సిరియా రాజుకు ఇజ్రాయేలుతో యుద్ధం చేయాలని ఆలోచన. అతను ఆ రాజ్యం బయట ఏ ప్రాంతం నుంచి దాడి చేసినా సిరియా సైన్యాన్ని ఇజ్రాయేలు రాజు సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. ఎవరికీ తెలియకుండా యుద్ధ వ్యూహాన్ని రచించినా ఇజ్రాయేలు రాజు తన వ్యూహాన్ని ఎలా తెలుసుకుంటున్నాడో అంతుపట్టలేదు. దాంతో సిరియా రాజు తన సైనికులను పిలిపించి మనం వ్యూహం గురించి ఇజ్రాయేలు రాజుకు మీరే చెబుతున్నారని, చెప్పింది ఎవరో తనకు తెలియాలని అన్నాడు. సైనికులలో ఒకరు ‘‘మేమెవ్వరమూ చెప్పడం లేదు రాజా! ఆ ప్రాంతంలో ఎలీషా అని ఒక భక్తుడున్నాడు, ఇక్కడి మీ ఆలోచన అతను తెలుసుకుని ఆ విషయాన్ని ఇజ్రాయేలు రాజుకు తెలుపుతున్నాడు’’ అని చెప్పారు.
‘‘అయితే ముందుగా ఆ భక్తుడిని నా వద్దకు రప్పిం^è ండి’’ అని సిరియా రాజు ఆజ్ఞాపించాడు. సిరియా సైనికులు ఎలీషా దోతాను పట్టణంలో ఉన్నాడని తెలుసుకుని పట్టణాన్ని చుట్టుముట్టారు. విషయం తన శిష్యుని ద్వారా తెలుసుకున్న ఎలీషా తానే ఆ సైనికుల వద్దకు వెళ్లాడు, భక్తుడైన ఎలీషా ప్రార్థన చేయడంతోటే దేవుడి మహిమతో సిరియారాజు సైన్యం మొత్తానికి కళ్లు కనిపించకుండా పోయాయి. అప్పుడు ఎలీషా వారి వద్దకు వచ్చి ‘‘మీరు వెదుకుతున్న ఎలీషాను నేను చూపిస్తాను రండి’’ అని వారిని వెంటబెట్టుకుని ఇజ్రాయేలు సైనిక స్థావరమైన షోమ్రోను పట్టణానికి తీసుకు వెళ్లాడు. ఎలీషా ప్రార్థన మేరకు దేవుడు ఆ సైనికులకు తిరిగి దృష్టిని ఇచ్చాడు. వారు కళ్లు తెరిచి చూసి తాము ఇజ్రాయేలు సైనిక స్థావరమైన షోమ్రోనుకు తేబడ్డామనే విషయం అర్థమై భయంతో వణికిపోయారు.
అప్పుడు ఇజ్రాయేలు రాజు ఎలీషాను ‘‘నాయనా వారిని చంపుదుమా’’ అని అyì గాడు. భక్తుడైన ఎలీషా ‘‘వద్దు, వారికి భోజనం పెట్టి పంపించమని’’ చెప్పి వెళ్లిపోయాడు. అతని మాట మేరకు ఇజ్రాయేలు రాజు అనేక వంటకాలను చేయించి సిరియా సైన్యానికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు. తమ సైనికులు రాలేదని కలవరపడుతున్న సిరియా రాజు వద్దకు తిరిగి ఆ సైన్యం వెళ్లి విషయం మొత్తం చెప్పగానే రాజు హృదయం మారి ఇజ్రాయేలు మీద యుద్ధం చేయాలనే ఆలోచన మానుకున్నాడు.శత్రువుకు భోజనం పెట్టాలనే భక్తుని ఒక ఆలోచన రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది, శత్రువు దొరకగానే హాని చేయాలనే ఆలోచన కాకుండా వారిని ప్రేమించాలనే తలంపు వస్తే చాలా సమస్యలు తీరిపోతాయి.
– రవికాంత్ బెల్లంకొండ
Comments
Please login to add a commentAdd a comment