమ్మదిగా వెళ్లి అందులో దాక్కోండి. నేను బొరియ ప్రవేశమార్గాన్ని మట్టితో కప్పేస్తాను.
అప్పడు మీకు అగ్ని వేడి సోకదు. అగ్ని చల్లారిన తర్వాత మనం మళ్లీ కలుసుకుందాం’ అంది.జరిత కూనలలో పెద్దవాడు జరితారి ‘అమ్మా! ఎలుకల బిలంలోకి వెళితే, అక్కడ మమ్మల్ని ఎలుకలు చంపి తినేస్తాయి. ఎలుకలకు ఆహారం కావడం కంటే, అగ్నికి ఆహుతైపోవడమే పుణ్యం. గాలితో పాటు అగ్ని మరోవైపు మళ్లితే, ఇక్కడే మేం బతికే అవకాశం ఉంటుంది.
కనుక మేం ఇక్కడే ఉంటాం. నువ్వు ఎగిరి పారిపో! కనీసం నీకైనా ప్రాణాపాయం తప్పుతుంది. మేం కాలిపోయినా, నీకు మళ్లీ సంతానం కలుగుతుంది. ప్రాప్తముంటే మళ్లీ మేమే నీకు సంతానంగా కలగవచ్చు. నీ పుణ్యం వల్ల మేం బతికి బయటపడ్డామంటే మనం మళ్లీ కలుసుకోవచ్చు’ అని చెప్పాడు.
ఇలా రకరకాలుగా నచ్చచెప్పి, నాలుగు కూనలూ తల్లిని సాగనంపాయి.
ఇంతలో వనమంతా దహించేస్తూ ఉన్న అగ్ని పక్షికూనలు వైపు వచ్చాడు. మందపాలుడి కుమారులైన నలుగురూ వేదమంత్రాలతో అగ్నిదేవుడిని స్తుతించారు. అగ్ని వారికి అభయమిచ్చి, వారికి ఏ అపాయం లేకుండా కాపాడాడు.ఖాండవ దహనం పూర్తయి, అగ్ని చల్లారిన తర్వాత జరిత తిరిగి వచ్చింది. తన గూడు, పిల్లలూ క్షేమంగా ఉండటం చూసి సంతోషించింది.
Comments
Please login to add a commentAdd a comment