ఒక మహారాజు తన రాజ్యంలో పెద్ద ఎత్తున తోట కూర పండించి అందరికీ దానం చేస్తుంటాడు. పెద్దలు, పండితులకు స్వయంగా తోటకూర కట్ట చేతికిస్తూ, ‘అంతకి ఇంతయితే ఇంతకి ఎంతవుతుంది?’ అని ప్రశ్న వేసేవాడు. ఆ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పేవారు కాదు. దాంతో రాజు నిరాశ పడేవాడు. కొంతకాలం తర్వాత ఒక పండితుడు వచ్చాడు. అతనికీ తోటకూర కట్టను ఇస్తూ ఇదే ప్రశ్న వేశాడు. దానికాయన, ‘‘అంతకు ఇంతయితే, ఇంతకు ఇంతే!’’ అన్నాడు. రాజు నిరుత్సాహ పడ్డాడు. అదెలా చెప్పగలిగేరని ప్రశ్నించాడు. దానికాయన చిర్నవ్వుతో ఇలా చెప్పేడు. ‘‘రాజా నీవు పూర్వ జన్మలో ఒక నిరుపేదవి. అదృష్టం కొద్దీ కొద్దిపాటి పెరడున్న ఒక పూరిల్లు ఉండేది. ఆ పెరటిలోనే తోటకూర పండించి, అందరికీ దానం చేసేవాడివి. ఆ పుణ్యం మూలంగానే ఈ జన్మలో మహారాజుగా పుట్టేవు. నీకు పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల, ఆ విషయాలన్నీ గుర్తున్నాయి. అప్పుడు కొద్దో గొప్పో తోటకూర దానం చేస్తే రాజునయి పుట్టేను కాబట్టి, ఇప్పుడు కూడా విరివిగా తోటకూర దానం చేస్తే ఇంతకంటే మంచిజన్మ లభిస్తుందన్నది నీ ఆలోచన. అంతేనా?’’ అని అడిగాడు.
అందుకు రాజు నిజమేనని అంగీకరిస్తూ, ‘‘అప్పుడు తోటకూర దానం చేస్తే రాజుగా పుట్టేను కదా, మరి ఈ జన్మలో ఇంతంత తోటకూర దానం చేస్తే ఇంత కంటే మంచి జన్మ ఎందుకు రాదు?’’ అని అడిగాడు.
అందుకు ఆ పండితుడు ‘‘రాజా! అప్పుడు నీవొక నిరుపేదవి అయినప్పటికీ, ఉన్నదానిలోనే ఇతరులకు సాయపడాలన్న సంకల్పంతో తోటకూర దానం చేసేవాడివి. ఫలితంగా ఈ జన్మలో మహారాజుగా çపుట్టావు. అయితే నీకు స్తోమత ఉండి కూడా ఇంతకంటె మంచి జన్మ కావాలన్న కోరికతో నీ స్థాయికి తగ్గట్టుగా ధనం, వెండి, బంగారం వంటివి దానం చేయకుండా, పిసినిగొట్టుతనంతో తోటకూర మాత్రమే దానం చేస్తున్నావు. దీని ఫలితంగా నీవు మరుజన్మలో యాయవారం చేసుకుని జీవించాల్సి వస్తుంది జాగ్రత్త’’ అన్నాడు.
ఆ మాటలకు రాజు సిగ్గుపడి, ఆయన కాళ్ళు పట్టుకుని తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. అందుకు ఆ పండితుడు ‘‘రాజా! నీవు ఇకనుంచి నీ తాహతుకు తగిన దానం చెయ్యి. ప్రజల మంచి చెడ్డలను
తెలుసుకుని అవసరంలో ఉన్న వారిని ఆదుకో. ఏది చేసినా నిండు మనస్సుతో చెయ్యి. నిరుపేదల ఆకలి తీర్చు. అన్నింటికీ మించి పేదలు, వికలాంగులు, వృద్ధులు ప్రజలు ఇతరుల మీద ఆధారపడి జీవించే బాధ లేకుండా స్వయంగా సంపాదించుకునే ఏర్పాటు చెయ్యి. మంచి జ్ఞానాన్నిచ్చే విద్యాదానం, నిరుపేదలు జబ్బుతో ఇబ్బంది పడకుండా వైద్యశాలలు కట్టించి ఉచిత వైద్య దానం చెయ్యి. అందరినీ ఆదరించు’’ అని చెప్పాడు.రాజు అప్పటినుంచి పనికి మాలిన దానాలు మానేసి, ప్రజల్ని పాలించడం పైనే దృష్టి పెట్టాడు. ఇందులోని నీతి ఏమిటంటే, ఎవరైనా సరే, తమ స్థోమతకు తగిన దానం చేయాలి. నిస్వార్థ బుద్ధితో చేసే దానం మాత్రమే భగవంతుడిని చేరుతుంది. స్థోమతకు మించిన దానాలు, అపాత్ర దానాల వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది.
– డి.వి.ఆర్. భాస్కర్
పాత్రోచిత దానం
Published Sun, Aug 19 2018 12:43 AM | Last Updated on Sun, Aug 19 2018 12:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment